వాషింగ్టన్: మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవికి దూరం కానున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై దాడికి తన చివరి అస్త్రాన్ని ఎక్కుపెట్టారు. చైనా కంపెనీలను అమెరికా ఎక్స్ఛేంజీల నుండి తొలగించే అవకాశం కల్పించే బిల్లుపై ట్రంప్ శుక్రవారం సంతకం చేశారు. తమ దేశంలో అన్యాయమైన వాణిజ్య పద్ధతులు అవలంబిస్తోందంటూ చైనాపై చాలాకాలంగా విరుచుకు పడుతున్న ట్రంప్ బిలియన్ డాలపై దిగుమతులపై తారిఫ్‌లను విధించిన సంగతి తెలిసిందే. తాజాగా చైసాకు మరోసారి షాకిచ్చేలా కీలక ఆదేశాలను జారీ చేశారు. దీంతో ప్రపంచంలోని రెండు దిగ్గజ ఆర్థిక వ్యవస్థలైన అమెరికా-చైనా మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతను మరింత రగిలించనుంది. మరో ట్రేడ్ వార్‌కు తేరలేవనుంది.
అమెరికా స్టాక్ మార్కెట్లో నమోదైన చైనా కంపెనీల ఆడిటింగ్‌కు బీజింగ్ అనుమతించడం లేదని ఇప్పటికే పలుమార్లు విమర్శలు గుప్పించిన ట్రంప్ ఇక కఠిన వైఖరి అవలంబించేందుకు సన్నద్ధమయ్యారు. తాజా ఆదేశాల ప్రకారం అమెరికన్ రెగ్యులేటర్లు చైనా కంపెనీల ఆర్థిక ఆడిట్లను సమీక్షించకపోతే ఆయా కంపెనీలను అమెరికా స్టాక్‌మార్కెట్‌నుంచి తొలగించే అధికారం లభించనుంది. దీంతో అమెరికా ఆంక్షలతో ఇప్పటికే చిక్కుల్లో పడ్డ అలీబాబా గ్రూప్, బైడు ఇంక్ వంటి కార్పొరేట్ దిగ్గజాలకు మరోసారి భారీ షాక్ తగలనుంది. అమెరికా క్యాపిటల్ మార్కెట్ల నుండి దశాబ్దాల తరబడిగా చైనా సంస్థలు లాభాలను ఆర్జిస్తున్నాయని, ఆ ప్రయోజనాలు చైనా ఆర్థిక అభివృద్ధికే ఉపయోగపడుతున్నాయని ట్రంప్ విమర్శించారు. అమెరికా పైనాన్స్ మార్కెట్లో చైనా సంస్థలు నిబందనలకు అనుగుణంగా నమోదు కావడం లేదని, వీటిలో పెట్టుబడులు పెట్టిన అమెరికన్లు నష్టపోతున్నారని ట్రంప్ పేర్కొన్నారు.
కాగా కరోనా వైరస్ విస్తరణపై చైనాపై ఆరోపణలను గుప్పిస్తున్న ట్రంప్ కోవిడ్-19 వైరస్‌ను చైనా వైరస్‌గా మండిపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం కూడా చైనాపై ధ్వజమెత్తారు. కరోనా అంతానికి టీకాలు అందుబాటులోకి వస్తున్నాయంటూ ప్రస్తావించిన ట్రంప్ యూరప్‌తోపాటు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలు చైనా వైరస్ ప్రభావానికి భారీగా ప్రభావితమైనాయి. ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ ,ఇటలీ, మహమ్మారి బారిన పడ్డాయని ఆయన ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment