econamic problems
-
Recession: ముందు నుయ్యి... వెనుక గొయ్యి
పెట్టుబడిదారీ వ్యవస్థ డొల్లతనం ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు మరణశాసనం లిఖిస్తోంది. సాంకేతిక పురోగతి వేగం పుంజుకున్న కొద్దీ నిరుద్యోగం పెరుగుదల, వృద్ధి రేటు పతనం వంటి రూపాలలో ప్రజల జీవితం అతలాకుతలం అవుతోంది. ఆదాయం తగ్గిపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి వస్తు సేవల వినియోగం తగ్గిపోతోంది. ఈ స్థితిలో ప్రజల కొనుగోలుశక్తిని పెంచడం కోసం ప్రభుత్వాలు కరెన్సీ ముద్రిస్తున్నాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. ద్రవ్యోల్బణం తగ్గించడానికి వడ్డీరేట్లు పెంచుతున్నారు. దీంతో ఉత్పాదకత తగ్గిపోతోంది. మొత్తం మీద ఒక అనివార్య చక్రబంధంలో పెట్టుబడిదారీ దేశాలు చిక్కుకు పోయాయి. ప్రపంచ పెట్టుడిదారీ వ్యవస్థ ఇప్పటి వరకూ వాయిదా వేసిన తన అధికారిక మరణ ప్రకటనను నేడు ముఖాముఖి ఎదుర్కోక తప్పని స్థితి ఏర్పడింది. నిజానికి వ్యవస్థ తాలూకు అంతిమ వైఫల్యం 3, 4 దశాబ్దాల క్రితమే నిర్ధారణ అయిపోయింది. 1979ల తర్వాత పెట్టుబడి దారి ధనిక దేశాలలో ఆయా వ్యవస్థలు ఇక ఎంత మాత్రమూ ప్రజలకు ఉపాధిని కల్పించలేని పరిస్థితులు వేగవంతం అయ్యాయి. దీనికి కారణాలుగా అప్పటికే పెరిగిపోసాగిన యాంత్రీకరణ; ఈ దేశాలలో కార్మికులు, ఉద్యోగుల వేతనాలు అధికంగా ఉన్నాయి గనుక అక్కడి నుంచి పరిశ్రమలు చైనా వంటి చౌక శ్రమ శక్తి లభించే దేశాలకు తరలిపో నారంభించడం వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ధనిక దేశాలు అన్నీ, మరీ ముఖ్యంగా అమెరికా వంటివి తమ పారిశ్రామిక పునాదిని కోల్పోయాయి. అలాగే 1990ల అనంతర సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ విప్లవా లతో ఈ దేశాలలోని సేవారంగం కూడా (ఐటీ, బీపీఓ) భారత దేశం వంటి దేశాలకు తరలిపోయింది. ఈ క్రమంలోనే ఆయా ధనిక దేశాలలోని ప్రజలకు ఇక ఎంత మాత్రమూ ఉపాధి కల్పించలేని ప్రభుత్వాలూ, వ్యవస్థలూ ఆ ప్రజలలో అసంతృప్తి జ్వాలలు రగులకుండానూ, వారి కొనుగోలు శక్తి పతనం కాకుండానూ కాపాడుకునేందుకు దశాబ్దాల పాటు క్రెడిట్ కార్డుల వంటి రుణ సదుపాయాలపై ఆధారపడ్డాయి. అలాగే 1990లలో యావత్తూ... సుమారు 2001 వరకూ ఇంటర్నెట్ ఆధారిత హైటెక్ కంపెనీల షేర్ల విలువలలో భారీ వృద్ధి ద్వారా జరిగిన షేర్ మార్కెట్ సూచీల పెరుగుదల పైనా వ్యవస్థలు నడిచాయి. ఇక చివరగా 2003 తర్వాతి కాలంలో... 2008 వరకూ రియల్ ఎస్టేట్ బూమ్‌పై ఆధారపడి ప్రజల కొనుగోలు శక్తి కొనసాగింది. అంతిమంగా 2008 చివరిలో ఈ రియల్ బుడగ పగిలిపోవడంతో వ్యవస్థలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు వేరే దారిలేక ఈ ధనిక దేశాలన్నీ ప్రజల కొనుగోలు శక్తిని నిలబెట్టేందుకు, ఉద్దీపన రూపంలో కరెన్సీల ముద్రణను మార్గంగా ఎంచుకున్నాయి. దీంతో ధనిక దేశాలన్నింటిలోనూ ద్రవ్యోల్బణం 4 దశాబ్దాల రికార్డు స్థాయికి చేరింది. ఈ ద్రవ్యోల్బణ పరిస్థితికి మరో ముఖ్యమైన కారణం ధనిక దేశాలలో దేశీయంగానే సరుకులూ, సేవల ఉత్పత్తి తాలూకూ పారిశ్రామిక పునాదులు లేకపోవడం. ఫలితంగా ఈ దేశాలలో ముద్రించబడిన డబ్బు, అవి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోన్న సరుకులు, సేవలకు ఖర్చవుతోంది. అందుకే ద్రవ్యోల్బణం తగ్గడంలేదు. దాంతో ప్రస్తుతం దరిదాపు అన్ని ధనిక దేశాలూ ద్రవ్యోల్బణం అదుపు కోసం బ్యాంకు వడ్డీ రేట్లను పెంచసాగాయి. ఈ క్రమంలో పెరిగిన వడ్డీ రేట్ల వలన ఆయా దేశాలలో రుణ స్వీకరణ తగ్గిపోతోంది. ఇది వేగంగా ప్రజల కొనుగోలు శక్తి పతనానికీ... అంటే అంతిమంగా వృద్ధి రేటు పతనానికీ దారితీస్తోంది. అదీ కథ! అంటే ఆర్థిక మాంద్య స్థితిలో ఉద్దీపన కోసం కరెన్సీలు ముద్రిస్తే రెండో ప్రక్కన ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. అలాగని వడ్డీ రేట్లను పెంచితే తక్షణమే ఆర్థిక వృద్ధి రేటు పడిపోయి నిరుద్యోగం పెరుగుతోంది. కొద్ది నెలల క్రితం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే పేరిట అమెరికాలో వడ్డీ రేట్లు పెంచగానే తర్వాతి త్రైమాసిక కాలం నుంచీ ఆర్థిక వృద్ధి రేటు అకస్మాత్తుగా పడిపోసాగింది. వ్యవస్థ పరిమితులలో పరిష్కారం సాధ్యంకాని చిక్కుముడిగా... వైరుధ్యంగా ఈ పరిస్థితి తయారయ్యింది. ముందు నుయ్యి... వెనుక గొయ్యి స్థితి ఇది. స్థూలంగానే... ఆయా ధనిక దేశాల ఆర్థిక వ్యవస్థల్లో ఆర్థిక సంక్షోభ కాలంలో ఉద్దీపనలు లేదా వాటి ద్వారా ప్రభుత్వమే పూను కొని (ప్రైవేటు పెట్టుబడి దారులకు బదులు) ఉపాధి కల్పన చేసి వ్యవస్థను తిరిగి గట్టెక్కించే అవకాశాలు నేడు సన్నగిల్లి పోయాయి. యాంత్రీకరణ వేగం పెరగడం... విపరీతమైన స్థాయిలో మర మనుషుల వినియోగం పెరగడం వంటి వాటి వలన నేడు ఈ దేశాలలో ఉపాధి కల్పనకు అవకాశాలు ఇక ఎంత మాత్రమూ లేకుండా పోతున్నాయి. వాస్తవంలో నేటి ప్రపంచంలో జరిగిన... జరుగుతోన్న హైటెక్ సాంకేతిక విప్లవం ప్రజల జీవితాలను మరింత మెరుగు పరచాల్సింది. ఎందుకంటే ప్రతి కొత్త సాంకేతిక ఆవిష్కరణ ప్రజల కనీస అవసరాలను తీర్చడానికి భారీగా ఉత్పత్తిని పెంచి తద్వార జన జీవితాన్ని మరింత సులువైనదిగా, సంపన్నవంతమైనదిగా మార్చ గలగాలి. కానీ ఇప్పుడు జరుగుతోంది... సాంకేతిక పురోగతి వేగం పుంజుకున్న కొద్దీ నిరుద్యోగం పెరుగుదల... వృద్ధి రేట్ల పతనం వంటి రూపాలలో ప్రజల జీవితం అతలాకుతలం అవుతోంది. అంటే కమ్యూనిస్టు సిద్ధాంతకారుడు కారల్ మార్క్స్ పరిభాషలో చెప్పాలంటే... నేడు జరుగుతోంది ఉత్పత్తి శక్తులు ఎదుగుతున్న కొద్దీ అవి ప్రజలకు మేలుచేయక పోగా... వినాశకరకంగా మారడమే. ఈ పరిస్థితికి కారణం నేటి వ్యవస్థ తాలూకు కీలక చలన సూత్రం లాభాల కోసం మాత్రమే పెట్టుబడులు పెట్టడం. అంటే ఇక్కడ... ఈ వ్యవస్థలో నిర్జీవమైన డబ్బును... లాభార్జన ద్వారా... మరింత అధిక డబ్బుగా మార్చడం అనేదే ప్రాథమిక సూత్రం. దీనిలో ప్రాణం ఉన్న మనుషులు... ప్రాణం లేని పెట్టుబడీ, దాని తాలూకు లాభాల కోసం పని చేస్తున్నారు. అందుచేత ఇక్కడ మనుషుల స్థానంలో యంత్రాలను పెట్టుకొని లాభాలు సంపాదించుకోగలిగితే అది పెట్టుబడి దారులకు మహా సంతోషం. అలాగే ఈ పెట్టుబడిదారులు తమ ఈ ఆలోచనా విధానం వలన ఏర్పడిన ఆర్థిక మాంద్యాల కాలంలో ప్రజల కొనుగోలు శక్తి, డిమాండ్ పడిపోయినప్పుడు ఆ స్థితి నుంచి వ్యవస్థను గట్టెక్కించేందుకు ఇక ఎంత మాత్రమూ కొత్తగా పెట్టుబడులు పెట్టరు. అప్పుడు ప్రభుత్వాలు రంగంలోకి దిగి ప్రజల కొనుగోలు శక్తిని కాపాడవలసి రావడమే ప్రతి ఆర్థిక మాంద్య కాలంలోనూ జరిగింది. అయితే 1980ల నుంచి ప్రపంచవ్యాప్తంగా అమలులోకి వచ్చిన నయా ఉదారవాద సంస్కరణలు కనీసం ప్రభుత్వాలైనా ప్రజల కొనుగోలు శక్తిని పెంచే దిశగా నికరంగా పూనుకోగలగడాన్ని చాలా వరకూ ఆటంక పరుస్తున్నాయి. ఈ సంస్కరణల తాలూకు ఆలోచనా విధానంలో ప్రభుత్వ పాత్ర కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ ధనవంతులకు అనుకూలంగా వ్యవహారిస్తేనే దానివలన పెట్టుబడులు పెరిగి ప్రజలకు ఉపాధి లభిస్తుందనేది కీలక విధానంగా ఉండడం. అంటే ఈ ప్రపంచీకరణ విధానాలకు ముందరి... 1980ల ముందరి సంక్షేమ రాజ్య ఆలోచనలైన ఉద్యోగులు, కార్మికుల జీతభత్యాలు బాగుండి, వారి ఆర్థిక స్థితి బాగుంటేనే వ్యవస్థలో కొనుగోలు శక్తి... డిమాండ్ స్థిరంగా ఉంటాయనే దానికి తదనంతరం తిలోదకాలిచ్చారు. అలాగే ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణల కలగలుపు అయిన ఈ ఉదారవాద సంస్కరణలు ఆర్థిక వ్యవస్థలలో ప్రభుత్వం పాత్ర తక్కువగా ఉండాలని సిద్ధాంతీకరించాయి. అంటే పూర్తిగా డిమాండ్ సరఫరాలపై ఆధారపడిన మార్కెట్ ఆలోచనా విధానం ఈ సంస్కరణలకు కేంద్ర బిందువు. అందుచేత ఈ విధానాలను విశ్వసించేవారు ఆర్థిక సంక్షోభ కాలంలో కూడా తమ తమ దేశాల ఆర్థిక వ్యవస్థలలో ప్రభుత్వ పాత్రను తిరస్కరించే గుడ్డితనానికి పోతున్నారు. ఈ క్రమంలోనే నేడు ప్రపంచ పెట్టుబడి దారి వ్యవస్థ వేగంగా తిరిగి కోలుకోలేని సంక్షోభంలోకి జారిపోతోంది. 2008 ఆర్థిక సంక్షోభ అనంతరం కాగితం కరెన్సీల ముద్రణపై ఆధారపడి తమ మరణ శాసనాలను వాయిదా వేసుకున్న పెట్టుబడిదారీ పాలకులు నేడు ఇక ఎంత మాత్రమూ వ్యవస్థను కాపాడుకోలేని స్థితిలో పడిపోయారు! డి. పాపారావు, వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు మొబైల్: 98661 79615 -
Sri Lanka: శ్రీలంక ప్రజలకు మరో 12నెలల పాటు ఆ బాధ తప్పదటా..!
