అనంతపురం జిల్లాలో ఇంధన కొరత
అనంతపురం: ఇందన ట్యాంకర్‌ల యజమానులు రెండు రోజుల పాటు సమ్మెలో వెళ్లడంతో అనంతపురం జిల్లాలో ఇందన కొరత ఏర్పడింది. సమైక్యాంధ్ర సమ్మెలో భాగంగా 6,7 తేదిల్లో ఇందన ట్యాంకర్‌ల యజమానులు సమ్మెలోకి వెళ్లారు. దీంతో జిల్లాకు గుంతకల్లు, కడప జిల్లాల నుంచి ఇందన రవాణాకు బ్రేక్ పడింది. అంతకు ముందు మూడు రోజులు జిల్లా బంద్‌కు ఎన్‌జీఓ, వైఎస్సార్‌సీపీ జిల్లా బంద్‌కు పిలుపు నివ్వడంతో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో జిల్లాలో 80 శాతం పెట్రోల్ బంకులు నోస్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి.
జిల్లాలో 220 పెట్రోల్ బంకులుండగా 190 బంకుల్లో పూర్తిగా పెట్రోల్, డీజిల్ నో స్టాక్ నెలకొంది. దీంతో మంగళవారం మధ్యాహ్నం స్టాకు ఉన్న ఒకటి, రెండు బంకుల వద్ద వేలాది మంది వాహనదారులు బారులు తీరారు. పంపిణీ చేసేందుకు పెట్రోల్ బంకుల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారు. దీంతో తమ వల్ల కాదని పోలీసుల అనుమతితో బందోబస్తు ఏర్పాటు చేసుకుని పంపిణీ చేశారు.
మరో వైపు చిరు వ్యాపారులు బ్లాక్‌లో రూ.150- 250 దాకా అమ్మి సొమ్ము చేసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఇందనరవాణా ప్రారంభమైన జిల్లాలో పూర్తి స్థాయి ఇందనం స్టాక్ రావడానికి రెండు రోజులు సమయం పడుతుందని పౌరసరఫరాల అధికారులు వెల్లడించారు.