
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాటిక్ సభ్యురాలు కమల హారిస్‌పై నోరుపారేసుకున్నారు. అధ్యక్ష పదవికి ఆమె అసలు పోటీదారే కాదన్నారు. ఆమెతో పోల్చితే ఇవాంక బెటర్ చాయిస్ అన్నారు. శుక్రవారం న్యూ హాంప్‌షైర్‌లో జరిగిన రిపబ్లికన్ ప్రచార ర్యాలీలో తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఒక మహిళ అమెరికా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాలని నేను కోరుకుంటున్నాను. అందుకు మద్దతు కూడా తెలుపుతున్నాను. అయితే ఆ పదవికి హారిస్ అర్హురాలు కాదు.. పోటీదారు అంతకన్నా కాదు. వైట్ హౌస్ సీనియర్ సలహాదారు ఇవాంక ట్రంప్ అయితే బాగుంటుంది’ అన్నారు. ట్రంప్ మద్దతుదారులు కూడా ఇవాంక అని అరవడంతో ‘ఇది ప్రజల కోరిక.. నా తప్పు లేదు’ అన్నారు ట్రంప్. రిపబ్లికన్ పార్టీ తరఫున రెండో సారి అధ్యక్ష పదవికి నామినేట్ అయిత తర్వాత నిర్వహించిన తొలి ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ట్రంప్. (చదవండి: చీకటి నుంచి వెలుగులోకి)
అంతేకాక హారిస్ ఎన్నికల ప్రచారాన్ని బలంగానే ప్రారంభించారని.. కాని కొద్ది నెలల్లోనే ఆమె మద్దతుదారులను కోల్పోతుందన్నారు ట్రంప్. అప్పుడు ఆమె అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకుంటుందని తెలిపారు. హారిస్‌కు ఓట్లు రావని విమర్శించారు ట్రంప్. డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కు అధికారాన్ని అప్పగిస్తే అమెరికా కన్న కలలన్నీ సర్వనాశనం అవుతాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికా గొప్పతనాన్ని నాశనం చేయడంతో పాటుగా ప్రజలకెవరికీ ఉద్యోగాలు ఉండవన్నారు ట్రంప్.
Comments
Please login to add a commentAdd a comment