ఇస్తాంబుల్/ఏథెన్స్: ‘‘అసలు ఇది ముగిసిపోతుందా? పది నిమిషాల పాటు ఇదే ఆలోచన నా మెదడును తొలిచివేసింది. కానీ ఆ తర్వాతే అర్థమైంది. ఇప్పట్లో ముగిసేది కాదు. ఆ సమయంలో నాకు ఏమవుతుందో అన్న బాధ కంటే, నా భార్య, నాలుగేళ్ల నా కుమారుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అన్న భయమే నన్ను వణికించింది. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి భయంకరమైన అనుభవాలు నాకు ఎదురుకాలేదు’’ అంటూ గోఖన్ కన్(32) ఆవేదన వ్యక్తం చేశాడు. టర్కీలో సంభవించిన భూకంపం తన వంటి ఎంతో మంది బాధితులను, వారి కుటుంబాలను చెల్లాచెదురు చేసిందంటూ అంతర్జాతీయ మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నాడు.
ఇక పశ్చిమ ఇజ్మిర్‌లోని ఉర్లాలో నివసించే రిటైర్డ్ బ్రిటీష్ టీచర్ క్రిస్ బెడ్‌ఫోర్డ్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘రాకాసి అలలు ముంచుకువచ్చాయి. నా పిల్లలతో కలిసి బయటకు పరిగెత్తుకు వచ్చాను’’ అంటూ భయానక అనుభవం గురించి చెప్పుకొచ్చారు. కాగా టర్కీ పశ్చిమ తీరం, గ్రీస్ ద్వీపం సామోస్‌ల మధ్య ఏజియన్ సముద్రంలో సంభవించిన భారీ భూకంపం ధాటికి రెండు దేశాల్లోని తీర ప్రాంత నగరాలు, పట్టణాల్లో భారీ విధ్వంసం సంభవించింది. ఈ నేపథ్యంలో పశ్చిమ టర్కీలోని ఇజ్మిర్ పట్టణంలోని భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రజల హాహాకారాలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. భవన శిథిలాల కింద చిక్కుకుపోయిన బాధితులను కాపాడేందుకు రక్షణ బృందాలు రంగంలోకి దిగాయి.(చదవండి: టర్కీ, గ్రీస్‌ల్లో భారీ భూకంపం)
కఠిన సమయాల్లో కలిసే ఉంటాం: గ్రీస్, టర్కీ
భారీ విపత్తు సంభవించిన నేపథ్యంలో దౌత్యపరంగా శత్రుదేశాలుగా ఉన్న టర్కీ, గ్రీస్ పరస్పరం సంఘీభావం ప్రకటించుకోవడం గమనార్హం. ‘‘టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగన్‌కు ఫోన్ చేశాను. భూకంపం కారణంగా మా రెండు దేశాల్లో సంభవించిన విషాదం గురించి మాట్లాడాను. మనలో మనకు ఎన్ని విభేదాలు ఉన్నా, ఇలాంటి విపత్కర సమయాల్లో ప్రజలంతా ఐకమత్యంగా నిలవాల్సిన ఆవశ్యకత ఉంది’’అని గ్రీక్ ప్రధాని కిరియాకోస్ మిసోటకిస్ ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు.
ఇందుకు బదులిచ్చిన టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయీప్ ఎర్డోగన్..‘‘థాంక్యూ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్. గ్రీస్ ప్రజలకు, బాధితులకు మా దేశం తరఫున సానుభూతి తెలుపుతున్నా. గ్రీస్ గాయాలు మానేందుకు అవసరమైన సాయం చేసేందుకు టర్కీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. విపత్కర సమయాల్లో ఇరుగుపొరుగు దేశాలు పరస్పరం సహకరించుకోవడమే మన జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం’’అని స్నేహహస్తం అందించారు.
వాళ్లకు ఇక్కడ కూడా అదే దుస్థితి ఎదురైంది
గ్రీస్ ద్వీపం సామోస్ కేంద్రంగా పనిచేసే వుమెన్ సెంటర్ కో- ఆర్డినేటర్ జూడ్ విగిన్స్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘అప్పుడు.. నేను కిచెన్‌లో ఉన్నా. వాషింగ్ మెషీన్ శబ్దం అనుకుని అలాగే ఉండిపోయా. కానీ వస్తువులన్నీ చెల్లాచెదురై పోవడం ఆరంభమైంది. మేము ఉన్న భవనం కంపించడం మొదలుపెట్టగానే విషయం అర్థమైంది. వెంటనే, బయటకు పరుగులు తీశాం. సిరియా వంటి దేశాల నుంచి వచ్చిన చాలా మంది మహిళా బాధితులకు ఇలాంటి అనుభవాలు ఎన్నోసార్లు ఎదురయ్యాయి.
వారి సొంత దేశంలో అన్నీ కోల్పోయి ఇక్కడకు చేరుకున్నారు. కానీ ఇక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. వాళ్లు మరోసారి అన్నీ కోల్పోయారు. క్యాంపులోని టెంట్లు కూలిపోయాయి. అందరం బయటకు పరుగెత్తాం. అప్పటికే రోడ్లు మొత్తం ప్రజలతో నిండిపోయాయి. సునామీ ముంచుకొస్తుందని చాలా భయపడ్డాం. భవిష్యత్ ప్రణాళికపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’అని చెప్పుకొచ్చారు.
Thank you, Mr. Prime Minister.
— Recep Tayyip Erdoğan (@RTErdogan) October 30, 2020
I offer my condolences to all of Greece on behalf of myself and the Turkish people. Turkey, too, is always ready to help Greece heal its wounds.
That two neighbors show solidarity in difficult times is more valuable than many things in life. https://t.co/eo6iClofKZ
Comments
Please login to add a commentAdd a comment