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్న శ్రీలంకలో పరిస్థితులు ఇప్పట్లో చక్కబడేలా కనిపించటం లేదు. దేశంలో ఇంధన కొరత తీవ్రంగా వేధిస్తోంది. పెట్రోల్ బంకుల వద్ద రోజుల తరబడి క్యూలైన్లలో నిలుచోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలోనే కీలక ప్రకటన చేశారు ఆ దేశ ఇంధన శాఖ మంత్రి. మరో 12 నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని స్పష్టం చేశారు. దేశంలో విదేశీ మారక నిలువల కొరత ఉన్నందున వచ్చే 12 నెలల పాటు చమురు దిగుమతులపై పరిమితులు కొనసాగుతాయని తెలిపారు. ‘దేశంలో విదేశీ మారక నిలువల కొరత కారణంగా.. వచ్చే 12 నెలల పాటు చమురు దిగుమతులు పరిమితంగానే ఉంటాయి.’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు మంత్రి కాంచన విజేసేకర. చమురు రేషన్ వ్యవస్థను తీసుకురావటం వెనుకున్న కారణాలను వివరించారు. అధ్యక్షుడిగా రణీల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టిన తర్వాత సంక్షోభాన్ని కట్టడి చేసేందుకు తొలి అడుగుగా ఇంధన రేషన్ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు చెప్పారు. పాఠశాలలు ప్రారంభం.. దేశంలో తీవ్ర చమురు కొరత ఉన్నప్పటికీ పాఠశాలలను సోమవారం పునఃప్రారంభించింది శ్రీలంక. అయితే.. ప్రభుత్వ ఉద్యోగులు మరో నెలరోజుల పాటు ఇంటి నుంచే పని చేయాలని కోరింది. మరోవైపు.. వచ్చే ఆగస్టులో 30వేల టన్నుల చొప్పున రెండు సార్లు చమురు దిగుమతులు చేసుకోనున్నట్లు లంక ఐఓసీ ఎండీ మనోజ్ గుప్తా తెలిపారు. ‘సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాం. పరిశ్రమలకు ఇంధన సరఫరా మా తొలి ప్రాధాన్యం.’ అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: Sri Lanka: శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్తత.. నిరసనలపై కొత్త అధ్యక్షుడి ఉక్కుపాదం! -
మాకు సాయం చేసిన ఒకే ఒక్క దేశం భారత్: శ్రీలంక మంత్రి
కొలంబో: చరిత్రలో కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తమకు భారత్ మాత్రమే సాయం అందించిందని చెప్పారు శ్రీలంక మంత్రి కాంచన విజెసేకర. భారత్ ఆహన్నహస్తం గురించి ప్రపంచానికి తెలియజెప్పారు. తీవ్ర ఇంధన కొరతతో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న తాము.. సాయం చేయాలని అన్ని దేశాలను అడిగామని చెప్పారు. కానీ భారత్ మాత్రమే రుణ సాయం చేసి ఆదుకుందని శనివారం మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. సాయం కావాలని రష్యాను కూడా అడుగుతున్నట్లు చెప్పారు శ్రీలంక మంత్రి. ఈ విషయంపై రెండు దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. తమకు కావాల్సిన సాయం గురించి రష్యాకు వివరించామని, ఆ దేశం ఎలాంటి సాయం అందిస్తుందోనని ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. 3.8 బిలియన్ డాలర్ల సాయం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, ఆహార పదార్థాలు వంటి నిత్యావసర వస్తువుల కొరతతో దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది శ్రీలంక. వీటిని దిగుమతి చేసుకునేందుకు విదేశీ నిల్వలు లేక దిక్కుతోచని స్థితిలో ఉంది. ఇలాంటి సంక్షోభ సమయంలో భారత్ అండగా నిలిచింది. 3.8 బిలియన్ డాలర్లు విలువ చేసే సాయం అందించి గొప్ప మనసు చాటుకుంది. కరెన్సీ మార్పిడులు, శ్రీలంక చెల్లించాల్సిన రుణాలను వాయిదా వేయడం సహా 1.5 బిలియన్ డాలర్లు విలువ చేసే ఇంధనం, ఔషధాలు, ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసర వస్తువులను పంపింది. భారత్ పెద్దన్న శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య భారత్ చేసిన సాయాన్ని కొనియాడాడు. తాము కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఇండియా పెద్దన్నలా సాయం చేస్తోందని చెప్పాడు. భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి రుణపడి ఉంటామన్నాడు. ఈ కష్టాల నుంచి తాము త్వరలోనే బయటపడతామని ఆశాభావం వ్యక్తం చేశాడు. చదవండి: ‘కోవిడ్ కూడా ముంచింది’ -
గొటబాయ నివాసంలో కరెన్సీ కట్టల గుట్టలు..!
కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చిన క్రమంలో ప్రజలు అక్కడి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో మార్పులు వచ్చినా ఎలాంటి పురోగతి కనిపించకపోవటంతో మళ్లీ పెద్ద ఎత్తున లంకేయులు ఆందోళనలకు దిగారు. ఎవరూ ఊహించని విధంగా శనివారం లక్షల మంది ప్రజలు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలంటూ ఆందోళన చేపట్టారు. అధ్యక్షుడి నివాసాన్ని ముట్టడించారు. భద్రతావలయాన్ని దాటుకుని లోపలికి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలోనే గొటబాయ పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. అధ్యక్షుడి అధికారిక నివాసంలో ప్రవేశించిన నిరసన కారులు రచ్చ రచ్చ చేశారు. స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టడం, గొటబాయ పడగది, వంటగదిలోని వీడియోలు బయటకు వచ్చాయి. ఇదిలా ఉండగా.. అధ్యక్షుడి భవనంలో పెద్ద మొత్తంలో నగదును నిరసనకారులు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. శ్రీలంక దినపత్రిక డైలీ మిర్రర్ ప్రకారం.. అధ్యక్ష భవనంలో దొరికిన సొమ్మును అక్కడి భద్రతా విభాగానికి అందించారు. దేశం ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న తరుణంలో కోట్లాది రూపాయలు అధ్యక్షుడి భవనంలో లభించటంపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగదుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. అందులో ఓ నిరసనకారుడు కరెన్సీ నోట్లను లెక్కిస్తున్నట్లు కనిపించాడు. ఆ నోట్ల కట్టలను అధ్యక్షుడి అధికారిక నివాసం నుంచి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు నిరసనకారులు. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టాకే నిజానిజాలు తెలుస్తాయని, సరైన ఆధారాలతో సమాచారం అందిస్తామని అక్కడి అధికారులు వెల్లడించారు. మరో ఇద్దరు మంత్రుల రాజీనామా.. దేశంలో పరిస్థితులు దిగజారిన నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు శ్రీలంక పర్యాటక శాఖ మంత్రి హరిన్ ఫెర్నాండో, కార్మిక, విదేశీ ఉపాధి శాఖ మంత్రి మనుష ననయక్కరలు ప్రకటించారు. మరోవైపు.. దేశంలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు, సైన్యానికి ప్రజలు సహకరించాలని కోరారు త్రిదళాధిపతి(సీడీఎస్) జనరల్ శవేంద్ర సిల్వా. దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్న క్రమంలో త్రివిధ దళాల అధిపతులతో కలిసి ఈ ప్రకటన చేశారు సీడీఎస్. ఇదీ చదవండి: కొనడానికి లేదు.. తినడానికి లేదు -
Covid Crisis: చేతులెత్తేసిన ప్రభుత్వాలు... ప్రజల పర్సులు ఖాళీ
కోవిడ్ సంక్షోభం వేళ ప్రజలకు అండగా నిలవడంతో కేంద్ర, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయి. ప్రజారోగ్య వ్యవస్థ ద్వారా ప్రజలను ఆదుకోవడానికి చొరవ చూపించకపోవడంతో ఎక్కువ మంది ప్రైవేటు ఆస్పత్రులనే ఆశ్రయించారు. చికిత్స కోసం ఆస్తులు అమ్ముకుని ఆర్థికంగా చితికి పోయారు. అవుటాఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ (OOP)కి సంబంధించిన గణాంకాలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. కరోనా కోసం చేసిన ప్రతీ రూ. 100 ఖర్చులో ప్రభుత్వ వ్యయం కేవలం రూ. 37.3లకే పరిమితం అవగా ప్రజలు వ్యక్తిగతంగా చేసిన ఖర్చు రూ. 63.7 గా నమోదైంది. అప్పుల పాలు రోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో కోట్లాది మంది ప్రజలు కరోనా బారిన పడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బెడ్లు లభించిన ఆక్సిజన్, రెమ్‌డెసివర్ వంటి మందులు బ్లాక్‌లో కొనుక్కుక్కోవాల్సిన దుస్థితి ఎదురైంది. ఆస్పత్రి ఖర్చుల కోసం కొందరు పొదుపు సొమ్ము వాడేస్తే, మరికొందరు అప్పులు చేశారు, ఆస్తులు అమ్ముకున్నారు. చివరకు కరోనా దెబ్బకు చాలా మంది ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. కేవలం సెకండ్‌వేవ్ కారణంగా దేశంలో 5.5 కోట్ల మంది ప్రజలు పేదలుగా మారిపోయారు. ప్రభుత్వ వ్యయం 37.3 శాతం కరోనా సెకండ వేవ్‌లో మన దేశంలో అధికారికంగా 2.87 కోట్ల కేసులు నమోదు అయ్యాయి. వీరి చికిత్స కోసం జరిగిన వ్యయంలో ప్రభుత్వ వాటా కేవలం 37.3 శాతం ఉండగా వ్యక్తిగతంగా చేసిన ఖర్చు రూ. 62.7గా నమోదు అయ్యింది. ఇదే సమయంలో అమెరికాలో 3.34 కోట్ల కేసులు రాగా అక్కడ ప్రభుత్వ వ్యయం 89.2 శాతంగా నమోదు అయ్యింది. వ్యక్తిగత ఖర్చు కేవలం 10.8 శాతమే అయ్యింది. పొరుగుతో పోల్చితే కరోనా చికిత్సకు ప్రభుత్వ పరంగా చేసిన ఖర్చులో ఇండియా కంటే పొరుగుదేశాలపై నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్‌లు ముందున్నాయి. బంగ్లాదేశ్, మయన్మార్లు వెనుకబడ్డాయి. బీహార్‌లో పది పైసలు వెనుకబాటు తనానికి కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే బీహార్, కరోనా చికిత్స విషయంలోనూ అదే తీరు కనబరిచింది. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా బారిన పడ్డవారికి ప్రభుత్వం తరఫున మెరుగైన చికిత్స అందివ్వడంలో పూర్తిగా చేతులెత్తేసింది. బీహార్ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కరోనా వ్యయం విషయంలో ప్రభుత్వ వాటా కేవలం 10 పైసలకే పరిమితమైంది. ఇక యోగా సర్కార్ తీరు ఇందుకు మినహాయింపేం కాదు, యూపీలో ప్రభుత్వ ఖర్చు రూ. 1.50కే పరిమితమైంది. పట్టణాల్లో పరిస్థితి గ్రామీణ ప్రాంతాలో కరోనా వైద్యం కోసం 10 పైసల వరకు ఖర్చు పెట్టిన బీహార్ పట్టణ ప్రాంతాలకు వచ్చే సరికి ఆ ఖర్చును రూ. 1.70 వరకు తేగలిగింది. ఆ తర్వాత మధ్య ప్రదేశ్ రూ. 7.70, ఉత్తర్‌ప్రదేశ్ రూ. 8.80 ఖర్చు చేశాయి. -
త్వరలో మరిన్ని కీలక రంగాల పున: ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి మెరుగుపరిచేందుకు అవసరమైన కొన్ని కీలక రంగాలను పున:ప్రారంభించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కొన్ని సడలింపులతో షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, మతపరమైన ప్రదేశాలతో పాటు ఇతర సంస్థల పున:ప్రారంభానికి కేంద్రం అనుమతించింది. అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే మరిన్ని రంగాలు, సంస్థలు ఇప్పటికీ లాక్‌డౌన్‌లోనే ఉన్నాయి. వాటిని జూలై రెండోవారం నుంచి తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. (‘ప్రకటనలపట్ల మోదీ జాగ్రత్తగా ఉండాలి’) త్వరలో పున: ప్రారంభించేందుకు దృష్టి పెట్టిన రంగాలు ఇవే.. మెట్రో రైళ్లు: మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు మార్చి 22 నుంచి మెట్రో రైలు సేవలను కేంద్రం నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 25న జనతా కర్ఫ్యూను ప్రకటించి పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ను ప్రకటించారు. అయితే దశల వారీగా అమలవుతన్న లాక్డౌన్లో కేంద్రం సడలింపులతో కూడిన కొన్ని రవాణా సేవలకు అనుమతించింది. కానీ మెట్రో రైల్వే సేవలకు మాత్రం అనుమతించలేదు. దీనిపై మెట్రో అధికారులు మే 30న ట్వీట్ చేస్తూ తదుపరి ఆదేశం వచ్చే వరకు మెట్రో సేవలు అనుమతి లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేగాక లాక్డౌన్ మొదటి దశ మార్గదర్శకాలలో జూన్ 30 వరకు సబర్బన్ రైళ్లతో పాటు మెట్రో రైల్ సేవలు కూడా మూసివేయబడతాయని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే అత్యవసర సేవల విభాగంలో పనిచేసే వారి కోసం ముంబై సబర్బన్ రైళ్లను కెటాయించారు. (పునః ప్రారంభ సంబరం..) పాఠశాలలు, కళాశాలలు: కరోనా వ్యాప్తిని అరికట్టేందు పలు రంగాలతో పాటు విద్యాసంస్థలను కూడా ప్రభుత్వం మూసివేసింది. దీంతో అన్ని స్కూళ్లు, కాలేజీలు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. కాగా పాఠశాలను, కళాశాలను తిరిగి జూలైలో తెరిచేందుకు కేంద్రం తగిన చర్యలు చేపడుతోంది. మార్చిలో జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదా పడటంతో. జూన్ 30 తర్వాత పరీక్షలను నిర్వహించనున్నట్లు కేంద్ర, రాష్ట్ర బోర్డులు తెలిపాయి. రైల్వేలు: గత నెలలో కొన్ని రైల్వే సేవలను ప్రభుత్వం ప్రారంభించినప్పటికీ ఇంకా పూర్తి స్థాయి సేవలకు కేంద్రం అనుమతించలేదు. 51 రోజుల లాక్డౌన్ తరువాత, మే 12 నుంచి రైల్వే శాఖ క్రమంగా రైల్వే సేవలను తిరిగి ప్రారంభించింది. అంతేగాక గత నెలలో 15 జతల రైళ్లతో ఢిల్లీ - డిబ్రుగా, అగర్తల, హౌరా, పాట్నా, బిలాస్పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మద్గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూ తవి రైల్వే స్టేషన్లను కలుపుతూ సేవలను ప్రారంభించింది. కోవిడ్-19 వారి కోసం కేటాయించిన 20,000 బోగీలను దృష్టిలో ఉంచుకుని కోచ్‌ల లభ్యత ఆధారంగా సేవలను తిరిగి ప్రారంభిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. -
ఉపాధి హామీతోనే గ్రామీణ వికాసం
గ్రామీణ భారతదేశంలో ప్రజల వినియోగాన్ని క్షీణింపజేయడంలో కేంద్ర ప్రభుత్వ పాలసీ విధానాల్లోని తప్పటడుగులు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. వ్యవసాయానికి పోటీగా వాణిజ్యాన్ని నిలబెట్టడం, ద్రవ్యోల్బణంపైనే గురిపెడుతున్న ద్రవ్యవిధానం, పెద్దనోట్ల రద్దు, అధిక మొత్తం నగదు లావాదేవీలపై పన్ను, జీఎస్టీ వంటివి మొత్తంగా వ్యవసాయ రంగం అభివృద్ధిపై శీతకన్ను వేస్తున్నాయి. ఇవన్నీ కలిసి గ్రామీణ మార్కెట్లలో నగదు చెలామణీని, మొదటి నుంచి వాడుకలో ఉన్న నగదు లావాదేవీలను విచ్ఛిన్నపర్చడానికే తోడ్పడ్డాయి. అందుచేత గ్రామీణ ఆర్థిక ఉద్దీపనను అమలు చేయడానికి మరింత మెరుగుపర్చిన రూపంలోని జాతీయ ఉపాధి హామీ పథకం ఒక బలమైన పునాదిని ఏర్పరుస్తుంది. ఇది ఒక డిమాండ్‌ను సృష్టించే పథకం. పనికోసం చూస్తున్న ఎవరికైనా ఈ పథకం పని కల్పిస్తుంది. కాబట్టి ఆదాయ మద్దతు పథకాలతో ఘర్షించే సమస్యలను ఇది అధిగమించి గ్రామీణ ప్రాంతంలో శ్రమజీవులకు ఎక్కువ మేలు చేస్తుంది. ప్రస్తుతం దేశంలో అలుముకుంటున్న ఆర్థిక మందగమనాన్ని అడ్డుకోవడం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్న మన విధాన నిర్ణేతలు భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పట్టి పీడిస్తున్న సంక్షోభాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. కొన్ని నెలల క్రితం ఎన్నికలు సమీపించిన తరుణంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ భారతీయ విధాన నిర్ణేతల ప్రథమ ప్రాధాన్యతగా ఉండేది. ఈ సంవత్సరం జనవరిలో ప్రధానమంత్రి–కిసాన్ యోజన్ పథకాన్ని ప్రకటించి భారీ ఎత్తున అమలుకు ప్రయత్నాలు చేశారు. కానీ సరిగ్గా అయిదు నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం తీవ్రతరమవుతోందని గుర్తిస్తున్నప్పటికీ పీఎం కిసాన్ యోజన పథకం అమలు వేగాన్ని తగ్గిస్తూ వస్తోంది. కేంద్రం ప్రకటించిన దాని ప్రకారం రైతులకు మూడో విడత నగదు చెల్లింపు మొత్తం తొలి రెండు విడతల కంటే గణనీయంగా తగ్గిపోవడం గమనార్హం. తొలి రెండు విడతల నగదును ఎన్నికల ప్రచార సమయంలో సత్వరం పంపిణీ చేసిన వాస్తవాన్ని మర్చిపోకూడదు. బహుశా, పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన ఘన విజయం కేంద్ర ప్రభుత్వ రాజకీయ గణాంకాలను మార్చివేసి ఆర్థిక వ్యవస్థలోని ఇతర అంశాలపై తన దృష్టిని మరల్చినట్లుంది. కార్పొరేట్, ద్రవ్యరంగం ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడానికి మిక్కుటంగా కృషి చేస్తోంది. కానీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను విస్మరించి పెట్టుబడుల పెంపుదల కోసం ప్రయత్నించడం అంటే చాలా తీవ్రమైన తప్పిదం కాగలదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆర్థిక మాంద్యం నేపథ్యంలో కార్పొరేట్ పన్నులను భారీగా తగ్గిస్తూ ప్రస్తుతం విధానపరంగా తీసుకున్న చర్యలు దేశంలో డిమాండును పెంచే సమస్యను పరిష్కరించడంలో భవిష్యత్తులో విఫలం కాక తప్పదనిపిస్తోంది. ప్రముఖ ఆర్థిక వేత్త హిమాన్షు నొక్కి చెప్పినట్లుగా భారతదేశం వినియోగ సరకులకోసం పెట్టే ఖర్చు కనీవినీ ఎరుగని స్థితికి దిగజారిపోయింది. జాతీయ శాంపిల్ సర్వే ఆఫీసు డేటాను ఉపయోగించి గ్రామీణ భారతదేశంలో సంవత్సరానికి 4.4 శాతం చొప్పున దేశీయ వినియోగ వ్యయం క్షీణించిపోయిందని ఆయన లెక్కించారు. అదే పట్టణ ప్రాంతాల్లో వినియోగ వ్యయం 4.8 శాతం పడిపోయింది. రెండోది.. గ్రామీణ భారతదేశంలో ప్రజల వినియోగాన్ని క్షీణిం పజేయడంలో కేంద్ర ప్రభుత్వ పాలసీ విధానాల్లో తీసుకున్న తప్పటడుగులు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. వ్యవసాయానికి పోటీగా వాణిజ్యాన్ని నిలబెట్టి ద్రవ్యోల్బణంపై గురిపెడుతున్న ద్రవ్యవిధానం, పెద్దనోట్ల రద్దు, అధిక మొత్తంలో నగదు లావాదేవీలపై పన్ను, జీఎస్టీ వంటివి మొత్తంగా వ్యవసాయ రంగం అభివృద్ధిపై శీతకన్ను వేస్తున్నాయి. ఇవన్నీ కలిసి గ్రామీణ మార్కెట్లలో నగదు చెలామణీని, మొదటి నుంచి వాడుకలో ఉన్న నగదు లావాదేవీలను విచ్ఛిన్నపర్చడానికే ఇతోధికంగా తోడ్పడ్డాయి. విధాన పరమైన ఈ తప్పటడుగులను ప్రత్యేకంగా సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బలహీనంగా ఉన్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వినియోగం తగ్గిపోవడం అంటేనే అక్కడ దారిద్య్రం పెరుగుతోందని అర్థం. అందుకే అతితక్కువ కాలంలోనే వినియోగ డిమాం డును పునరుద్ధరించడానికి గ్రామీణ భారతదేశానికి సత్వరమే ఆర్థిక ఉద్దీపన అనేది అవసరం కార్పొరేట్ ఇండియాకంటే మించిన ఉద్దీపన ప్యాకేజీనీ మన గ్రామప్రాంతాలకు అందించి తీరాలి. గ్రామీణ ఉద్దీపన ప్యాకేజీకి అందించాల్సిన రెండు విధానపరమైన సాధనాలపై ఇటీవలకాలంలో చాలా విస్తృతమైన వాదనలు చోటుచేసుకున్నాయి. అవి కనీస మద్దతు ధరను పెంచడం, ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దేశంలోని అనేక రాష్ట్రాలు ఇటీవలికాలంలో కేంద్ర ప్రభుత్వ అడుగుల్లో అడుగులేసి తమవైన రైతు ఆదాయ మద్దతు విధానాలను ప్రకటించాయి. ఇవి ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కంటే ఎక్కువగా తమ తమ బడ్జెట్లలో అధిక మొత్తాన్ని రైతు సహాయ నగదు పథకాల కోసం కేటాయించాయి. కానీ ఇలాంటి ఉద్దీపన సాధనాలకు పరిమితులున్నాయి. కనీస మద్దతు ధరను దెబ్బతీసే ధరలు, పంటల ఎంపికలు అనేవి వ్యవసాయ సంస్కరణల అమలును దీర్ఘకాలంలో దెబ్బతీస్తాయి. పైగా, కేంద్రప్రభుత్వం ఇప్పటికే పంపిణీ చేయనటువంటి ఆహార ధాన్యాలను భారీస్థాయిలో నిల్వ చేసుకుని సిద్ధం చేసుకుని కూర్చుంది. దీంతో అదనపు ధాన్య సేకరణకు అవకాశాలు చాలా పరిమితమైపోయాయి. నగదు మద్దతు పథకాలు కనీస మద్దతు ధరపై ప్రతికూల ప్రభావాలను తగ్గించగలుగుతాయి కానీ వీటి అమలులో తీవ్రమైన సవాళ్లు ఎదురుకాక తప్పదు. 2018–19 రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలపై భారతీయ రిజర్వ్ బ్యాంకు తాజాగా విడుదల చేసిన నివేదిక ఎత్తి చూపినట్లుగా, ఇలాంటి ప్రత్యక్ష నగదు పంపిణీ పథకాల విజయం అనేది భూ రికార్డులను డిజిటలీకరించడం, వాటిని బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేయడం పూర్తిగా నెరవేర్చారా లేదా అనే షరతులపై ఆధారపడి ఉంటుంది. పైగా లక్షలాది మంది రైతుల భూ రికార్డుల డిజిటలీకరణ అనేది ఒక్క రాత్రిలో జరిగిపోదు. అందుకే పీఎమ్ కిసాన్ సభను వేగంగా అమలు చేయాలంటే సాధ్యపడదు. ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకాన్ని దేశంలోనే మొదటిసారిగా అమలు చేసిన తెలంగాణ రాష్ట్రం తన రైతుల భూ రికార్డుల డేటా బేస్‌ను సరిచేయడానికి దాదాపు రెండేళ్ల సమయం పట్టిందంటే వాస్తవ పరిస్థితులను మనం అర్థం చేసుకోవచ్చు. అందుచేత గ్రామీణ ఆర్థిక ఉద్దీపనను అమలు చేయడానికి మరింత మెరుగుపర్చిన రూపంలోని జాతీయ ఉపాధి హామీ పథకం ఒక బలమైన పునాదిని ఏర్పరుస్తుంది. ఈ పథకం గొప్పదనం ఏమిటంటే ఇది ఒక డిమాండ్‌ను సృష్టించే పథకం. పనికోసం చూస్తున్న ఎవరికైనా ఈ పథకం పని కల్పిస్తుంది. కాబట్టి ఆదాయ మద్దతు పథకాలతో ఘర్షించే సమస్యలను చాలావాటిని ఇది అధిగమించి గ్రామీణ ప్రాంతంలో శ్రమజీవులకు ఎక్కువ మేలు చేస్తుంది. అంతకంటే ముఖ్యంగా ఉపాధి హామీ పథకం అనేది రైతులకు మాత్రమే కాకుండా వ్యవసాయ కార్మికుల విస్తృత భాగస్వామ్యానికి వీలిచ్చేలా రూపొందించడమైనది. అందుకే ఈ పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల ప్రజల ఆదాయాలను బాగా పెంచగలుగుతుంది. చివరగా, జాతీయ ఉపాధి హామీ పథకం ప్రధానంగా గుంతలు తవ్వే పనులకే పరిమితమైపోయిందనే భావన విస్తృతంగా ప్రచారంలో ఉన్నప్పటికీ, వ్యవసాయ భూమిలో ఉత్పాదకతను మెరుగు పర్చడంలో ఇది అతి ముఖ్యమైన పాత్ర పోషించింది. ఉపాధి హామీ పథకం కింద పనుల్లో ఎక్కువ భాగం సన్నకారు రైతుల యాజమాన్యంలోని భూ కమతాలను అభివృద్ధి చేయడం పైనే దృష్టి పెట్టాయి. ఉదాహరణకు సాగునీటి వసతుల నిర్మాణం, పశువులు, జంతువుల షెడ్ల నిర్మాణం వంటివి. భూ ఉత్పాదకతను మెరుగుపర్చడం అంటేనే రైతుల ఆదాయాలను సూత్రబద్ధంగా పెంచడం, వ్యవసాయ కార్మికులకు డిమాండును అధికంగా ఏర్పర్చడం అన్నమాట. అయితే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పైకెత్తాలంటే బడ్జెట్లలో కేటాయింపులను పెంచవలసి ఉంటుంది. అధిక వేతనాలు ఇవ్వడం, అమలులో మెషిన్ తరహా క్రమబద్ధమైన పర్యవేక్షణను సాగించడం చేయాల్సి ఉంటుంది. 2012–13 సంవత్సరం నాటి నుంచి ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ కేటాయింపులను తగ్గిస్తూ వచ్చినప్పటికీ పనికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో 2017–18 నాటికి రూ. 5,000 కోట్ల రూపాయల విలువైన అదనపు వ్యయం వెచ్చించాల్సి వచ్చింది. పర్యవసానంగా, వేతన చెల్లింపుల్లో ఆలస్యం జరిగింది. 2017–18 సంవత్సరం తొలి సగంలో 32 శాతం వేతనాలు మాత్రమే సకాలంలో పంపిణీ చేయగలిగారు. పైగా రాష్ట్ర కనీస వేతనాల కంటే తక్కువ స్థాయిలో జాతీయ ఉపాధి హామీ పథకంలో చెల్లించే వేతనాలు తగ్గుస్థాయికి పడిపోయాయి. ఈ అడ్డంకులను అధిగమించడం పరిష్కరించడం సంక్లిష్టంగా మారింది. అయితే కేంద్ర ప్రభుత్వం జీడీపీలో 10 శాతం వరకు అధిక అప్పులను చేస్తున్నప్పుడు ఉపాధి హామీ పథకాన్ని విస్తరింపజేయడం ఎలా అనేది ప్రశ్న. ప్రభుత్వం అప్పుల జోలికి వెళ్లకుండానే ఈ పథకానికి నిధులను సమకూర్చవచ్చు. ఎరువులు, నీరు, విద్యుత్ వంటి వాటిపై ఇస్తున్న భారీ సబ్సిడీలను దశలవారీగా హేతుబద్దీకరించడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. సంక్షోభం అనూహ్య అవకాశాలను కల్పిస్తుంది. భారతీయ సబ్సిడీ రాజ్‌ని సంస్కరించడం చాలాకాలంగా పెండింగులో ఉంది. ఉపాధి హామీ పథకాన్ని విస్తృతం చేయడం అంటేనే వ్యవస్థ నిర్మాణాత్మక సంక్షోభానికి ఒక పరిష్కారం కావచ్చు. యామిని అయ్యర్, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ -
ఆర్థిక మాంద్యం.. రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం
సాక్షి. హైదరాబాద్: మంచినీరు, ఇతర అత్యవసరాలు మినహాయించి కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు, ఇతర నిర్మాణ పనులకు టెండర్లు పిలవరాదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని డిపార్టుమెంట్లలోని ఇంజనీరింగ్ విభాగాలకు అత్యవసర సందేశాలు పంపింది. ఆర్థిక మాంద్యం, సంక్షేమ పథకాలకు నిధుల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మాంద్యం నుంచి బయటపడేదాకా కొత్త ప్రతిపాదనలేవీ ఆమోదించవద్దని ప్రభుత్వం ఆదేశించింది. తాజా ఆదేశాలతో సాగునీటి శాఖ, పంచాయతీరాజ్, రహదారులు, భవనాలు వంటి కీలక డిపార్ట్మెంట్లలో రూ.25 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు, పనులకు బ్రేక్ పడింది. సాగునీటి శాఖలో కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణ పనులు, మంజీరా నదిపై నిర్మించాలని ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకం, రహదారులు, భవనాల శాఖ చేపట్టాలని భావించిన హైదరాబాద్–నాగార్జునసాగర్ నాలుగు లేన్ల రహదారి, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రహదారుల విస్తరణ పనులు ఆగిపోనున్నాయి. గ్రామీణ రహదారులకు సంబంధించి రూ.150 కోట్ల విలువైన పనులు కూడా ఈ నిర్ణయంతో బ్రేక్‌పడినట్లే. సాగునీటి శాఖలో రూ.15 వేల కోట్ల పనులకు బ్రేక్.. కాళేశ్వరం ఎత్తిపోతల్లో మిడ్‌మానేరు దిగువన మల్లన్నసాగర్ వరకు అదనపు మూడో టీఎంసీ నీటిని పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నీటి తరలింపునకు మూడు స్థాయిల్లో లిఫ్టులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనిలో మిడ్‌మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్ వరకు పైప్‌లైన్ వ్యవస్థ నిర్మాణానికి రూ.4,142 కోట్లు, అనంతగిరి నుంచి మల్లన్నసాగర్ వరకు పైప్‌లైన్ నిర్మాణానికి రూ.10,260 కోట్లు అవుతుందని అంచనా వేశారు. మొత్తంగా రూ.14,362 కోట్ల మేర వ్యయం అవుతుండగా, ఈ పనులకు టెండర్లు పిలవాల్సి ఉంది. నిజాంసాగర్ కింద మంజీరా నదిపై పిట్లం, బిచ్కుంద మండలాల పరిధిలోని 21 గ్రామాల్లో 30,646 ఎకరాలకు నీరిచ్చేందుకు మల్లూర్ సమీపంలో రూ.476 కోట్లతో మంజీరా ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2.90 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టే ఈ పథకానికి టెండర్లు పిలవాల్సి ఉంది. ఇక గోదావరి జలాలను వినియోగించుకునేందుకు చేపట్టిన దేవాదుల ప్రాజెక్టులో అదనపు నీటి నిల్వలు పెంచేందుకు కొత్త రిజర్వాయర్ నిర్మాణం చేయాలని నిర్ణయించారు. అందుకు 10.78 టీఎంసీల సామర్థ్యంతో.. రూ.3,672 కోట్లతో వరంగల్ జిల్లా ఘనపూర్ మండలం లింగంపల్లి వద్ద దీన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. గోదావరికి వరద ఉండే 3 నెలల కాలంలో ధర్మసాగర్ నుంచి నీటిని రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేలా దీన్ని డిజైన్ చేశారు. రెండున్నరేళ్లలో రిజర్వాయర్‌ను పూర్తి చేసేలా ఇటీవలి రాష్ట్ర ఎన్నికలకు ముందు ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులకు సిద్ధంగా కాగా వాటిని రద్దు చేశారు. ప్రస్తుత నిర్ణయంతో కొత్త టెండర్లు పిలిచే అవకాశం లేనట్లే. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో గ్రామీణ రోడ్లకు సంబంధించి కొత్త పనులకు మంజూరు ఇవ్వకపోగా, నిధుల లేమి కారణంగా ఇప్పటికే మంజూరైన రూ.150 కోట్ల పనులకు కూడా బ్రేక్ వేశారు. పంచాయతీ రాజ్ పరిధిలోని కొత్త గ్రామ పంచాయతీ కార్యాలయాల నిర్మాణాలతో పాటే ఇతర నిర్మాణ పనులు పక్కనపెట్టారు. నాలుగు వరసల రోడ్లూ అంతే... జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు నాలుగు వరసల రోడ్లను నిర్మించే ప్రాజెక్టుకు కూడా కొంత గండిపడింది. ప్రస్తుతం రాష్ట్రంలో వనపర్తి, నాగర్‌కర్నూలు, గద్వాల, నారాయణపేట, ములుగు జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు నాలుగు వరసల రోడ్లు లేవు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ పనులూ పడకేసినట్టే. అయితే నాలుగు వరసల రోడ్లను జాతీయ రహదారుల్లో భాగంగా అనుసంధానిస్తున్నందున, కొత్త జాతీయ రహదారుల నిర్మాణం ప్రారంభమైతే ఈ పనులు పూర్తయినట్టే. పెండింగ్.. రూ.10వేల కోట్లు.. ఇక రైతుబంధు, సన్నబియ్యం, ఆసరా పింఛన్లుకు అధికంగా నిధులు ఖర్చువుతున్న నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో భారీగా బిల్లులు పెండింగ్‌లో పడిపోయాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం.. రూ.10,765 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో రూ.2వేల కోట్లు, పాలమూరు–రంగారెడ్డి పరిధిలో రూ.1,600 కోట్లు, మైనర్ ఇరిగేషన్ పరిధిలో రూ.700 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. డబుల్ రోడ్లకూ బ్రేక్.. జిల్లాకేంద్రాల నుంచి రాజధానికి నాలుగు వరుసల రోడ్లు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు నిర్మించడానికి రూ.13 వేల కోట్లతో పనులు మొదలై ఇప్పటిదాకా ఉధృతంగా సాగాయి. ఇప్పుడు మాంద్యం వాటికి ముప్పుగా మారింది. రోడ్డు నిర్మాణ పనుల్లో దాదాపు ఏడాది కాలంగా బిల్లులు నిలిచిపోవడంతో చాలా చోట్ల కాంట్రాక్టర్లు పనులు నిలిపేశారు. పలు శాఖల్లోని పెండింగ్ బిల్లులను క్లియర్ చేసిన తర్వాతే కొత్త పనులు చేపట్టాలన్న విధానపర నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. రోడ్డు పనులకు రూ.వేయి కోట్లు చెల్లించాల్సి ఉంది. కొత్తగా ఏర్పడిన 54 మండల కేంద్రాల్లో డబుల్ రోడ్డు వసతి లేదు. వాటి నుంచి జిల్లా కేంద్రాలకు 687.95 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించాల్సి ఉండగా, రూ.1205 కోట్లు అవుతుందని డీపీఆర్‌లు రూపొందించారు. నిధులు మంజూరు చేసే వేళ మాంద్యంతో ఈ పనులకు బ్రేక్ పడింది. -
వరాల సీతమ్మ
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్లో ఆదాయపు పన్ను రాయితీలపై అన్ని వర్గాలూ ఆశలు పెంచుకున్నా... తీరా బడ్జెట్ మాత్రం చాలా మందిని నిరాశపరిచింది. నెలకు రూ. 40 వేల జీతం దాటిన వారికి... అంటే వార్షికాదాయం రూ. 5 లక్షలు దాటిన వారికి నాటి రాయితీలతో ఒరిగిందేమీ లేదు. అందుకే ఈసారి ఎన్నికల్లో గెలిచి ఎన్డీఏ ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్‌పై అంతా ఆశలు పెంచుకున్నారు. పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న తొలి మహిళగా చరిత్ర సృష్టిస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్... మధ్యతరగతి మహిళగా అన్ని వర్గాల అవసరాలూ తెలిసిన వారు కావడం దీనికి మరింత ఊతమిస్తోంది. ఉదయం 11 గంటలకు పార్లమెంటులో నిర్మల ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో... ఐదు సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా తగ్గిన వృద్ధి స్పీడ్‌ను పెంచేందుకు ఉద్దీపనలు ఉండవచ్చనే అంచనాలతోపాటు కంపెనీలపై, సామాన్యులపై పన్ను భారం తగ్గిస్తారనే ఆశలూ ఉన్నాయి. అంచనాలను క్లుప్తంగా చూస్తే... అన్ని రంగాల్లో మందగమనమే అంతర్జాతీయ పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూలత చూపుతున్నాయి. వివిధ అంశాల్లో గణాంకాలు నేలచూపులు చూస్తున్నాయి. వివిధ దేశాల రక్షణాత్మక వాణిజ్య విధానాలు... అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం, యూరప్ నుంచి బ్రిటన్ విడిపోవడానికి సంబంధించిన బ్రెగ్జిట్, రష్యా, ఇరాన్, వెనెజులాలపై అమెరికా ఆంక్షల ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రస్ఫుటమవుతోంది. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ఉద్దీపన చర్యలు తప్పవన్న విశ్లేషణలు ఆర్థిక వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయాలు– వ్యయాల మధ్య నికర వ్యత్యాసమైన ద్రవ్యలోటును కట్టడి చేయడంపై ప్రధానంగా బడ్జెట్ దృష్టిసారించే వీలుంది. అయితే దీనిపై దీర్ఘకాలికంగా రాజీపడకుండా ఆర్థిక వ్యవస్థను ముందుకు ఉరికించడానికి ప్రభుత్వ వ్యయాలు తగువిధంగా పెంచడానికే బడ్జెట్ మొగ్గుచూపే వీలుంది. కొన్ని కేటగిరీలకు సంబంధించి వ్యక్తిగత ఆదాయపు పన్ను రాయితీలు ప్రకటించే అవకాశం ఉంది. వ్యవసాయం, ఆరోగ్యం, సామా జిక రంగాలపై వ్యయాలు పెరగొచ్చు. జనవరి–మార్చి మధ్య ఐదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటుకు (5.8%) ఊతం అందించడానికి మౌలిక రంగంపై ప్రధానంగా బడ్జెట్ దృష్టి సారించవచ్చు. రైల్వేలు, రహదారుల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించే వీలుంది. – దివాలా సమస్యల సత్వర పరిష్కారంపై మరింతగా దృష్టి సారించవచ్చు. – బ్యాంకులు కానీ ఆర్థిక సంస్థలకు (ఎన్బీఎఫ్సీ), లఘు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఎటువంటి ద్రవ్యపరమైన ఇబ్బందులూ రాకుండా చర్యలు తీసుకునే అవకాశముంది. – ఎగుమతులకు ప్రోత్సాహమిచ్చేలా మరిన్ని చర్యలను ప్రకటించవచ్చు. – ప్రభుత్వ ఆదాయాల కోసం ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అధిక డివిడెండ్లు వంటి అంశాలపై దృష్టి పెట్టవచ్చు. బడ్జెట్ టీమ్.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పరిమిత కాలానికి ప్రభుత్వ వ్యయాలకు వీలు కల్పిస్తూ ఫిబ్రవరి 1న కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇక ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని తాజా బడ్జెట్ టీమ్‌లో ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్, ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ ఉన్నారు. ఫైనాన్స్ కార్యదర్శి సుభాష్‌చంద్ర గార్గ్ నేతృత్వంలోని అధికారుల బృందంలో వ్యయ వ్యవహారాల కార్యదర్శి గిరీష్‌చంద్ర ముర్మూ, రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే, డీఐపీఏఎం సెక్రటరీ అతన్ చక్రవర్తి, ఫైనాన్స్ సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్‌లు ఉంటారు. -
ఎకనమిక్స్‌లో ఇద్దరికి నోబెల్ పురస్కారం
-
ఆర్థిక ఇబ్బందులు తాళలేక వృద్ధుడి ఆత్మహత్య
ఆత్మకూరు : ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ వృద్దుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ముస్త్యాలపల్లికి చెందిన మంద పోషయ్య(60)కు ఆర్థికంగా ఇబ్బందులు ఉండడంతో క్రిమిసంహారక మందు తాగి బుధవారం ఆత్మహత్యకు యత్నించాడు. విషయాన్ని గమనించిన బంధువులు చికిత్స నిమిత్తం ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు, మృతుడి భార్య సూరమ్మ ఫిర్యాదు మేరకు ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
ఉరివేసుకొని వృద్ధుడు మృతి
కాల్వశ్రీరాంపూర్(కరీంనగర్): ఆర్థిక ఇబ్బందులతో వృద్ధుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కాల్వశ్రీరాంపురం మండలం ఊసన్నపల్లి గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన రాములు(65) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కుటుంబసభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.