Fuel shortage
-
Israel-Hamas war: గాజాలో కన్నీటి చుక్కలు
రఫా/టెల్ అవీవ్: ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులతో దద్దరిల్లుతున్న గాజా స్ట్రిప్‌లో పరిస్థితులు మరింత దయనీయంగా మారుతున్నాయి. ప్రధానంగా ఇంధన కొరత వల్ల సహాయక చర్యలు ఎక్కడివక్కడే నిలిచిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో వాహనాలు మూలనపడ్డాయి. క్షిపణుల దాడుల్లో ధ్వంసమైన భవనాల శిథిలాలను తొలగించే అవకాశం లేకుండాపోయింది. వాటికింద చిక్కుకుపోయిన మృతదేహాలు కుళ్లిపోతున్నాయి. మరోవైపు ఇంధనం కొరతవల్ల ఆసుపత్రుల్లో జనరేటర్లు పనిచేయడం లేదు. డాక్టర్లు శస్త్రచికిత్సలు ఆపేస్తున్నారు. క్షతగాత్రులకు కనీస వైద్య సేవలు కూడా అందడం లేదు. ఫలితంగా మృతుల సంఖ్య పెరిగిపోతోంది. నిత్యం పదుల సంఖ్యలో మృతదేహాలు ఆసుపత్రుల నుంచి శ్మశానాలకు చేరుతున్నాయి. ఈ పరిణామాలపై ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ‘యూఎన్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్’ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గాజాకు ఇంధన సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని బుధవారం ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేసింది. ఇంధనం సరఫరా చేయకపోతే గాజాలో సహాయక చర్యలు అతిత్వరలో పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని వెల్లడించింది. ససేమిరా అంటున్న ఇజ్రాయెల్ గాజా జనాభా 23 లక్షలు కాగా, యుద్ధం ప్రారంభమైన తర్వాత వీరిలో 14 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 6 లక్షల మంది ఐక్యరాజ్యసమితి సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈజిప్టు సరిహద్దు నుంచి ఆహారం, నిత్యావసరాలను గాజాకు చేరవేసేందుకు ఇజ్రాయెల్ ఇటీవల అనుమతి ఇచి్చంది. దాంతో కొన్ని వాహనాలు గాజాకు చేరుకున్నాయి. పరిమితంగా అందుబాటులోకి వచి్చన ఆహారం, నిత్యావసర సామగ్రిని రేషనింగ్ విధానంలో పాలస్తీనియన్లకు సరఫరా చేస్తున్నారు. ఇంధన కొరత మాత్రం తీరడం లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ పెట్రోల్, డీజిల్‌ను గాజాలోకి అనుమతించే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ సైన్యం తెగేసి చెబుతోంది. చేతులేత్తేయడమే మిగిలింది ‘యూఎన్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్’ ప్రస్తుతం గాజాలో సహాయక చర్యల్లో నిమగ్నమైంది. క్షతగాత్రులకు వైద్య సేవలు అందిస్తోంది. విద్యుత్ లేక, పెట్రోల్, డీజిల్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇకపై క్షతగాత్రులకు సేవలందించే పరిస్థితి లేదని చెబుతోంది. ఆహార ధాన్యాలు పంపిణీ చేయడానికి కూడా వాహనాలకు ఇంధనం లేదని పేర్కొంటోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము పూర్తిగా చేతులెత్తేయడం తప్ప చేసేదేమీ లేదని ‘యూఎన్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్’ అధికార ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు. గాజాలోని ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో మూడింట రెండొంతులు ఇప్పటికే మూతపడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. సిరియాలో 8 మంది జవాన్లు మృతి ఇజ్రాయెల్–హమాస్ మధ్య మొదలైన యుద్ధం మధ్యప్రాచ్యంలో అగ్గి రాజేస్తోంది. హమాస్‌కు ఆయుధాలు, ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలిచేవారిని వదిలిపెట్టబోమని ఇజ్రాయెల్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. హమాస్‌కు సిరియా ప్రభుత్వం మద్దతు పలుకుతుండడంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ సైన్యం బుధవారం దక్షిణ సిరియాలోని సైనిక శిబిరాలపై వైమానిక దాడులు ప్రారంభించింది. బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో 8 మంది సిరియా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సిరియా నుంచి తమపై రాకెట్ దాడులు జరుగుతుండడంతో తిప్పికొట్టామని, వైమానిక దాడులు చేసి సిరియా సైనిక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఒక్కతాటిపైకి మిలిటెంట్ సంస్థలు! ఇజ్రాయెల్ సైన్యం దూకుడు పెంచిన నేపథ్యంలో లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా ముఖ్య నేత హసన్ నస్రల్లా బుధవారం హమాస్, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ అగ్రనాయకులతో సమావేశమయ్యారు. తాజా పరిణామాల గురించి చర్చించినట్లు సమాచారం. ఇజ్రాయెల్ సైన్యంపై హమాస్, హెజ్బొల్లా, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ సంస్థలు కలిసి పోరాడే సూచనలు కనిపిస్తున్నాయి. గాజాపై భూతల దాడులకు దిగితే తగిన మీకు గుణపాఠం నేర్పుతామంటూ ఇజ్రాయెల్‌ను హెజ్బొల్లా హెచ్చరించింది. హమాస్‌కు ఇరాన్ సాయం అందిస్తోందని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్ హగారీ చెప్పారు. ఇరాన్‌లోని మిలిటెంట్ సంస్థలు ఇరాక్, యెమెన్, లెబనాన్ భూభాగల నంచి ఇజ్రాయెల్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయని, వాటిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బందీల విడుదలకు ఖతార్ యత్నాలు హమాస్ చెర నుంచి బందీలు విడుదలయ్యే విషయంలో మరిన్ని సానుకూల పరిణామాలు చూడొచ్చని ఖతార్ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహా్మన్ అల్–థానీ చెప్పారు. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇప్పటికే నలుగురు బందీలు విడుదలైన సంగతి తెలిసిందే. మిగిలినవారిని సైతం విడుదల చేసేలా హమాస్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయని ఖతార్ ప్రధానమంత్రి తెలిపారు. బందీల విడుదలకు చొరవ చూపుతున్న ఖతార్ ప్రభుత్వానికి ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మండలి అధినేత టాగీ హనెగ్బీ కృతజ్ఞతలు తెలియజేశారు. మధ్యప్రాచ్యం నుంచి అమెరికన్ల తరలింపు! ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణ మధ్యప్రాచ్యంలో ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తే, అక్కడున్న తమ పౌరులను స్వదేశానికి తరలించాలని యోచిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. ఇజ్రాయెల్ నుంచి అమెరికా పౌరుల తరలింపు ఇప్పటికే ప్రారంభమైంది. చాలామంది అమెరికన్లు ఇజ్రాయెల్ వదిలి వెళ్లిపోయారు. మధ్యప్రాచ్య దేశాల్లో పెద్ద సంఖ్యలో అమెరికన్లు ఉన్నారు. యుద్ధం గనుక విస్తరిస్తే వారి భద్రతకు భరోసా ఉండదని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పరిస్థితి అదుపు తప్పకముందే వారిని క్షేమంగా స్వదేశానికి రప్పించాలని నిర్ణయానికొచి్చనట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా సౌరే అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్ తాజా పరిస్థితులపై చర్చించారు. ఘర్షణను నివారించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. రెండు రోజుల్లో 750 మంది మృతి గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడుల తీవ్రత పెంచింది. బుధవారం కొన్ని టార్గెట్లపై క్షిపణులు ప్రయోగించింది. హమాస్ స్థావరాలను, సొరంగాలను, ఆయుధాగారాలను, సమాచార వ్యవస్థను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మంగళవారం, బుధవారం జరిగిన దాడుల్లో గాజాలో 750 మందికిపైగా జనం మృతిచెందారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో ఇప్పటిదాకా గాజాలో 5,791 మందికిపైగా మరణించారని, 16,297 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించింది. గాజాలోని మృతుల్లో 2,300 మంది మైనర్లు ఉన్నారని వెల్లడించింది. వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో 96 మంది పాలస్తీనియన్లు బలయ్యారు. 1,650 మంది క్షతగాత్రులుగా మారారు. 10 మంది యూదులను చంపేశా! ఇజ్రాయెల్‌లో 10 మంది యూదులను చంపేశానంటూ హమాస్ మిలిటెంట్ ఒకరు తన తల్లిదండ్రులతో మొబైల్ ఫోన్లో చెప్పిన ఆడియో రికార్డు ఒకటి వెలుగులోకి వచి్చంది. ఇజ్రాయెల్ రక్షణ శాఖ దీన్ని విడుదల చేసింది. గాజా సరిహద్దులో ఇజ్రాయెల్ భూభాగంలోని కిబుట్జ్‌లో తానున్నానని, తాను ఒక్కడినే 10 మంది యూదులను మట్టుబెట్టానని సదరు మిలిటెంట్ గాజాలోని ఉన్న తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి గర్వం తొణికిసలాడే స్వరంతో ఆనందంగా చెప్పాడు. దాంతో వారు అతడిని శభాష్ అంటూ అభినందించారు. మిలిటెంట్ ఉపయోగించిన ఫోన్ అతడి చేతిలో చనిపోయిన ఇజ్రాయెల్ పౌరుడిదే కావడం గమనార్హం. అయితే, ఈ ఆడియో రికార్డు నిజమైందో కాదో ఇంకా నిర్ధారణ కాలేదని ఇజ్రాయెల్ రక్షణ శాఖ వెల్లడించింది. -
COP27: భూమాత రక్షణకు భుజం కలిపి...
షెర్మ్–ఎల్–షేక్(ఈజిప్ట్): ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న వాతావరణ మార్పులు, ఉక్రెయిన్–రష్యా యుద్ధం, ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణం, ఆహారం, ఇంధన కొరత వంటి ప్రతికూల పరిణామాల నడుమ భాగస్వామ్యపక్షాల సదస్సు (కాప్–27) ఆదివారం ప్రారంభమయ్యింది. ఈజిప్ట్‌లోని ఎర్ర సముద్ర తీరప్రాంత నగరం షెర్మ్–ఎల్–షేక్ ఇందుకు వేదికగా మారింది. ప్రపంచదేశాల నుంచి వందలాది మంది ప్రతినిధులు హాజరయ్యారు. వాతావరణ మార్పులు, దుష్పరిణామాలు, నియంత్రణ చర్యలు, గత ఒప్పందాల అమలు తీరుపై రెండు రోజులపాటు విస్తృతంగా చర్చించనున్నారు. కాప్–27లో భాగంగా ఈ నెల 7, 8న జరిగే సమావేశాలకు పలు దేశాల అధినేతలు హాజరుకానున్నారు. వాతావరణ మార్పుల నియంత్రణే లక్ష్యంగా గతంలో కాప్ సదస్సులు జరిగాయి. అయితే, ఆశించిన లక్ష్యాలేవీ నెరవేరలేదు. అగ్రదేశాల సహాయ నిరాకరణే ఇందుకు కారణం. తాజా సదస్సులో ఏం తేలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. తరానికి ఒకసారి వచ్చే అవకాశం వాతావరణ మార్పులు భూగోళంపై సమస్త జీవజాలానికి విసురుతున్న పెను సవాళ్లపై ఐక్యరాజ్యసమితికి చెందిన ‘ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్’ చైర్మన్ హోయిసంగ్ లీ ఆందోళన వ్యక్తం చేశారు. కాప్–27లో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. భూతాపాన్ని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు సన్నద్ధం కావాలని, హరితగృహ(గ్రీన్ హౌజ్) వాయువుల ఉద్గారాన్ని తక్షణమే తగ్గించుకోవాలని పిలునిచ్చారు. మన జీవితాలను, మన భూగ్రహాన్ని కాపాడుకొనేందుకు తరానికి ఒకసారి వచ్చే అవకాశం ఇదేనని చెప్పారు. ఇంకెన్ని హెచ్చరికలు కావాలి? గత ఏడాది గ్లాస్గోలో జరిగిన కాప్ సదస్సులో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో ప్రపంచదేశాలు చెప్పుకోదగ్గ పురోగతి సాధించాయని కాప్–26 అధ్యక్షుడు, బ్రిటిష్ రాజకీయవేత్త అలోక్ శర్మ తెలిపారు. కర్బన ఉద్గారాల నియంత్రణపై మరిన్ని లక్ష్యాలను ఏర్పర్చుకోవడం, 2015 పారిస్ ఒప్పందంలోని నిబంధనలను ఖరారు చేయడం, బొగ్గు వినియోగాన్ని దశలవారీగా తగ్గించుకోవడం వంటివి ఈ లక్ష్యాల్లో ఉన్నాయని తెలిపారు. ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీలకు (2.7 ఫారన్‌హీట్) పరిమితం చేయాలన్న ఆశయాన్ని కొనసాగించాలని కోరారు. పారిస్ ఒప్పందంలో ఇదే అత్యంత కీలక లక్ష్యమని గుర్తుచేశారు. ఉష్ణోగ్రత పెరుగుదలను కచ్చితంగా నియంత్రించాలని, దీన్ని పారిశ్రామిక విప్లపం నాటికంటే ముందున్న ఉష్ణోగ్రతకు తీసుకురావాలన్నారు. అయితే, ఈ దిశగా సాగుతున్న ప్రయత్నాలకు కొన్ని బడా దేశాలు తూట్లు పొడుస్తున్నాయని అలోక్ శర్మ తీవ్రంగా ఆక్షేపించారు. ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ దండయాత్ర వల్ల అంతర్జాతీయంగా సంక్షోభాలు పుట్టుకొచ్చాయని గుర్తుచేశారు. పలు దేశాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయని వాపోయారు. ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ అంశాలపై దృష్టి పెట్టేలా సామర్థ్యం పెంచుకోవాలన్నారు. మాటలు కట్టిబెట్టి కార్యాచరణలోకి దిగాలన్నారు. ప్రపంచ దేశాల అధినేతలకు ప్రపంచ నుంచి ఇంకా ఎన్ని మేల్కొల్పులు, హెచ్చరికలు అవసరం? అని అలోక్ శర్మ ప్రశ్నించారు. సదస్సులో యూఎన్ క్లైమేట్ చీఫ్ సైమన్ స్టియిల్ మాట్లాడారు. పారిస్ ఒప్పందంలోని లక్ష్యాలను సాధించడానికి అన్ని ప్రయత్నాలు సాగిస్తున్నామని ఆతిథ్య దేశమైన ఈజిప్ట్ విదేశాంగ మంత్రి సమేహ్ షౌక్రీ చెప్పారు. కాప్–27 అధ్యక్షుడిగా షౌక్రీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ప్రతిజ్ఞల దశ నుంచి క్షేత్రస్థాయిలో కార్యాచరణ దిశగా ముందుకెళ్లాలని ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సిస్సీ పిలుపునిచ్చారు. జిన్‌పింగ్, నరేంద్ర మోదీ లేకుండానా? కాప్–27 సదస్సులో 120కి పైగా దేశాల నేతలు, ప్రతినిధులు పాల్గొంటారని ఈజిప్ట్ ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరు కానున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారా? లేదా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. కర్బన ఉద్గారాల విషయంలో పెద్ద దేశాలైన చైనా, భారత్ అధినేతలు లేకుండా కాప్–27 సదస్సులో కుదిరే ఒప్పందాలపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, కాప్ సదస్సు వేదిక వద్ద నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన మానవ హక్కుల సంస్థల ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనలకు దిగిన వారిని అరెస్టు చేశారని న్యూయార్క్‌కు చెందిన ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ ఆరోపించింది. నిరసనకారులపై ఆంక్షలు ఎత్తివేయాలని కోరింది. -
Sri Lanka: శ్రీలంక ప్రజలకు మరో 12నెలల పాటు ఆ బాధ తప్పదటా..!
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్న శ్రీలంకలో పరిస్థితులు ఇప్పట్లో చక్కబడేలా కనిపించటం లేదు. దేశంలో ఇంధన కొరత తీవ్రంగా వేధిస్తోంది. పెట్రోల్ బంకుల వద్ద రోజుల తరబడి క్యూలైన్లలో నిలుచోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలోనే కీలక ప్రకటన చేశారు ఆ దేశ ఇంధన శాఖ మంత్రి. మరో 12 నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని స్పష్టం చేశారు. దేశంలో విదేశీ మారక నిలువల కొరత ఉన్నందున వచ్చే 12 నెలల పాటు చమురు దిగుమతులపై పరిమితులు కొనసాగుతాయని తెలిపారు. ‘దేశంలో విదేశీ మారక నిలువల కొరత కారణంగా.. వచ్చే 12 నెలల పాటు చమురు దిగుమతులు పరిమితంగానే ఉంటాయి.’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు మంత్రి కాంచన విజేసేకర. చమురు రేషన్ వ్యవస్థను తీసుకురావటం వెనుకున్న కారణాలను వివరించారు. అధ్యక్షుడిగా రణీల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టిన తర్వాత సంక్షోభాన్ని కట్టడి చేసేందుకు తొలి అడుగుగా ఇంధన రేషన్ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు చెప్పారు. పాఠశాలలు ప్రారంభం.. దేశంలో తీవ్ర చమురు కొరత ఉన్నప్పటికీ పాఠశాలలను సోమవారం పునఃప్రారంభించింది శ్రీలంక. అయితే.. ప్రభుత్వ ఉద్యోగులు మరో నెలరోజుల పాటు ఇంటి నుంచే పని చేయాలని కోరింది. మరోవైపు.. వచ్చే ఆగస్టులో 30వేల టన్నుల చొప్పున రెండు సార్లు చమురు దిగుమతులు చేసుకోనున్నట్లు లంక ఐఓసీ ఎండీ మనోజ్ గుప్తా తెలిపారు. ‘సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాం. పరిశ్రమలకు ఇంధన సరఫరా మా తొలి ప్రాధాన్యం.’ అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: Sri Lanka: శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్తత.. నిరసనలపై కొత్త అధ్యక్షుడి ఉక్కుపాదం! -
ఇకపై ఆ దేశంలో రేషన్ ద్వారా పెట్రోల్, డీజిల్ పంపిణీ!
కొలంబో: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ఇంధన కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. పెట్రోల్, డీజిల్ కోసం పెట్రోల్ పంపుల ముందు రోజుల తరబడి నిలుచోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. 'నేషనల్ ఇంధన పాస్' పేరుతో ఇంధన రేషన్ పథకాన్ని శనివారం ప్రవేశపెట్టారు ఆ దేశ విద్యుత్తు, ఇంధన శాఖ మంత్రి కాంచన విజేశేకర. ఈ కొత్త పాస్ ద్వారా వారం పద్ధతిలో ఇంధన కోటాను కేటాయిస్తారు. వాహన నంబర్, ఇతర వివరాలను ధ్రువీకరించి నేషనల్ ఐడెండిటీ కార్డు(ఎన్ఐసీ) అందిస్తారు. దానికి క్యూఆర్ కోడ్లు కేటాయిస్తారు. Introduction to the National Fuel Pass will be held @ 12.30pm. A guaranteed weekly fuel quota will be allocated. 1 Vehicle per 1 NIC, QR code allocated once Vehicle Chassis number & details verified. 2 days of the week according to Last Digit of number plate for fueling with QR. https://t.co/hLMI9Nm5ZF — Kanchana Wijesekera (@kanchana_wij) July 16, 2022 రిజిస్ట్రేషన్ వాహన యజమానులు తమ రిజిస్ట్రేషన్ నంబర్లోని చివరి అంకె ద్వారా తమ వంతు ఎప్పుడు వస్తుందని తెలుసుకోవచ్చు. మరోవైపు.. దేశంలోని పర్యాటకులు, విదేశీయులు కొలంబోలో పెట్రోల్, డీజిల్ పొందేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు మంత్రి. ' శనివారం మధ్యాహ్నం నుంచి నేషనల్ ఇంధన పాస్‌ల పంపిణీ ప్రారంభిస్తున్నాం. పాస్‌ల ద్వారా వారం పద్ధతిలో గ్యారంటీపెట్రోల్, డీజిల్‌ల కోటాను కేటాయిస్తాం. ఒక వాహనానికి ఒక ఎన్ఐసీ, క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ ద్వారా నంబర్ ప్లేట్ లోని చివరి అంకె సహాయంతో వారంలో రెండు రోజుల్లో ఇంధనం పొందొచ్చు.' అని విజేశేకర ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశంలోని ఇంధన కొరతను తీర్చేందుకు పొరుగు దేశాలతో పాటు రష్యాతోనూ చర్చలు జరుపుతున్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. రష్యా నుంచి ముడి చమురు సరఫరాకు మార్గం సుగమమైతే కొంత మేర ఇంధన కొరతకు తెరపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశంలో ఇంధనంతో పాటు ఆహార, ఔషధాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇదీ చూడండి: Gotabaya Rajapaksa: అందుకోసం శతవిధాల ప్రయత్నం చేశా: గొటబయ -
చమురు సంక్షోభం తెచ్చిన తంటా... అంబులెన్స్ సేవలు బంద్!
కొలంబో: శ్రీలంక ఆర్థిక, రాజీకీయ సంక్షోభంతో అట్టుడుకుతున్న సంగతి తెలసిందే. మరోవైపు నిరసకారుల్లో ఆగ్రహోజ్వల కట్టల తెంచుకుని వీధుల్లోకి వచ్చి హింసాత్మక నిరసనలు చేపట్టేలా చేసింది. ఈ నేపథ్యంలోనే లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికార నివాసాన్ని వీడిపోవాల్సి వచ్చింది కూడా. మరోవైపు శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజు రోజుకి దిగజారిపోతుందనే చెప్పాలి. మొన్నటి వరకు ఇంధన సంక్షోభం కారణంగా విక్రమసింఘే అధ్యక్షతన కొత్త ప్రభుత్వం అనవసరమైన ప్రయాణాలను మానుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేసింది. మళ్లీ ఇప్పుడు తాజాగా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అత్సవసర అంబులెన్స్ సేవలను కూడా నిలిపేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు శ్రీలంక పలు ప్రాంతల్లో అత్యవతసర అంబులెన్స్ సేవలను నిలిసేస్తున్నట్లుగా వెల్లడించింది. అంతేగాదు ఇంధన సంక్షోభం కారణంగా అంబులెన్స్ సేవలను నిలిపేస్తున్నామని, అందువల్ల ప్రజలను అంబులెన్స్ సేవల కోసం 1990కి కాల్ చేయొద్దు అని కూడా చెప్పింది. ఐతే మరోవైపు ప్రస్తుతం 3,700 మెట్రిక్ టన్నుల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్‌తో కూడిన ఓడ ఆదివారం శ్రీలంకకు చేరుకుందని, అలాగే 3,740 మెట్రిక్ టన్నుల గ్యాస్‌తో కూడిన మరో ఓడ కూడా ఈరోజు లంకకు చేరుకుంటుందని ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్ పేర్కొంది. అంతేగాదు మంగళవారం నుంచి గ్యాస్ పంపిణీ సక్రమంగా క్రమపద్ధతిలో ఉంటుందని, ఈ నెలాఖరు కల్లా దేశీయ ఎల్పి గ్యాస్ డిమాండ్‌కు సంబంధించిన సమస్య పూర్తిగా తొలగిపోతుందని లిట్రో గ్యాస్ కంపెనీ చైర్మన్ ముదిత పీరిస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీలంక 1948లో స్వాతంత్య్రం పొందిన తర్వాత ఎదుర్కొన్న అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభంగా దీన్ని పేర్కొనవచ్చు. (చదవండి: శ్రీలంక అధ్యక్షుడి నివాసంలో సుమారు రూ. 39 లక్షల నగదు..) -
Sri Lanka: పెట్రోల్ కోసం క్యూలో రోజుల తరబడి..
శ్రీ లంక సంక్షోభం ఇప్పుడు ఏమేరకు చేరిందో తెలుసా?.. పెట్రోల్ కావాలంటే ముందు టోకెన్లు తీసుకోవాలి. గంటల తరబడి కాదు.. రోజుల తరబడి క్యూలో ఎదురు చూడాలి. అవును.. శ్రీలంకలో పరిస్థితి దయనీయమైన స్థితికి చేరుకుంది. పెట్రో అమ్మకాలపై శ్రీలంక ప్రభుత్వమే ఆంక్షలు విధిస్తోంది. అమ్మకాలను దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. గత పది పదిహేను రోజులుగా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిలకోసం లైన్లలో ఎదురు చూపులు తప్పడం లేదు. కొందరైతే క్యూలోనే రోజుల తరబడి ఉండిపోతున్నారు. అక్కడే బస చేస్తున్నారు. అత్యవసరం ఉన్న వాహనాలకు సైతం గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యాపారులు, వాహనాలనే నమ్ముకుని బతుకుతున్న వాళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తీవ్ర సంక్షోభం.. అప్పుల నడుమ శ్రీలంకకు చమురు ఇంధనాలు చేరుకోవడం లేదు. ఇంధన కొరతతో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి చాలా చోట్ల. దీంతో పెట్రో బంకుల వద్ద భారీ క్యూలు, కొట్లాటలు చోటుచేసుకుంటున్నాయి. పరిస్థితి అదుపు చేయడానికి సైన్యం, పోలీసులు రంగంలోకి దిగారు. వాహనాదారులను అదుపు చేయడంతో పాటు టోకెన్లను సైతం వాళ్లే దగ్గరుండి పంచుతున్నారు. గాలే టెస్టును కవరేజ్ చేయడానికి ఓ జర్నలిస్ట్.. సుమారు ఐదు కిలోమీటర్లు సైకిల్ మీద ప్రయాణించాడంటే పరిస్థితి తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో రిపోర్టర్ ఆండ్రూ ఫైడెల్ ఫెర్నాండోకు ఈ అనుభవం ఎదురైంది. Almost no fuel in the country, so nearly impossible to get a trishaw. Buses unreliable and the ones that come are crammed. Still need to get to the ground to cover the Galle Test this week. There was only one option. pic.twitter.com/av2qVWup7G — Andrew Fidel Fernando (@afidelf) June 30, 2022 -
చమురు సంక్షోభం: ఆఫీసులు, విద్యా సంస్థలు బంద్
కొలంబో: చమురు సంక్షోభంతో శ్రీలంక సతమతమవుతోంది. దాంతో సోమవారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలను మూసేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయాలని పేర్కొంది. ఆన్లైన్ తరగతులు నిర్వహించాలనిఆదేశించింది. చమురు నిల్వలు అడుగంటుతుండటంతో విదేశీ మారక ద్రవ్యం కోసం ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలైన్లలో గంటల తరబడి నిలబడలేక ప్రజలు మళ్లీ నిరసనలకు దిగుతున్నారు. చదవండి: (Warren Buffett: బఫెట్‌తో భోజనం @ రూ.148 కోట్లు) -
కరెంట్ కొరతకు కొత్త జవాబు
నా ఉచ్ఛ్వాసం కవనం... నా నిశ్వాసం గానం.. అన్నాడో కవి. నా ఉచ్ఛ్వాసం మీథేన్.. నా నిశ్వాసం విద్యుత్.. అంటున్నాయి ఒక రకం బ్యాక్టీరియాలు. మానవాళిని వేధిస్తున్న పర్యావరణ కాలుష్యం, ఇంధన కొరతకు అవి సమాధానం చెబుతాయంటున్నారు శాస్త్రవేత్తలు.. జనాభా పెరిగిపోయే కొద్దీ శిలాజ ఇంధనాల వాడకం పెరిగి వాతావరణ కాలుష్యం హద్దులు దాటుతోంది. అలాగని ఇంధన వాడకాన్ని పరిమితం చేయదలిస్తే మానవ అభివృద్ధి కుంటుపడుతుంది. ఈ నేపథ్యంలో పర్యావరణహిత ఇంధనాల కోసం మనిషి అన్వేషణ చాలా రోజులుగా జరుగుతోంది. వాయు, సౌర విద్యుత్‌లాంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకం జరుగుతున్నా అది శిలాజ ఇంథనాలను పరిమితం చేసే స్థాయిలో జరగడంలేదు. వీటికయ్యే ఖర్చు, సాంకేతిక సమస్యలు ప్రత్యామ్నాయ ఇంధనాన్ని విరివిగా వాడేందుకు అడ్డంకిగా మారుతున్నాయి. తాజాగా ఈ సమస్యకు పరిష్కారం దొరికిందంటున్నారు శాస్త్రవేత్తలు. వాయు కాలుష్యకాల్లో కీలకమైన మీథేన్‌ను వాడుకుని విద్యుత్‌ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాను కనుగొన్నామని నెదర్లాండ్స్ పరిశోధకులు చెప్పారు. మీథేన్‌ను ఇంధనంగా వాడుకోవడం చాలా రోజులుగా జరుగుతున్నదే. బయోగ్యాస్ ప్లాంట్లలో వ్యర్థాలను సూక్ష్మ జీవులు మీథేన్‌గా మారుస్తాయి. ఇలా ఉత్పత్తి అయిన మీథేన్‌ను మండించి టర్బైన్లు తిరిగేందుకు వాడతారు. దీంతో విద్యుదుత్పాదన జరుగుతుంది. అయితే ఉత్పత్తి అయిన బయోగ్యాస్‌లో సగానికన్నా తక్కువే విద్యుదుత్పాదనకు ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో తమ ప్రయోగం ప్రత్యామ్నాయ ఇంధనోత్పత్తిలో ముందడుగు అని రాడ్బౌడ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త కార్నెలియా వెల్టె చెప్పారు. ప్రయోగ ఫలితాలను ఫ్రాంటియర్స్ ఇన్ మైక్రోబయాలజీలో ప్రచురించారు. ఇలా చేశారు పరిశోధనలో భాగంగా కాండిడేటస్ మిథేనోపెరెండెన్స్ అనే బ్యాక్టీరియాకున్న ప్రత్యేక టాలెంట్‌ను గుర్తించామని వెల్టె చెప్పారు. ఈ సూక్ష్మజీవులు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా బతుకుతుంటాయి. ఇవి మీథేన్‌ను ఆక్సిజన్ అవసరం లేకుండానే విడగొట్టి శక్తిని ఉత్పత్తి చేస్తాయని చెప్పారు. ఏఎన్‌ఎంఈ (అనరోబిక్ మీథనోట్రోపిక్) ఆర్కియాగా పిలిచే ఈ జీవులు కొన్ని రసాయన ప్రక్రియల ద్వారా తమ సమీపంలోని పదార్ధాల నుంచి ఎలక్ట్రానులను విడగొడతాయి. కరెంటంటేనే ఎలక్ట్రానుల ప్రవాహం. అంటే ఇవి తమ దగ్గరలోని పదార్ధాలను ఆక్సిడైజ్ చేసి కరెంటును ఉత్పత్తి చేస్తాయి. ఇందుకు కొద్దిగా నైట్రేట్ల సాయం తీసుకుంటాయి. ప్రయోగంలో భాగంగా ఈ సూక్ష్మజీవులను ఆక్సిజన్ రహిత ట్యాంకులో మీథేన్‌తో కలిపి ఉంచారు. దగ్గరలో ఒక మెటల్ ఆనోడ్‌ను జీరో ఓల్టేజ్ వద్ద సెట్ చేసి పెట్టారు. దీంతో ఈ మొత్తం సెటప్ ఒక బ్యాటరీలా మారిందని, ఇందులో ఒకటి బయో టెర్మినల్ కాగా ఇంకోటి కెమికల్ టెర్మినల్ అని వెల్టె తెలిపారు. సదరు బ్యాక్టీరియా తమ దగ్గరలోని మీథేన్‌నుంచి ఎలక్ట్రానులను విడగొట్టి కార్బన్ డైఆక్సైడ్‌గా మారుస్తాయి. ఈ ప్రక్రియలో దాదాపు చదరపు సెంటీమీటర్‌కు 274 మిల్లీ యాంప్‌ల కరెంటు ఉత్పత్తి అయింది. దీన్ని మరింత పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిశోధన ఆధారంగా భారీ స్థాయిలో బ్యాక్టీరియా బ్యాటరీలను నిర్మించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ► ప్రపంచ జనాభాలో 94 కోట్ల మంది (13 శాతం)కి ఇంకా విద్యుత్ సౌకర్యం లేదు. ► భూతాపాన్ని పెంచే గ్రీన్హౌస్ వాయువుల్లో మీథేన్ కీలకమైనది. మొత్తం గ్రీన్‌హస్ వాయువుల్లో దీని వాటా 20 శాతం. ► కార్బన్ డై ఆక్సైడ్తో పోలిస్తే మీథేన్ భూమిపై సూర్యతాపాన్ని 25 శాతం వరకు పట్టి ఉంచుతుంది. ► పశువ్యర్థాలు, బొగ్గు గనుల నుంచి ఎక్కువగా మీథేన్ విడుదలవుతుంది. ► భారీస్థాయిలో శిలాజ ఇంధనాల వాడకం తగ్గితే భూతాపం గణనీయంగా అదుపులోకి వస్తుంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
శ్రీలంకలో ఇంధన రేషనింగ్
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ఇంధనం విక్రయాలపై పరిమితులు విధించారు. తాజా రేషన్ విధానం శుక్రవారం నుంచి అమల్లోకి వచి్చందని శ్రీలంక ప్రభుత్వం అధీనంలోని సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ తెలిపింది. దీని ప్రకారం టూ వీలర్లకు రూ.వెయ్యి, త్రీ వీలర్లకు రూ.1,500, కార్లు, వ్యాన్లు, జీప్‌లకు రూ.5,000 మేరకే పెట్రోల్, డీజిల్ పోస్తారు. వాణిజ్య వాహనాలను రేషన్ నుంచి మినహాయించారు. విద్యుత్ కోతలు కూడా రోజుకు 12 గంటలపాటు అమలవుతున్నాయి. తీవ్ర వంటగ్యాస్ కొరతను తీర్చేందుకు భారత్‌ను శ్రీలంక సాయం కోరింది. రుణ రూపేణా వంటగ్యాస్‌ను సరఫరా చేయాలని భారత్‌ను అభ్యర్థించినట్లు ప్రభుత్వ రంగ లిట్రో గ్యాస్ కంపెనీ చైర్మన్ తెషార జయసింఘే తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ భారత హైకమిషన్ ద్వారా మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి తనకు సహకారం అందడంలేదని, తనపై గ్యాస్ మాఫియా ఒత్తిడి పెరుగుతున్నందున బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్లు ఆయన అధ్యక్షుడు గొటబయకు రాజీనామా లేఖ పంపించారు. శ్రీలంక రూపాయి విలువ పతనం కావడంతో అత్యవసరాలకు సైతం తీవ్ర కొరత ఏర్పడింది. 2019 ఏప్రిల్ 21న ఈస్టర్ నాటి బాంబు పేలుడు మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మాజీ క్రికెటర్ ధమ్మిక ప్రసాద్ శుక్రవారం 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. అప్పట్లో మూడు చర్చిల్లో జరిగిన ఆరు బాంబు పేలుళ్లలో 269 మంది చనిపోయారు. -
ఇంధన కొరతపై ఆర్మీని దించనున్న యూకే
లండన్: దేశాన్ని వణికిస్తున్న ఇంధన కొరత సమస్యను తీర్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించనుంది. సుమారు 200 మంది మిలటరీ వ్యక్తులను తాత్కాలిక ఇంధన సరఫరాకోసం నియోగించనున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఇంధన కొరత కారణంగా పలు పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు భారీగా బారులు తీరుతున్నారు. దేశంలో ట్రక్ డ్రైవర్ల కొరత కారణంగా ఇంధన రవాణా కుంటుపడింది. ఆపరేషన్ ఎస్కాలిన్ పేరిట ఈ సమస్య పరిష్కారానికి మిలటరీ నుంచి కొందరిని నియమిస్తున్నామని, వీరు ప్రస్తుతం ట్రైనింగ్‌లో ఉన్నారని, సోమవారం నుంచి ఇంధన సరఫరా బాధ్యతలు చేపడతారని డిఫెన్స్ కార్యదర్శి డెన్ వాలెస్ చెప్పారు. ఈ వారంలో ఇంధన సమస్య చాలావరకు తగ్గిందని ప్రభుత్వం చెబుతోంది, కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా సమస్య కనిపిస్తూనే ఉంది. సమస్య తీవ్రత క్రమంగా తగ్గుతోందని ప్రభుత్వం తెలిపింది. -
అనంతపురం జిల్లాలో ఇంధన కొరత
అనంతపురం: ఇందన ట్యాంకర్ల యజమానులు రెండు రోజుల పాటు సమ్మెలో వెళ్లడంతో అనంతపురం జిల్లాలో ఇందన కొరత ఏర్పడింది. సమైక్యాంధ్ర సమ్మెలో భాగంగా 6,7 తేదిల్లో ఇందన ట్యాంకర్ల యజమానులు సమ్మెలోకి వెళ్లారు. దీంతో జిల్లాకు గుంతకల్లు, కడప జిల్లాల నుంచి ఇందన రవాణాకు బ్రేక్ పడింది. అంతకు ముందు మూడు రోజులు జిల్లా బంద్‌కు ఎన్జీఓ, వైఎస్సార్సీపీ జిల్లా బంద్‌కు పిలుపు నివ్వడంతో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో జిల్లాలో 80 శాతం పెట్రోల్ బంకులు నోస్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. జిల్లాలో 220 పెట్రోల్ బంకులుండగా 190 బంకుల్లో పూర్తిగా పెట్రోల్, డీజిల్ నో స్టాక్ నెలకొంది. దీంతో మంగళవారం మధ్యాహ్నం స్టాకు ఉన్న ఒకటి, రెండు బంకుల వద్ద వేలాది మంది వాహనదారులు బారులు తీరారు. పంపిణీ చేసేందుకు పెట్రోల్ బంకుల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారు. దీంతో తమ వల్ల కాదని పోలీసుల అనుమతితో బందోబస్తు ఏర్పాటు చేసుకుని పంపిణీ చేశారు. మరో వైపు చిరు వ్యాపారులు బ్లాక్‌లో రూ.150- 250 దాకా అమ్మి సొమ్ము చేసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఇందనరవాణా ప్రారంభమైన జిల్లాలో పూర్తి స్థాయి ఇందనం స్టాక్ రావడానికి రెండు రోజులు సమయం పడుతుందని పౌరసరఫరాల అధికారులు వెల్లడించారు.