ఇస్లామాబాద్ : అనైతిక, అసభ్యకరమైన సందేశాలకు వేదికగా మారిన టిక్‌టాక్ వీడియో షేరింగ్ యాప్‌ను పాకిస్తాన్ ఇటీవల బ్యాన్ చేసింది. చట్టపరమైన చర్యలను చేపట్టడంలో టిక్‌టాక్ యాజమాన్యం విఫలమైందని, అసభ్యతతో కూడి కంటెంట్ ఎక్కువగా ఉంటోందని పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ (పీటీఏ) ఫిర్యాదు మేరకు అక్టోబర్ 9న నిషేధం విధించి చైనాకు ఊహించని షాక్ ఇచ్చింది. సమాజంలోని వివిధ వర్గాల నుంచి అనేక ఫిర్యాదులను స్వీకరించిన తరువాత ఈ చర్య తీసుకున్నట్లు పీటీఏ తెలిపింది అయితే పది రోజులు కూడా గడవకమందే పాక్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. టిక్‌టాక్‌ను తిరిగి పునరుద్ధరించింది. నిషేధాన్ని ఎత్తివేస్తూ యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ఆ దేశ సమాచార మంత్రిత్వశాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
అయితే పాకిస్తాన్ మిత్రదేశం చైనా ఒత్తిడి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. టిక్‌టాక్‌ను నిషేధించడం పాక్ ప్రభుత్వానికి తొలినుంచీ అండగా నిలుస్తున్న డ్రాగన్‌కు ఏమాత్రం మింగుడుపడటంలేదని, యాప్‌ను తిరిగి పునరుద్ధరించాలని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై ఒత్తిడి తెచ్చినట్లు అభిప్రాయపడుతున్నారు. కాగా టిక్‌టాక్‌లో ప్రజలు ఇచ్చే సమాచారానికి భద్రత లేని కారణంగా భారత ప్రభుత్వం ఇటీవలే ఆ యాప్‌ను నిషేధించిందిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో చైనా దురాక్రమణకు నిరసనగా కేంద్ర ప్రభుత్వం మరికొన్ని యాప్స్‌ను సైతం నిషేధించింది. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా కూడా ఈ అప్లికేషన్‌ను బ్యాన్ చేసేందుకు సిద్ధంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment