చెవులు చిల్లులు పడేలా కీచుమని అరిస్తే చిరాకనిపిస్తుంది. కానీ యాష్లే పెల్డన్ అస్సలు చిరాకు పడదు. సరికదా గంటల తరబడి అరుస్తుంది. ఎందుకంటే ఆమెకు ఎంత అరిస్తే అంత డబ్బులొస్తాయ్. అరిస్తే డబ్బులెందుకొస్తాయనే కదా మీ సందేహం. హాలీవుడ్ సినిమా, టీవీ ప్రొడక్షన్ సంస్థలిస్తాయి. స్క్రీమ్ ఆర్టిస్ట్ అయిన పెల్డన్ అలా మొత్తుకునేది సినిమాలు, టీవీ షోల కోసం. హీరోహీరోయిన్లకు డబ్బింగ్ చెప్పినట్టుగా, వాళ్లకు బదులు స్టంట్స్ చేసినట్టుగా... హీరోయిన్లకు బదులుగా ఆమె అరుస్తుంది.
మీరు చూసిన చాలా హాలీవుడ్ సినిమాల్లో ఆ అరుపులను అత్యంత సూక్ష్మగ్రాహకాలైన మైక్రోఫోన్స్‌తో రికార్డు చేస్తారు. అరుపులకు నటీనటులు డబ్బింగ్ చెప్పడం వల్ల వాళ్ల గొంతు పాడయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఆ స్థాయిలో వాళ్ల గొంతు ఉండకపోవచ్చు. అలాంటప్పుడే పెల్డన్‌లాంటివాళ్ల గొంతును వాడుకుంటారు సినిమా వాళ్లు. అరుపుల్లో పెల్డన్ నైపుణ్యాన్ని చిన్నవయసులోనే కనిపెట్టారు తల్లిదండ్రులు.
ఏడేళ్ల వయసులోనే కోపగొండి బాలికగా అవకాశం దక్కించుకుంది. బాల్యంలోనే వేధింపులకు గురైన బాలిక నిజజీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమాలో... ఆ బాలిక పాత్ర గట్టిగా కీచుమని అరుస్తూ ఉంటుంది. అదే ఆమెకు కెరీర్‌ను నిలబెట్టింది. అదేమంత గొప్పపని... గట్టిగా అరిచేస్తే సరిపోతుందనుకుంటారు చాలామంది. కానీ భయంవేసినప్పుడు, కోపం వచ్చినప్పుడు, ఆవేశంతో, సంతోషం ఎక్కువైనప్పుడు, ఏదైనా సాధించినప్పుడు.. ఇలా రకరకాల అరుపులుంటాయి.
ప్రత్యేకించి నొప్పితో, బాధ కలిగినప్పుడు... వచ్చే అరుపులు చాలా కష్టమైనవి. ఒక్కోసారి వరుసగా కొన్నిగంటలపాటు అరవాల్సి వస్తుం ది. అవన్నీ అవలీలగా చేసేస్తుంది పెల్డన్. అదెలా అంటే... ‘చిన్న కీటకాన్ని చూసినా నేను గట్టిగా మొత్తుకుంటా. నాకది సహజంగా వచ్చింది’ అని చెబుతుంది. 20 ఏళ్లొచ్చేసరికి చాలా సినిమాలు, టీవీ సిరీసులకు తన అరుపులను ఇచ్చేసిన పెల్డన్ ఇప్పుడు డబ్బింగ్ కూడా చెప్పేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment