
మాస్కో: దాదాపుగా 3,500 ఏళ్ల నాటి ఎలుగుబంటి కళేబరం ఏమాత్రం చెక్కుచెదరని స్థితిలో దొరికి సైంటిస్టులను సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. అది పూర్తిగా అతిశీతల వాతావరణంలో మంచులో కూరుకుపోవడమే ఇందుకు కారణం. రష్యాలో మాస్కోకు 4,600 కిలోమీటర్ల దూరంలో న్యూ సైబీరియన్ ఆర్చిపెలాగోలో భాగమైన బొల్షోయ్ ల్యాక్షోవ్‌స్కీ ద్వీపంలో జింకల వేటగాళ్లు దీన్ని 2020లో గుర్తించారు. ‘‘అది ఆడ ఎలుగుబంటి. గోధుమ రంగుతో, 1.55 మీటర్ల ఎత్తు, దాదాపు 78 కిలోల బరువుంది. చనిపోయేనాటికి బహుశా మూడేళ్ల వయసుంటుంది’’ అని తూర్పు సైబీరియాలోని లజరేవ్ మామూత్ మ్యూజియం లేబొరేటరీ చీఫ్ మాక్సిం చెప్రసోవ్ అంచనా వేశారు.
ఆయన సారథ్యంలోని సైంటిస్టుల బృందం దానికి శవపరీక్ష జరిపింది. ‘‘దాని ఒంట్లోని అతి మృదువైన కణజాలం కూడా గులాబి రంగులో ఇప్పటికీ ఏమాత్రం పాడవకుండా ఉండటం నిజంగా అద్భుతం. అలాగే పసుపు రంగులోని కొవ్వు కూడా. అంతేగాక దాని చివరి తిండి తాలూకు పక్షి ఈకలు, మొక్కలు కూడా పొట్టలో అలాగే ఉన్నాయి. అంత పురాతన కాలపు జంతువు తాలూకు కళేబరం ఇంత చక్కని స్థితిలో పరిపూర్ణంగా దొరకడం ఇదే తొలిసారి’’ అని పేర్కొంది. దాని మెదడు, అంతర్గత అవయవాలను కోసి లోతుగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా కణజాల, సూక్ష్మజీవ, జన్యుపరమైన పరీక్షల్లో తలమునకలుగా ఉన్నారట.
Comments
Please login to add a commentAdd a comment