
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్న శ్రీలంకలో పరిస్థితులు ఇప్పట్లో చక్కబడేలా కనిపించటం లేదు. దేశంలో ఇంధన కొరత తీవ్రంగా వేధిస్తోంది. పెట్రోల్ బంకుల వద్ద రోజుల తరబడి క్యూలైన్లలో నిలుచోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలోనే కీలక ప్రకటన చేశారు ఆ దేశ ఇంధన శాఖ మంత్రి. మరో 12 నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని స్పష్టం చేశారు. దేశంలో విదేశీ మారక నిలువల కొరత ఉన్నందున వచ్చే 12 నెలల పాటు చమురు దిగుమతులపై పరిమితులు కొనసాగుతాయని తెలిపారు.
‘దేశంలో విదేశీ మారక నిలువల కొరత కారణంగా.. వచ్చే 12 నెలల పాటు చమురు దిగుమతులు పరిమితంగానే ఉంటాయి.’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు మంత్రి కాంచన విజేసేకర. చమురు రేషన్ వ్యవస్థను తీసుకురావటం వెనుకున్న కారణాలను వివరించారు. అధ్యక్షుడిగా రణీల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టిన తర్వాత సంక్షోభాన్ని కట్టడి చేసేందుకు తొలి అడుగుగా ఇంధన రేషన్ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు చెప్పారు.
పాఠశాలలు ప్రారంభం..
దేశంలో తీవ్ర చమురు కొరత ఉన్నప్పటికీ పాఠశాలలను సోమవారం పునఃప్రారంభించింది శ్రీలంక. అయితే.. ప్రభుత్వ ఉద్యోగులు మరో నెలరోజుల పాటు ఇంటి నుంచే పని చేయాలని కోరింది. మరోవైపు.. వచ్చే ఆగస్టులో 30వేల టన్నుల చొప్పున రెండు సార్లు చమురు దిగుమతులు చేసుకోనున్నట్లు లంక ఐఓసీ ఎండీ మనోజ్ గుప్తా తెలిపారు. ‘సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాం. పరిశ్రమలకు ఇంధన సరఫరా మా తొలి ప్రాధాన్యం.’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Sri Lanka: శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్తత.. నిరసనలపై కొత్త అధ్యక్షుడి ఉక్కుపాదం!
Comments
Please login to add a commentAdd a comment