ఢాకా: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా చేస్తున్న అల్లర్లు కొనసాగుతున్నాయి. నిరసనకారుల అల్లర్లు తీవ్ర హింసాత్మకంగా మారటంతో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి.. తన సోదరితో కలిసి భారత్‌కు వచ్చారు. అయితే ఆమె భారత్ చేరిన తర్వాత నుంచి నిరసనకారులు షేక్‌హసీనా పార్టీ నేతలను టార్గేట్ చేసి దాడులు మరింత తీవ్రం చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంటోంది. దేశవ్యాప్తంగా షేక్‌హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నేతలు, కార్యకర్తల ఇళ్లు, వ్యాపార సంస్థలను ధ్వంసం చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలినట్లు స్థానిక మీడియాలో వెల్లడిస్తోంది.
దేశ రాజధాని ఢాకాకు 100 కి.మీ దూరంలోని కొమిల్లా నగరంలో మాజీ కౌన్సిలర్ ఎండీ షా ఆలం ఇంటికి నిరసనకారలు నిప్పుపెట్టారు. మంగళవారం ఎంపీ షఫీకుల్ ఇస్లాం షిముల్ ఇంటికి ఆందోళనకారులు గుంపు నిప్పు పెట్టడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. ఇంట్లో, బాల్కనీల్లో మృతదేహాలు లభ్యమయ్యాయి. మంగళవారం ఢాకాలోని అవామీలీగ్ పార్టీ కార్యాలయాలకు నిసరనకారులు నిప్పుపెట్టి ధ్వంసం చేశారు. దేశవ్యాప్తంగా షేక్ హసీనా పార్టీ నేతలు, మైనార్టీలైన హిందువులే లక్ష్యంగా దాడులకు తెగపడ్డారు. సోమ, మంగళవారం సుమారు 97 ప్రాంతాల్లో మైనార్టీలకు సంబంధించిన ఇళ్లు, షాప్‌లపై నిరసనకారులు దాడులు జరిగినట్లు బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యతా మండలి ప్రధాన కార్యదర్శి రాణా దాస్‌గుప్తా పేర్కొన్నారు.
దక్షిణ బాగర్‌హాట్ జిల్లాలో ఒక హిందూ వ్యక్తిపై తీవ్రంగా దాడి చేయటంతో చికిత్స పొందుతూ మరణించినట్లు స్థానిక ఆసుపత్రి అధికారి తెలిపారు. ఖుల్నా డివిజన్‌లోని జబీర్ ఇంటర్నేషనల్ హోటల్‌కు నిరసనకారులు నిప్పుపెట్టిన ఘటనలో 24 మంది సజీవదహనం అయ్యారు. ఈ హోటల్ జషోర్ జిల్లా అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి షాహిన్ చక్లాదర్‌కు చెందినది. మృతదేహాలు హోటల్‌లోని వేర్వేరు అంతస్తుల్లో పడి ఉన్నాయని ఖుల్నా ఫైర్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ మమున్ మహమూద్ వెల్లడించారు. ఇప్పటివరకు జరిగిన నిరసనల్లో మొత్తం 440 మంది మరణించగా.. షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీకి చెందిన నేతలు 20 మంది ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంటోంది.
మరోవైపు.. షేక్ హసీనా దేశం విడిచివెళ్లిపోవటంతో మంగళవారం బంగ్లాదేశ్ పార్లమెంట్‌ను రద్దు చేశారు. నోబెల్ విజేత ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారని మహ్మద్ షహబుద్దీన్ ప్రకటించారు. ఆయన ఆర్మీ, విద్యార్థి నాయకులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘డాక్టర్ ముహమ్మద్ యూనస్ చీఫ్‌గా నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాము’అని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment