శాన్‌ఫ్రాన్సిస్కో : టెక్నాలజీ ప్రాబల్యంతో ఆన్‌లైన్ వేదికల ద్వారా విద్వేషం, హింస పెరిగిపోతున్నదనే ఆరోపణల నేపథ్యంలో అమెరికన్ సెనేట్‌లో బుధవారం జరిగే విచారణ సందర్బంగా టెక్ దిగ్గజాలు విచారణ కమిటీ ఎదుట హాజరుకానున్నారు. సాంకేతిక దిగ్గజాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో వారు నిర్మంచిన దిగ్గజ సంస్థలు అమెరికన్ చట్టాలకు అనుగుణంగా ఎదిగిన తీరును వారు సమర్ధించుకోనున్నారు. ఫేస్‌బుక్ చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, గూగుల్ దాని మాతృసంస్థ అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్‌లు విచారణకు హాజరుకానున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగనున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాలుగు దిగ్గజ టెక్నాలజీ సంస్థల సీఈఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొంటారు.
చదవండి : ఎఫ్‌బీ బ్యాన్: కోర్టును ఆశ్రయించిన అధికారి
సభా కమిటీ విచారణ ప్రారంభమవనున్న నేపథ్యంలో ఫేస్‌బుక్ చీఫ్ జుకర్‌బర్గ్ మాట్లాడుతూ అమెరికన్ కంపెనీగా ఫేస్‌బుక్ ఎదిగిన తీరు గర్వకారణమని అంటూ పోటీతత్వాన్ని ప్రేరేపించే అమెరికన్ చట్టాల ఆసరాతో తమ కంపెనీ ఎదిగిందని చెప్పుకొచ్చారు. హానికారక కంటెంట్, గోప్యత, ఎన్నికల సమగ్రత వంటి కీలక అంశాలపై కంపెనీలు ఇష్టానుసారం తీర్పులు ఇవ్వరాదన్నది తన అభిమతమని జుకర్‌బర్గ్ పేర్కొనడం గమనార్హం. ఇక ఇంటర్‌నెట్ నిబంధనలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు ఇంటర్‌నెట్ నిబంధనల మార్పును అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ నొక్కిచెప్పనున్నారు. అమెరికా విజయ ప్రస్ధానంగా అమెజాన్‌ను ఆయన అభివర్ణిస్తూ అమెజాన్‌లోనూ నిబంధనల పరిశీలన అవసరమని తాను నమ్ముతానని విచారణకు ముందు బెజోస్ ఆన్‌లైన్‌లో వ్యాఖ్యానించారు. జెఫ్ బెజోస్ కాంగ్రెస్ ఎదుట విచారణకు హాజరవడం ఇదే తొలిసారి.
ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి
సమాచార గోప్యత నుంచి డేటా దుర్వినియోగం వరకూ విచారణ సందర్బంగా జ్యుడిషియరీ కమిటీ సాంకేతిక దిగ్గజాలను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయవచ్చని భావిస్తున్నారు. మార్కెట్‌ప్లేస్‌లో తమ అధికారాలను వీరు దుర్వినియోగం చేస్తున్నారా అనే కోణంలోనూ ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ప్రస్తుత అమెరికా యాంటీట్రస్ట్ చట్టాలను మార్చడంపైనా వారి అభిప్రాయాలు కోరనున్నారు. ఇక హింసను ప్రేరేపించే విద్వేష కంటెంట్‌ను కట్టడి చేయడంలో ఫేస్‌బుక్ విఫలమైందనే ఆరోపణల నడుమ ప్రతినిధుల కమిటీ ఎదుట టెక్ దిగ్గజాల విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment