మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడో ప్రపంచ యుద్ధం అడుగు దూరంలోనే ఉందని పశ్చిమ దేశాలను పుతిన్ హెచ్చరించారు. ఇక, తాజాగా జరిగిన రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ భారీ మెజార్టీతో మరోసారి ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దాదాపు 88శాతం ప్రజల మద్దతుతో ఆయన రష్యా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
అనంతరం, పుతిన్ మాట్లాడుతూ.. ఆధునిక ప్రపంచంలో ఏదైనా సాధ్యమే. మూడో ప్రపంచ యుద్ధం అడుగు దూరంలో ఉంది. రష్యా, అమెరికా నేతృత్వంలోని నాటో కూటమికీ మధ్య ఘర్షణ తలెత్తితే మాత్రం అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని హెచ్చరించారు. అయితే దీన్ని ఎవరూ కోరుకోవడం లేదన్నారు. ఇదే సమయంలో భవిష్యత్తులో తమ సైన్యాన్ని ఉక్రెయిన్‌కు పంపుతామన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వ్యాఖ్యలను పుతిన్ తప్పుబట్టారు.
ఇక, మార్చి 15 నుంచి 17 మధ్య రష్యా ఎన్నికల సమయంలో ఉక్రెయిన్ దాడులను తీవ్రతరం చేసింది. సరిహద్దు ప్రాంతాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించింది. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం అవసరమని మీరు భావిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు పుతిన్.. దాడులు ఇలాగే కొనసాగితే తమ భూభాగాన్ని రక్షించడానికి రష్యా మరింత ఉక్రేనియన్ భూభాగం నుంచి బఫర్ జోన్‌ను సృష్టిస్తుందని చెప్పారు.
ఇది చదవండి: రష్యా అధ్యక్ష ఎన్నికలు.. పుతిన్ ఘన విజయం
ఉక్రెయిన్‌లో నాటో సైనిక సిబ్బంది ఇప్పటికే ఉన్నారని, రష్యా యుద్ధభూమిలో ఇంగ్లిష్, ఫ్రెంచ్ దళాలు తలపడుతున్నాయి. ఇందులో వారికి ఎటువంటి మంచి జరగడం లేదు.. ఎందుకంటే వారు అక్కడ పెద్ద సంఖ్యలో చనిపోతున్నారని అన్నారు. ఈ రోజు జరుగుతున్న విషాద సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, కీవ్ పాలనలోని భూభాగాల్లో ఒక నిర్దిష్ట 'శానిటరీ జోన్'ని సృష్టించడానికి మేము ఏదో ఒక సమయంలో బలవంతపు చర్యలు చేపడతామని పుతిన్ చెపుకొచ్చారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించడానికి మాత్రం పుతిన్ నిరాకరించారు.
ఇదే సమయంలో ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని తీవ్రతరం చేయడాన్ని మెక్రాన్ ఆపివేసి.. శాంతి స్థాపనలో కీలక పాత్ర పోషించాలని తాను కోరుకుంటున్నానని పుతిన్ అన్నారు.. ‘నేను పదే పదే చెబుతున్నాను.. నేను మళ్లీ అదే చెబుతాను.. మేము శాంతి చర్చల కోసం ఉన్నాం.. కానీ శత్రువుల తూటాలు అయిపోతున్నందుకు కాదని వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment