సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్‌లో ఆదాయపు పన్ను రాయితీలపై అన్ని వర్గాలూ ఆశలు పెంచుకున్నా... తీరా బడ్జెట్ మాత్రం చాలా మందిని నిరాశపరిచింది. నెలకు రూ. 40 వేల జీతం దాటిన వారికి... అంటే వార్షికాదాయం రూ. 5 లక్షలు దాటిన వారికి నాటి రాయితీలతో ఒరిగిందేమీ లేదు. అందుకే ఈసారి ఎన్నికల్లో గెలిచి ఎన్‌డీఏ ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్‌పై అంతా ఆశలు పెంచుకున్నారు. పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న తొలి మహిళగా చరిత్ర సృష్టిస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్... మధ్యతరగతి మహిళగా అన్ని వర్గాల అవసరాలూ తెలిసిన వారు కావడం దీనికి మరింత ఊతమిస్తోంది. ఉదయం 11 గంటలకు పార్లమెంటులో నిర్మల ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో... ఐదు సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా తగ్గిన వృద్ధి స్పీడ్‌ను పెంచేందుకు ఉద్దీపనలు ఉండవచ్చనే అంచనాలతోపాటు కంపెనీలపై, సామాన్యులపై పన్ను భారం తగ్గిస్తారనే ఆశలూ ఉన్నాయి. అంచనాలను క్లుప్తంగా చూస్తే...
అన్ని రంగాల్లో మందగమనమే
అంతర్జాతీయ పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూలత చూపుతున్నాయి. వివిధ అంశాల్లో గణాంకాలు నేలచూపులు చూస్తున్నాయి. వివిధ దేశాల రక్షణాత్మక వాణిజ్య విధానాలు... అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం, యూరప్ నుంచి బ్రిటన్ విడిపోవడానికి సంబంధించిన బ్రెగ్జిట్, రష్యా, ఇరాన్, వెనెజులాలపై అమెరికా ఆంక్షల ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రస్ఫుటమవుతోంది. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ఉద్దీపన చర్యలు తప్పవన్న విశ్లేషణలు ఆర్థిక వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ ఆదాయాలు– వ్యయాల మధ్య
నికర వ్యత్యాసమైన ద్రవ్యలోటును కట్టడి చేయడంపై ప్రధానంగా బడ్జెట్ దృష్టిసారించే వీలుంది. అయితే దీనిపై దీర్ఘకాలికంగా రాజీపడకుండా ఆర్థిక వ్యవస్థను ముందుకు ఉరికించడానికి ప్రభుత్వ వ్యయాలు
తగువిధంగా పెంచడానికే బడ్జెట్ మొగ్గుచూపే వీలుంది. కొన్ని కేటగిరీలకు సంబంధించి వ్యక్తిగత ఆదాయపు పన్ను రాయితీలు ప్రకటించే అవకాశం ఉంది. వ్యవసాయం, ఆరోగ్యం, సామా జిక రంగాలపై వ్యయాలు పెరగొచ్చు. జనవరి–మార్చి మధ్య ఐదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటుకు (5.8%) ఊతం అందించడానికి మౌలిక రంగంపై ప్రధానంగా బడ్జెట్ దృష్టి సారించవచ్చు. రైల్వేలు, రహదారుల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించే వీలుంది.
– దివాలా సమస్యల సత్వర పరిష్కారంపై మరింతగా దృష్టి సారించవచ్చు.
– బ్యాంకులు కానీ ఆర్థిక సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీ), లఘు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఎటువంటి ద్రవ్యపరమైన ఇబ్బందులూ రాకుండా చర్యలు తీసుకునే అవకాశముంది.
– ఎగుమతులకు ప్రోత్సాహమిచ్చేలా మరిన్ని చర్యలను ప్రకటించవచ్చు.
– ప్రభుత్వ ఆదాయాల కోసం ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అధిక డివిడెండ్లు వంటి అంశాలపై దృష్టి పెట్టవచ్చు.
బడ్జెట్ టీమ్..
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పరిమిత కాలానికి ప్రభుత్వ వ్యయాలకు వీలు కల్పిస్తూ ఫిబ్రవరి 1న కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇక ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని తాజా బడ్జెట్ టీమ్‌లో ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్, ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ ఉన్నారు. ఫైనాన్స్ కార్యదర్శి సుభాష్‌చంద్ర గార్గ్ నేతృత్వంలోని అధికారుల బృందంలో వ్యయ వ్యవహారాల కార్యదర్శి గిరీష్‌చంద్ర ముర్మూ, రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే, డీఐపీఏఎం సెక్రటరీ అతన్ చక్రవర్తి, ఫైనాన్స్ సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్‌లు ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment