జెనీవా: ప్రపంచంలోనే అతి పొడవైన ప్రయాణికుల రైలు తమదేనంటూ స్విట్జర్లాండ్‌కు చెందిన రేషియన్ రైల్వే కంపెనీ ప్రకటించింది. 100 బోగీలతో 1.9 కిలోమీటర్ల పొడవైన ఈ రైలును ఆల్ఫ్స్ పర్వతాల గుండా అల్బులా/బెర్నినా మార్గంలో నుంచి ప్రీడా నుంచి బెర్గ్యున్ వరకు శనివారం విజయవంతంగా నడిపినట్లు తెలిపింది. సుమారు 25 కిలోమీటర్ల ప్రయాణానికి గంట సమయం పట్టిందని వివరించింది.
పర్వతాల దిగువన మెలికలు తిరుగుతూ ఉండే 22 టన్నెళ్లు, 48 వంతెనల మీదుగా సాగే సుందరమైన ఈ మార్గాన్ని 2008లో యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చిందని తెలిపింది. 175వ వార్షిక ఆవిర్భావ ఉత్సవాలు జరుపుకుంటున్న స్విస్ రైల్వేల ఇంజినీరింగ్ ప్రతిభను చాటేందుకే ఈ ప్రయత్నాన్ని చేపట్టినట్లు రేషియన్ రైల్వే డైరెక్టర్ రెనాటో ఫసియాటి చెప్పారు. ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment