పోలీస్‌స్టేషన్లు, వాహనాలే లక్ష్యంగా దాడులు
కనీసం 50 మంది కాల్చివేత
సైన్యం ఏరివేతలో 12 మంది ఉగ్రవాదులు హతం
కరాచీ: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో మిలిటెంట్ గ్రూప్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్‌ఏ) రెచ్చిపోయింది. ఆది, సోమ వారాల్లో బీఎల్‌ఏ సాయుధులు పోలీస్ స్టేషన్లు, రైలు మార్గాలు, వాహనాలపై దాడులు జరిపి 50 మందిని చంపేశారు. అనంతరం సైన్యం చేపట్టిన ఏరివేతలో 12 మంది మిలిటెంట్లు హతమయ్యారు. బీఎల్‌ఏ సభ్యులు ఆదివారం రాత్రి బలోచిస్తాన్‌లోని ముసాఖెల్ జిల్లాలోని హైవేను దిగ్బంధించారు. అటుగా వచ్చిన బస్సులు, ట్రక్కులను అడ్డగించి, ప్రయాణికులతోపాటు డ్రైవర్లను కిందికి దించివేశారు.
‘గుర్తింపు కార్డులు పరిశీలించాక పంజాబ్, ఖైబర్ పంఖ్తున్వా ప్రావిన్స్‌లకు చెందిన 23 మందిని తుపాకులతో కాల్చి చంపారు. అనంతరం సమీపంలోని కొండ ప్రాంతంలోకి వారంతా పరారయ్యారు. ఉగ్రవాదులు ప్రయాణికుల వాహనాలతో పాటు బొగ్గుతో వెళ్లే ట్రక్కులను కూడా అడ్డగించి డ్రైవర్లను చంపేశారు. పది ట్రక్కులకు నిప్పుపెట్టారు’అని అధికారులు తెలిపారు. ఇదే ప్రావిన్స్‌లోని మరికొన్ని చోట్ల ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్లు, భద్రతా బలగాల పోస్టులే లక్ష్యంగా దాడులకు దిగారు. ఈ ఘటనల్లో మరో 10 మంది చనిపోయారు.
బలోచిస్తాన్‌లోని ఖలాట్ జిల్లాలో మరో ఘటనలో..ఆరుగురు పోలీసులు సహా మొత్తం 11 మందిని బీఎల్‌ఏ తీవ్రవాదులు చంపారు. మరో ఘటనలో బొలాన్ జిల్లా డొజాన్ ప్రాంతంలోని పాక్– ఇరాన్‌లను కలిపే రైల్వే మార్గంపై వంతెనను పేల్చివేసిన ఉగ్రవాదులు, ఆరుగురిని కాల్చి చంపారు. ఈ ఘటనలకు తమదే బాధ్యతంటూ అనంతరం బీఎల్‌ఏ మీడియాకు పంపిన ఈ మెయిల్‌లో ప్రకటించుకుంది. పారామిలటరీ బలగాల బేస్‌పైనా దాడి చేసినట్లు అందులో చెప్పుకుంది. అయితే, ప్రభుత్వం దీనిని ధ్రువీకరించాల్సి ఉంది. సహజవనరులు పుష్కలంగా ఉన్న బలూచిస్తాన్ పాక్‌లోని అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉండిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment