ఆమ్‌స్టర్‌డ్యామ్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 298 మంది మృతికి కారణమైన నిందితులకు ఆలస్యంగా అయినా కఠిన శిక్ష పడింది. ఎంహెచ్17 మలేసియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఘటనలో నెదర్లాండ్స్ కోర్టు ఇద్దరు రష్యన్లు, ఒక ఉక్రెయిన్ వేర్పాటువాదికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
2014 జూలై 17న నెదర్లాండ్స్‌లోని అమ్‌స్టర్‌డ్యామ్ నుంచి మలేసియాలోని కౌలాలంపూర్‌కు బయలుదేరిన బోయింగ్ 777 విమానాన్ని రష్యా అనుకూల ఉక్రెయిన్ వేర్పాటువాదులు బక్ మిస్సైల్ ప్రయోగించి, కూల్చేశారు. విమానం ఉక్రెయిన్ భూభాగంలో కూలిపోయింది. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది సహా మొత్తం 298 మంది మరణించారు.
ఈ కేసుకు సంబంధించి మరో వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేసింది డచ్ కోర్టు. కోర్టు తీర్పుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో రష్యా పాత్ర ఉందనే విషయం స్పష్టమైందని బాధిత కుటుంబాలు పేర్కొంటున్నాయి. నెదర్లాండ్స్‌కు చెందిన 196 మంది, 43 మంది మలేసియన్ వాసులు, 38 మంది ఆస్ట్రేలియాకు చెందిన వాళ్లు.. ఇలా మొత్తం పది దేశాలకు చెందిన ప్రయాణికులు ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యారు. అయితే రష్యా మాత్రం అది ఉక్రెయిన్ వేర్పాటువాదుల పని అయ్యిండొచ్చని, అందులో మాస్కో ప్రమేయం ఏం లేదని పాత పాటే పాడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment