కొలంబో: శ్రీలంక.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయి దీన స్థితికి చేరుకుంది. నిత్యావసరాలు దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. పెట్రోల్, గ్యాస్ కోసం రోజుల తరబడి క్యూ లైన్లలో నిలుచోవాల్సిన పరిస్థితులు. పెరుగుతున్న ధరలతో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పాలకుల అసమర్థత వల్లే దేశం పరిస్థితి దారుణంగా మారిపోయిందనే కారణంతో తిరుగుబాటు చేశారు. వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. అధ్యక్షుడు, ప్రధాని భవనాలను చుట్టు ముట్టారు. దీంతో ప్రభుత్వం తలవంచక తప్పలేదు. ఇది ఇలా ఉండగా.. శ్రీలంక ప్రజలు చేస్తున్న ఆందోళనలు ఆదివారంతో వందవ రోజుకు చేరుకున్నాయి. ఈ క్రమంలో ఆందోళనలు మొదలైనప్పటి నుంచి ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఏప్రిల్ 9న రెండు రోజుల నిరసనలతో..
అధ్యక్షుడు గొటబయ రాజపక్స సహా కుటుంబ పాలనను గద్దె దించటమే లక్ష‍్యంగా.. ఫేస్‌బుక్, ట్విట్టర్, టిక్‌టాక్‌లలో పోస్టులు వెలిచాయి. వాటితో తీవ్రంగా ప్రభావితమైన ప్రజలు రోడ్లపైకి వచ్చారు. సింహాళులకు తోడు మైనారిటీ తమిళులు, ముస్లింలు ఆందోళనల్లో పాల్గొన్నారు. మొదట ఏప్రిల్ 9న రెండు రోజుల నిరసనలకు పిలుపునిచ్చారు. అధ్యక్షుడు రాజపక్స కార్యాలయం ముందు వేల మంది ప్రజలు నిరసనలు చేపట్టారు. నిర్వాహకులు ఊహించినదానికంటే.. ఎక్కువ మంది ఈ ఆందోళనకు రావటం గమనార్హం.
మేలో మహింద రాజీనామా..
నిరసనలు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ప్రజలను శాంతింపజేసేందుకు మహింద రాజపక్స ఈ ఏడాది మే నెలలో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో రణీల్ విక్రమ సింఘేను ప్రధానిగా నియమించారు గొటబయ. పార్లమెంట్‌లో ఒక్క సీటు ఉన్న రణీల్‌కు ప్రధాని పదవికి ఇవ్వటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఆ చర్య సైతం ఆందోళన కారులను శాంతింపజేయకపోగా.. మరింత కోపానికి గురి చేసింది. దీంతో అధ్యక్ష భవనాన్ని వేలాది మంది చుట్టు ముట్టారు. ప్రధాని రణీల్ విక్రమసింఘే ప్రైవేటు ఇంటికి నిప్పు పెట్టారు.
సింగపూర్‌కు గొటబయ..
అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టేందుకు వేలాది మంది లంకేయులు వస్తున్నారనే సమాచారంతో ఈనెల 12న దేశం దాటారు అధ్యక్షుడు గొటబయ రాజపక్స. మాల్దీవులకు వెళ్లి అక్కడి నుంచి సింగపూర్ వెళ్లిపోయారు. ఆ తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు రణీల్ విక్రమసింఘే. కొత్త అధ్యక్షుడిని ఈనెల 20న ఎన్నుకోనున్న నేపథ్యంలో అప్పటి వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.
మరోవైపు.. రణీల్ విక్రమ సింఘేకు వ్యతిరేకంగా ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు నిరసనకారుల ప్రతినిధి.'రణీస్ విక్రమ సింఘేకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని ఇందులో పాల్గొన్న గ్రూప్‌లతో చర్చిస్తున్నాం.' అని పేర్కొన్నారు. అయితే.. గొటబయ రాజపక్స దేశం విడిచిన తర్వాత నిరసనకారుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. అధ్యక్ష, ప్రధాని అధికారిక భవనాలను ఖాళీ చేశారు.
ఇదీ చూడండి: అమెరికాలో 'గొటబయ' కుమారుడి ఇంటి ముందు ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment