List Of Scientists Who Died As Result Of Their Work, Details In Telugu - Sakshi
Sakshi News home page

అద్భుతాలు సృష్టించి వాటికే బలైన.. ఆ శాస్త్రవేత్తలు ఎవరో తెలుసా?

Published Sun, Mar 20 2022 9:22 AM | Last Updated on Sun, Mar 20 2022 11:29 AM

Scientists Who Died As Result Of Their Work - Sakshi

సాక్షి సెంట్రల్‌ డెస్క్‌: ఏదోచేశాం లే అన్నట్టు ఉండకుండా.. ఏదో ఒకటి చేయాలనే తపన ఉన్న శాస్త్రవేత్తలు వారు. ప్రపంచ గతినే మార్చిన ఆవిష్కరణలకు తోడ్పడినవారు. కానీ వారి విషయంలో విధి చిత్రమైన రాత రాసింది. మంచి మంచి ఆవిష్కరణలు, పరిశోధనలు చేసినవారిని.. ఆ ఆవిష్కరణలతోనే బలి తీసుకుంది. అలాంటి కొందరు శాస్త్రవేత్తలు, వారి పరిశోధనలు ఏమిటో తెలుసుకుందామా?

చదవండి: పీల్చే గాలిని సైతం విషంగా మార్చిన ఉక్రెయిన్‌ యుద్ధం!

సైకిల్‌ నుంచి బైక్‌ను తయారు చేసి.. 
దాదాపు 120 ఏళ్ల కింద.. దగ్గర్లో ఎక్కడికైనా వెళ్లాలంటే కాలినడక లేదంటే సైకిల్‌ మాత్రమే దిక్కు. పెట్రోల్‌ కార్లు, ఇతర వాహనాలు అప్పుడప్పుడే అందుబాటులోకి వస్తున్న ఆ సమయంలో.. అమెరికాకు చెందిన జనరల్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీ ఉద్యోగి విలియం నీల్సన్‌ సరికొత్త ఆవిష్కరణ చేశాడు. పెట్రోల్‌తో నడిచే చిన్నపాటి ఇంజిన్, మోటార్‌ను అభివృద్ధి చేసి.. మోటార్‌ సైకిల్‌ (బైక్‌)ను తయారు చేశాడు. కొన్నిసార్లు బాగానే టెస్ట్‌ డ్రైవ్‌ చేశాడు. కానీ 1903 అక్టోబర్‌లో మరో సారి టెస్ట్‌ చేస్తూ పడిపోయి చనిపోయాడు.

రేడియేషన్‌ గుట్టు తేల్చినా.. 
కొత్తగా ఏదైనా కనిపెట్టాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ప్రాణాలనూ పణంగా పెట్టాల్సి వస్తుంది. అలాంటి శాస్త్రవేత్త మేరీ క్యూరీ. కొత్త మూలకాలపై పరిశోధనలు చేసిన ఆమె.. రేడియం, పోలోనియం మూలకాలతోపాటు అణుధారి్మకత (రేడియేషన్‌)నూ గుర్తించారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో ఏకంగా నోబెల్‌ బహుమతులు కూడా పొందారు. చివరికి తాను పరిశోధన చేసిన మూలకాల రేడియేషన్‌ కారణంగా ‘అప్లాస్టిక్‌ ఎనీమియా (ఎముకమజ్జ దెబ్బతిని రక్తం ఉత్పత్తి తగ్గిపోవడం)’కు గురై 1934లో చనిపోయారు.

రాకెట్‌ టెక్నాలజీకి మార్గం చూపుతూ.. 
ప్రస్తుతం స్పేస్‌ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. భారీ రాకెట్లతో ఉపగ్రహాలను పంపడమే కాదు. మనుషులూ అంతరిక్షంలోకి వెళ్తున్నారు. ఈ రాకెట్‌ టెక్నాలజీ అభివృద్ధిలో కీలకపాత్ర వహించిన వారిలో ఆ్రస్టియాకు చెందిన మాక్స్‌ వాలియర్‌ ఒకరు. రాకెట్‌ ఇంజిన్లపై ప్రయోగాలు చేసిన ఆయన.. 19వ శతాబ్దంలో జర్మన్‌ స్పేస్‌ఫ్లైట్‌ సొసైటీని స్థాపించారు. ఆ సొసైటీతో ఒక్కచోట చేరిన శాస్త్రవేత్తలే రాకెట్‌ టెక్నాలజీకి ఆద్యులు. చిత్రమేమిటంటే.. మాక్స్‌ వాలియర్‌ తాను అభివృద్ధి చేసిన రాకెట్‌ ఇంజిన్‌తో కారును తయారుచేసి, టెస్ట్‌ డ్రైవ్‌ చేస్తుండగా పేలిపోయి చనిపోయారు.
 

టైటానిక్‌కు రూపకల్పన చేసి.. 
ప్రపంచ ప్రఖ్యాత టైటానిక్‌ ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. అంత విలాసవంతమైన భారీ నౌకను డిజైన్‌ చేసిన ఆర్కిటెక్ట్‌ల బృందం ఇన్‌చార్జి థామస్‌ ఆండ్రూ. టైటానిక్‌ నిర్మాణంలో ఉన్నంత కాలం దగ్గరుండి చూసుకున్నారు. 1912 ఏప్రిల్‌ 14న టైటానిక్‌ ప్రమాదానికి గురై మునిగిపోతున్నప్పుడు..ప్రయాణికులకు సాయం చేస్తూ నౌకలోనే ఉన్నారు. చివరికి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
 

రక్త మార్పిడి గుట్టు తేల్చబోయి.. 
ఏదైనా ప్రమాదం జరిగి బాగా రక్తం పోతే.. బయటి నుంచి రక్తం ఎక్కించాల్సిందే. వందేళ్ల కింద.. ఆధునిక వైద్యం ఇంకా అభివృద్ధి చెందుతున్న సమయంలో రక్తం ఎక్కించడమంటే పెద్ద టాస్కే. ఆ సమయంలో రష్యాకు చెందిన అలెగ్జాండర్‌ బొగ్డనోవ్‌ అనే డాక్టర్‌.. రక్త మారి్పడిపై విస్తృతంగా ప్రయోగాలు చేశాడు. 1925లో మరికొందరితో కలిసి హెమటాలజీ, బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూషన్‌ ఇన్‌స్టిట్యూట్‌నూ స్థాపించాడు. ప్రయోగాల్లో భాగం గా 1928లో మలేరియా, టీబీ సోకిన ఓ రోగి రక్తాన్ని తాను ఎక్కించుకున్నాడు. తన రక్తాన్ని ఆ రోగికి ఎక్కిం చాడు. ఆ రోగి కోలుకున్నా.. బొగ్డనోవ్‌  కొద్ది రోజులకే ఆ రెండు వ్యాధులతో చనిపోయాడు. ఆయన సంస్థ, పరిశోధనలు రక్త మార్పిడిలో కొత్త ఆవిష్కరణలకు దారి వేశాయి.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement