
ప్రజల కనీస అవసరాలు తీర్చలేక ద్వీపదేశం శ్రీలంక అల్లాడిపోతోంది. ఆహార, ఆర్థిక సంక్షోభంతో సింహళ దేశం విలవిల్లాడుతోంది. విదేశీ మారక నిల్వలు గణనీయంగా పడిపోవడంతో కీలక దిగుమతులు నిలిచిపోయాయి. పెట్రోల్ నుంచి కూరగాయల వరకూ అన్నీంటికీ కొరతే. డీజిల్ లేక బంకులు మూతపడ్డాయి. ఔషధాల కొరతతో శస్త్రచికిత్సలు ఆగిపోయాయి. అత్యవసరాలతోపాటు నిత్యావసరాలూ లభించక ప్రజలు అవస్థలు పడుతున్నారు.
ఇంధన కొరత కారణంగా శ్రీలంకలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో కరెంట్ కోతలు పెరిగాయి. తాజాగా ఈ కోతల సమయాన్ని మరింత పెంచుతూ లంక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజుకు 7 గంటలపాటు కరెంట్ సరఫరా నిలిపివేస్తుండగా.. దాన్ని 10 గంటలకు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. అంటే దేశవ్యాప్తంగా రోజుకు 10 గంటలపాటు పవర్ కట్ ఉంటుంది. విద్యుత్ కోతలు పెరగడంతో లంకేయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాత్రి వేళల్లో వీధి దీపాలు వెలగక నగరాలు అంధకారంగా కన్పిస్తున్నాయి. రెస్టారెంట్లు, వీధి వ్యాపారులు క్యాండిల్ వెలుతురులో వ్యాపారాలు చేస్తున్నారు. మరోవైపు లంక దీనస్థితిపై భారత విదేశాంగమంత్రి జైశంకర్ ట్విట్టర్‌లో స్పందించారు. ఈ విషయంలో భారత్ ఎలా సహకరించగలదో తెలుసుకోమని మన దేశ రాయబారిని ఆదేశించారు. ఆర్థిక సంక్షోభంలో అల్లాడుతున్న శ్రీలంకకు బిలియన్ డాలర్ల రుణం ఇవ్వనున్నట్టు భారత్ ఇప్పటికే ప్రకటించింది.
(చదవండి: రష్యా దురాక్రమణ.. ఆఫీస్‌కు లేటయి బతికిపోయాడు!)
Comments
Please login to add a commentAdd a comment