సమర్‌ఖండ్: ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌ఖండ్ నగరంలో శుక్రవారం ప్రారంభం కానున్న షాంఘై కో–ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత జిన్‌పింగ్ తదితర నేతలు హాజరుకానున్నారు. ఈ ఉదయం ప్రధాని మోదీ అక్కడకు చేరుకున్నారు.
ఈ సదస్సులో ప్రాంతీయ భద్రతా సవాళ్లు, వ్యాపార–వాణిజ్యం, ఇంధన సరఫరా వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. ఎస్సీఓ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ రష్యా అధినేత పుతిన్, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్‌కాత్ మిర్జీయోయెవ్‌తోపాటు ఇతర దేశాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై, ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మోదీ భేటీ అవుతారా? లేదా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
2001లో షాంఘైలో ఏర్పాటైన ఎస్సీఓలో చైనా, ఇండియా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్యదేశాలుగా కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఉజ్బెకిస్తాన్‌లో ఎస్సీఓ సదస్సు జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. సదస్సులో ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గురువారం ఉజ్బెకిస్తాన్‌కు బయలుదేరడానికి ముందు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
జిన్‌పింగ్, పుతిన్ సమావేశం
చైనా, రష్యా అధినేతలు షీ జిన్‌పింగ్, పుతిన్ గురువారం సమర్‌ఖండ్‌లో సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైన తర్వాత ఇరువురు నేతలు ముఖాముఖి భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా రష్యాకు జిన్‌పింగ్ మద్దతు ప్రకటించారు. ఉమ్మడి ప్రయోజనాల కోసం కలిసి పని చేస్తామన్నారు. సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రాత్రి ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌ఖండ్ సిటీకి చేరుకున్నారు. శుక్రవారం జరిగే సదస్సులో ఆయన పాలుపంచుకుంటారు.
ఇదీ చదవండి: పాక్‌కు తాలిబన్ల కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment