కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ఇంధనం విక్రయాలపై పరిమితులు విధించారు. తాజా రేషన్ విధానం శుక్రవారం నుంచి అమల్లోకి వచి్చందని శ్రీలంక ప్రభుత్వం అధీనంలోని సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ తెలిపింది. దీని ప్రకారం టూ వీలర్లకు రూ.వెయ్యి, త్రీ వీలర్లకు రూ.1,500, కార్లు, వ్యాన్లు, జీప్‌లకు రూ.5,000 మేరకే పెట్రోల్, డీజిల్ పోస్తారు. వాణిజ్య వాహనాలను రేషన్ నుంచి మినహాయించారు.
విద్యుత్ కోతలు కూడా రోజుకు 12 గంటలపాటు అమలవుతున్నాయి. తీవ్ర వంటగ్యాస్ కొరతను తీర్చేందుకు భారత్‌ను శ్రీలంక సాయం కోరింది. రుణ రూపేణా వంటగ్యాస్‌ను సరఫరా చేయాలని భారత్‌ను అభ్యర్థించినట్లు ప్రభుత్వ రంగ లిట్రో గ్యాస్ కంపెనీ చైర్మన్ తెషార జయసింఘే తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ భారత హైకమిషన్ ద్వారా మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు.
ప్రభుత్వం నుంచి తనకు సహకారం అందడంలేదని, తనపై గ్యాస్ మాఫియా ఒత్తిడి పెరుగుతున్నందున బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్లు ఆయన అధ్యక్షుడు గొటబయకు రాజీనామా లేఖ పంపించారు. శ్రీలంక రూపాయి విలువ పతనం కావడంతో అత్యవసరాలకు సైతం తీవ్ర కొరత ఏర్పడింది.
2019 ఏప్రిల్ 21న ఈస్టర్ నాటి బాంబు పేలుడు మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మాజీ క్రికెటర్ ధమ్మిక ప్రసాద్ శుక్రవారం 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. అప్పట్లో మూడు చర్చిల్లో జరిగిన ఆరు బాంబు పేలుళ్లలో 269 మంది చనిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment