నెట్‌ఫ్లిక్స్ నార్కోస్‌లోని ఓ దృశ్యం.. పక్కన నీటి ఏనుగులు (ప్రతీకాత్మక చిత్రం)
ఒకప్పుడు వాటి సంఖ్య నాలుగు మాత్రమే. ఇప్పడు ఆ కౌంట్ 130కి చేరింది. పెరిగితే పెరిగాయ్. కానీ, ఆ ప్రాంతమంతా కంపు కంపు చేస్తున్నాయి. అందుకే వాటిని వదిలించుకునేందుకు అధికారులు, ప్రభుత్వం శతవిధాల ప్రయత్నించాయి. ఇక చివరి ప్రయత్నంగా వాటిని భారత్‌కు తరలించేందుకు సిద్ధం అయ్యాయి.
కొలంబియా ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. డెబ్భై హిప్పోపోటమస్‌లను పట్టుకుని వాటిని భారత్‌తో పాటు మెక్సికోకు తరలించాలని నిర్ణయించుకుంది. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఇవి డ్రగ్ లార్డ్‌గా పేరుగాంచిన పాబ్లో ఎస్కోబార్‌కు చెందినవి కావడం.
1980లో ఎస్కోబార్ నాలుగు హిప్పోపోటమస్(నీటి ఏనుగులను) ఆఫ్రికా నుంచి అక్రమంగా తెప్పించుకున్నాడు. ఆ టైంలో అతని దగ్గర ఏనుగులు, జిరాఫీలు.. ఇలా జంతువుల కలెక్షన్స్‌తో ఒక పెద్ద జూ ఉండేది. పశ్చిమ ప్రాంతంలోని తన ఎస్టేట్‌లో వీటిని ఉంచాడు. అయితే.. 1991లో ఎస్కోబార్ లొంగిపోయాక.. అక్కడి ప్రభుత్వం వాటికి స్వేచ్ఛ కల్పించింది. అటుపై.. ఆ ఈ ముప్పై ఏళ్లలో ఆ నాలుగు నీటి ఏనుగుల సంఖ్య కాస్త 130కి చేరుకుంది.
ప్రస్తుతం అవి మాగ్డలీనా నది ప్రాంతంలో ఉంటున్నాయి. అయితే.. అక్కడి నేల సారవంతాన్ని పాడు చేయడంతో పాటు, అక్కడి నీటిని కలుషితం చేస్తున్నాయి. మొక్కలను పాడు చేస్తున్నాయి. పైగా స్థానికులు సైతం వాటి వల్ల ప్రాణపాయం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో.. వాటి జనాభాను నియంత్రించేందుకు కొలంబియా ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ, ఆ చర్యలు ఫలించలేదు. చేసేది లేక వాటిని చంపేందుకు కూడా అనుమతులు మంజూరు చేసింది. దీంతో తీవ్ర ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంది.
ఇక చివరి ప్రయత్నంగా వాటిని దూరంగా తరలించడమే మార్గమని కొలంబియా ప్రభుత్వం భావిస్తోంది. భారత్‌కు 60, మెక్సికోకు పది హిప్పోలను తరలించాలని నిర్ణయించుకుంది కొలంబియా ప్రభుత్వం. అయితే.. ఈ కొలంబియా ప్రతిపాదనపై భారత్ స్పందన తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment