అష్టదిగ్బంధనంలో గాజా.. భూతల దాడులకు సర్వం సిద్ధం! | Trials for attacks on Gaza Completed Israel-Hamas War Live Updates | Sakshi
Sakshi News home page

Israel-Hamas War Live Updates: అష్టదిగ్బంధనంలో గాజా

Published Sat, Oct 28 2023 2:04 PM | Last Updated on Sat, Oct 28 2023 2:54 PM

Trials for attacks on Gaza Completed Israel-Hamas War Live Updates - Sakshi

గాజాపై భూతల దాడులు చేయడానికి ట్రయల్స్‌ పూర్తయ్యాయి. గాజాకు బయటి నుంచి ఎటువంటి సరఫరాలు జరక్కుండా చేసిన అష్టదిగ్బంధనం ఉచ్చు మరింత బిగిసింది. మానవతాసాయం ఎట్టిపరిస్థితుల్లో అందాలన్న ఐక్యరాజ్యసమితి చేతులెత్తేసింది. శాంతిస్థాపన తీర్మానం అంటూ.. మానవతాసాయానికి పరిమితమై సమావేశాన్ని ముగించింది యూరోపియన్‌ యూనియన్‌. హమాస్‌ను  అంతం చేస్తానన్న ఇజ్రాయెల్‌ యుద్ధ గర్జన కంటిన్యూ అవుతోంది. 

తీవ్ర మానవతా సంక్షో భంలో కొట్టుమిట్టాడుతున్న గాజా వాసులకు ఊరట దక్కే సూచనలు కనుచూపు మేరలో కనబడ్డం లేదు. 22 రోజులుగా డే అండ్‌ నైట్‌.. ట్వంటీఫోర్‌ ఇన్‌టూ సెవెన్‌ ప్రాతిపదికన ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులకు పాలస్తీనీయులు భీతిల్లిపోతున్నారు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తోంది. ఏ క్షణంలో ఎటువైపు నుంచి రాకెట్లు, బాంబులు వచ్చి మీదపడతాయో తెలియక మృత్యువుకు సన్నిహితంగా మెలుగుతున్నారు. నిత్యావసర-అత్యవసర సరుకు సరంజామా నిల్వలు అడుగంటిపోయాయి. ఇజ్రాయెల్‌ దిగ్బంధించిన కారణంగా.. బయటి ప్రపంచం నుంచి సరఫరాలు పూర్తిగా నిలిచిపోవడంతో ఇక గాజావాసులు ఆకలిదప్పులతో అలమటించే పరిస్థితులు దాపురిస్తున్నాయి. 
 

గాజాకు మానవీయ సాయం అందకుండా ఇజ్రాయెల్‌ తన కాళ్ళూ చేతులూ కట్టిపడేసిందని ఐక్యరాజ్యసమితి వాపోయింది. హమాస్‌ చర్య ఊహించనిదో, మొదటిసారి చేసిందో కాదంటూ UN సెక్రెటరీ జెనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ చేసిన వ్యాఖ్యలతో ఇజ్రాయెల్‌కు పుండుమీద కారంలా మారింది. హమాస్ చెరలో ఉన్న బందీలను విడిపించడంతో పాటు.. హమాస్‌ను పూర్తిగా తుదముట్టించేవరకు యుద్ధం ఆగదంటూ తెగేసి చెప్పింది ఇజ్రాయెల్‌. భూతల దాడులు చేస్తానని హెచ్చరించింది. అందుకు తగ్గట్టే..ఎంపిక చేసుకున్న టార్గెట్లపై లక్షిత దాడులతో విరుచుకుపడుతోంది.

ఇంకోపక్క బ్రస్సెల్స్‌లో సమావేశమైన యూరోపియన్‌ యూనియన్‌ నేతలు కూడా కాల్పుల విరమణ తీర్మానంపై వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కాల్పుల విరమణ స్థానే గాజాకు అడపాదడపా మానవతాసాయం అందజేయడానికి ఇజ్రాయెల్‌ సహకరించాలని కోరుతూ తీర్మానం చేసేసి చేతులు దులుపుకున్నారు.ఇప్పటికే.. కాల్పుల విరమణ,. మానవతా సాయం అందజేతపై తీర్మానం చేయడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి  పలుమార్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 
 

ఇజ్రాయెల్‌ భీకర దాడుల నేపథ్యంలో.. ఎటూపోయేందుకు దారీతెన్నూలేక ఒకవైపు.. నిత్యావసరాలు దొరక్క మరోవైపు. . 20లక్షల మందికి పైగా పాలస్తీనీయులు గాజాస్ట్రిప్‌లో అలమటిస్తున్నారు. ఇంకో రోజు గడిస్తే.. ఇప్పుడు చేస్తున్న పరిమిత సాయం కూడా అందించలేనని పెదవి విరిచింది గాజాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయం. తక్షణం జనరేటర్లకు అవసరమైన ఇంధనం అందకుంటే మరో ఇరవై నాలుగ్గంటల్లో ఆఫీస్‌ షట్‌డౌన్‌ చేయక తప్పదని ప్రకటించింది.
ఇది కూడా చదవండి: 200 హెలికాప్టర్లతో ఇరాన్‌ యుద్ధ విన్యాసాలు!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement