న్యూయార్క్ : కరోనా వైరస్ నిరోధానికి అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్‌లు ప్రపంచ జనాభాలో 60 నుంచి 70 శాతం ప్రజలకు చేరేందుకు మరో రెండేళ‍్ల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కట్టడికి దాదాపు 40 వ్యాక్సిన్లపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని, వాటిలో 9 వ్యాక్సిన్లు రెండు, మూడవ దశ పరీక్షలను చేపడుతున్నాయని చెప్పారు. కీలక దశ వ్యాక్సిన్ పరీక్షలను చేపడుతున్న కంపెనీలు పరీక్షల్లో వెల్లడైన అంశాలను ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ప్రచురిస్తాయని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ దేశాలన్నింటిలో 60 నుంచి 70 శాతం మంది ప్రజలకు వ్యాక్సిన్ అందడానికి రెండేళ్ల సమయం పడుతుందని చెప్పుకొచ్చారు.
2022 సంవత్సరాంతానికి మనం ఈ లక్ష్యానికి చేరుకునే అవకాశం ఉందని ఆమె అంచనా వేశారు. కోవిడ్-19 వ్యాక్సిన్‌లు భారత్‌తో సహా పలు దేశాల్లో కొన్ని డాలర్లకే అందుబాటులో ఉంటాయని సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. రానున్న శీతాకాలంలో వైరస్ బారినపడకుండా ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రపరుచుకోవడం, గాలి..వెలుతురు లేని ప్రాంతాల్లో గుమికూడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొన్నారు. మరోవైపు దేశంలో కరోనా వైరస్ పరిస్థితి కొంతమేర మెరుగవడం ఊరట కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు ఆగస్ట్ తర్వాత మంగళవారం అతితక్కువగా నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా 900 మార్క్ దిగువకు పడిపోయిందని అధికారులు వెల్లడించారు. మరో రెండు వారాల పాటు కేసుల సంఖ్య తగ్గడం కొనసాగితే భారత్ కోవిడ్-19 ముమ్మర దశను అధిగమించినట్టేనని నిపుణులు పేర్కొంటున్నారు. చదవండి : కరోనా టీకా వీరికే ఫస్ట్..
Comments
Please login to add a commentAdd a comment