
బందీలను వదలకుంటే మీ పనిపడతా
హమాస్‌కు ట్రంప్ అల్టిమేటం
వాషింగ్టన్: గాజా స్ట్రిప్‌లో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలు, ఇతర దేశస్తులను శనివారం మధ్యాహ్నం 12 గంటలకల్లా విడుదల చేయకపోతే హమాస్ అంతుచూస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా షెడ్యూల్ ప్రకారం సమయానికి బందీలను విడుదల చేసి తీరాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని, అందుకు ప్రతిగా బందీల విడుదల ప్రక్రియ ఆలస్యం కావొచ్చని హమాస్ ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ తీవ్రస్థాయిలో స్పందించారు.
వైట్‌హౌస్‌లోని ఓవల్ కార్యాలయంలో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ‘‘ఒకటి, మూడు, నాలుగు, రెండు ఇలా కాదు.. మొత్తం బందీలందరినీ విడుదల చేయాలి. శనివారం మధ్యాహ్నం 12 గంటలకల్లా బందీలు అందరూ విడుదలై మా చెంతకు చేరాలి. లేదంటే హమాస్‌కు నరకం అంటే ఏంటో చూపిస్తాం. కాల్పుల విరమణ ఒప్పందం రద్దుచేయాలని ఇజ్రాయెల్‌ను ఆదేశిస్తా’’ అని అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం రద్దుకు ఇజ్రాయెల్ ఒప్పుకుంటుందా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘ అది వాళ్ల ఇష్టం. నా వరకైతే బందీలను విడుదల చేయకుంటే వాళ్ల పనిపడతా. ఇక కాల్పుల విరమణ అంశంలో వాళ్ల కోణంలో తుది నిర్ణయం ఇజ్రాయెల్‌దే. బందీలను విడుదలచేయకపోతే నా మాటల్లోని తీవ్రత ఎంత అనేది హమాస్‌కు తెలిసేలా చేస్తా’’ అని అన్నారు.
ఆలస్యంపై ఇజ్రాయెల్ ఆగ్రహం
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నందుకే బందీలను ఆలస్యంగా వదిలేస్తామన్న హమాస్ ప్రకటనను ఇజ్రాయెల్ తీవ్రంగా తప్పుబట్టింది. ఒప్పందాన్ని ఉల్లంఘించింది హమాసేనని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ అన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భద్రతా కేబినెట్‌తో సమావేశమయ్యారు. శనివారం మధ్యాహ్నా నికల్లా బందీలను వదిలేయకుంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేస్తామంటూ హమాస్‌కు అల్టిమేటమిచ్చారు. మరోవైపు బందీల విడుదల నిలిపివేత ప్రకటన నేపథ్యంలో వారి కుటుంబాలు, మద్దతుదారులు టెల్ అవీవ్ లో ఆందోళనకు దిగారు. ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన ఈజిప్టు ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేసింది. 42 రోజుల ఒప్పందంలో మొదటి దశలో విడుదల కానున్న 33 మంది బందీల్లో 16 మంది స్వదేశానికి తిరిగి వచ్చారు. ఐదుగురు థాయ్ బందీలను కూడా అనధికారికంగా విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment