డొనాల్డ్ ట్రంప్ (దిగిపోతున్న అమెరికా అధ్యక్షుడు), రెనీ గ్రేసీ(ఆస్ట్రేలియన్ మాజీ రేసర్, ప్రస్తుతం అడల్ట్‌స్టార్)
రెనీ గ్రేసీ ఆస్ట్రేలియన్ కార్ రేసర్. 2019లో ఆమె రేస్‌ను వదిలిపెట్టి ‘ఓన్లీ ఫ్యాన్స్’ అనే వెబ్‌సైట్ పెట్టుకుని పోర్న్‌స్టార్‌గా మారిపోయారు. 26 ఏళ్ల అమ్మాయి కోరుకున్నవేమీ రేస్ డ్రైవింగ్ గ్రేసీకి ఇవ్వలేకపోయింది. అందుకే లోకానికి ఒక ముక్క ముందే చెప్పి, ‘ఇక్కడ గిట్టుబాటు కావడం లేదు. పోర్న్ ప్రొఫెషన్‌లోకి షిఫ్ట్ అవుతున్నాను’ అని ట్వీట్ చేశారు గ్రేసీ. ట్రాక్ మార్చుకున్నాక ఆమె కోరుకున్న జీవితం ఆమెకు లభ్యమైంది. ‘ఓన్లీ ఫ్యాన్స్’ సైట్ ఆమెకు చేతినిండా డబ్బు ఇస్తోంది. ట్విట్టర్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫాలోవర్స్ పెరిగారు. ఈ సమయంలో ట్విట్టర్ (ఇన్‌స్టాగ్రామ్ కూడా) ఆమె అకౌంట్‌ను సడన్‌గా బ్యాన్ చేసింది. చేస్తున్నట్లు చెప్పలేదు, చేసినట్లు చెప్పలేదు. చేయబోతున్నట్టూ చెప్పలేదు. ఎందుకు చేసిందీ చెప్పలేదు. గురువారం తెల్లవారుజామున గ్రేసీ నిద్ర లేచి ట్విట్టర్‌ను లాగిన్ చేయగానే ఓపెన్ కాలేదు! ట్రంప్‌ని నిషేధించిన తర్వాత ట్విట్టర్ చేసిన రెండో బ్యాన్ రెనీ గ్రేసీదే.
సోషల్ మీడియాలో ‘ట్విట్టర్’ శక్తిమంతమైన వేదిక. దేశాధినేతలు పౌరులతో, పౌరులు నేరుగా దేశాధినేలతో ‘కమ్యూనికేట్’ అవగల అతి చిన్న వాక్యాల అతి పెద్ద ప్లాట్‌ఫార్మ్. జనవరి 6న అమెరికా పాలనాభవనం ‘క్యాపిటల్ హిల్’లో అరాచకం మొదలవగానే, ట్రంప్ ట్వీట్లే అందుకు ప్రేరేపించాయని భావించిన ట్విట్టర్ ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆయన ట్విట్టర్ అకౌంట్‌ని తొలగించింది! అయితే ట్రంప్‌ని ఎందుకు బ్యాన్ చేసిందీ చెప్పిన ట్విట్టర్ రెనీ గ్రేసీని ఎందుకు నిషేధించిందీ చెప్పలేదు. ‘‘కారణం ఏంటో నాకు తెలీదు. ట్విట్టర్ నన్ను బ్యాన్ చేసిందని తెలియగానే మా డాడీకి చెప్పాను. ఆయన పెద్దగా నవ్వి ‘అయితే ట్విట్టర్ నిన్ను డొనాల్డ్ ట్రంప్‌ని చేసిందన్నమాట!’ అన్నారు’’.. అని రెనీ ‘ది డైలీ టెలిగ్రాఫ్’ పత్రికా ప్రతినిధికి తెలిపారు. ఇకనుంచీ ఆమె ఏమి చెప్పాలనుకున్నా వేరే ప్లాట్‌ఫారమ్‌లలోకి వెళ్లాల్సిందే. అభిమానులతో మాటలు కలబోసుకోవాలన్నా అంతే. ట్విట్టర్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్ కూడా ఆమె చాప్టర్‌ను క్లోజ్ చేసేసింది. కారణం చెప్పకపోయినా, రెనీ గ్రేసీని ట్విట్టర్‌ను తొలగించింది మాత్రం ఆమె పోర్న్‌స్టార్ అవడం వల్లనే. వేరే కారణం ఏమైనా ఉంటే నేడు, రేపట్లో ట్విట్టర్ వెల్లడించవచ్చు.
ట్విట్టర్ ఏకపక్షంగా సుప్రసిద్ధుల అకౌంట్‌లను నిషేధించడం సరికాదు అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ట్రంప్‌ని వ్యతిరేకిస్తుండే సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ సైతం ట్రంప్ అకౌంట్‌ని మూసివేయడంపై ట్విట్టర్‌ను తప్పుపట్టారు. ఈ తప్పొప్పులు, ట్విట్టర్ పాలసీలు ఎలా ఉన్నా గతంలోనే ట్విట్టర్ కొందరు ప్రముఖులపై బ్యాన్ విధించింది. వారిలో కొందరి వివరాలు.. వారిని తొలగించడానికి ట్విట్టర్ చెప్పిన కారణాలు తెలుసుకోవడం, తెలిసి ఉండటం.. ట్విటిజెన్‌లకు తప్పక ఉపకరిస్తుంది.
అభిజీత్ భట్టాచార్య (62), బాలీవుడ్ నేపథ్య గాయకుడు
మహిళలపై ద్వేషంతో పురుషాహంకార కామెంట్స్ పోస్ట్ చేశాడని అభిజీత్‌ను ట్విట్టర్ బ్యాన్ చేసింది. అందుకు ఆగ్రహించిన అభిజీత్.. ‘ట్విట్టర్ యాంటీ–నేషనల్, యాంటీ–హిందూ వేదిక’ అని విమర్శించారు.
మార్టిన్ ష్రేలీ (37), అమెరికన్ ఎగ్జిక్యూటివ్
ఈయనకు ‘ఫార్మా బ్రో’ అని పేరు. గతంలో ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ సీఈవోగా చేశారు. ‘టీన్ వోగ్’ పత్రిక మహిళా ఎడిటర్ లారెన్ డ్యూకా ఫొటోలను అమర్యాదకరమైన రీతిలో కొలాజ్ చేసి పోస్ట్ పెట్టినందుకు ట్విట్టర్ అతడిని బ్యాన్ చేసింది.
కర్టిస్ జాక్సన్ (45), అమెరికన్ ర్యాపర్
ఈయన ‘50 సెంట్స్’ అనే మారు పేరుతో కూడా ప్రసిద్ధుడు. ఒక ఎక్స్ రేటెడ్ (అశ్లీల) ఫొటోను పోస్ట్ చేయడంతో ట్విట్టర్ ఇతడిని గెంటేసింది. జాక్సన్ ఊరుకోలేదు. ‘నువ్వెంత, నీ ఇమేజెంత పో..’ అని ట్విట్టర్‌పై తిరుగుదాడి చేశాడు. తర్వాత అపాలజీ చెప్పాడు. అకౌంట్‌ని రీయాక్టివేట్ చేయించుకున్నాడు.
కోర్ట్నీ లవ్ (56), అమెరికన్ గాయని
ఒక కేసు విషయంలో కోర్ట్నీ తన ప్రత్యర్థిపై ‘తగని కామెంట్స్’ చేసినందుకు ట్విట్టర్ ఆమెను బ్యాన్ చేసింది. లేడీ డిజైనర్ డాన్ సిమోర్యాంగ్కిర్ ఆమె ప్రత్యర్థి. డాన్ మత్తుకు బానిస అని, దొంగ అని, వ్యభిచారి అని, ఆమెకు నమ్మకద్రోహం చేసిన చరిత్ర ఉందని ట్వీట్ చేయడంతో కోర్ట్నీ నిషేధానికి గురయ్యారు. ఎవరి మీద కోపం వచ్చినా, ఆఖరి తన లాయర్ మీద కూడా ట్విట్టర్‌లోనే ఆమె తన ఆగ్రహాన్ని ప్రదర్శించేవారు. చూసి చూసి ట్విట్టర్ ఆమె అకౌంట్‌ను మూసేసింది.
ప్యూడీపీ (31) స్వీడిష్ యూట్యూబర్
ఇతడి అసలు పేరు ఫెలిక్స్‌తో మొదలౌతుంది. పేరుకు జోడింపులు ఇంకా ఏవో ఉన్నాయి. ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రస్తావన తేవడంతో ట్విట్టర్ అతడిని పక్కన పెట్టేసింది. ‘‘నేను, జాక్ సెప్టిక్ ఐ (ఐరిష్ యూట్యూబర్) ఐసిస్‌లో చేరాం’’ అని ట్వీట్ చేశాడు ప్యూడీపీ. ఆ ట్వీట్ చూసి యూత్ ఇన్‌స్పైర్ అయి ఐసిస్‌లో చేరకుండా ఉండేందుకే ట్విట్టర్ అతడికి ‘బయటికి వెళ్లు దారి’ చూపించింది.
రోస్ మెక్‌గోవన్ (47), హాలీవుడ్ నటి
హాలీవుడ్ నిర్మాత హార్వీ వైన్‌స్టీన్‌కు వ్యతిరేకంగా రోస్ మెక్‌గోవన్ ‘మీటూ’ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. ‘ఆయన అలాంటి వాడు కాదు’ అని కితాబు ఇచ్చిన తోటి హాలీవుడ్ నటీమణులపై ట్విట్టర్‌లో ఆమె విమర్శలు గుప్పించారు. అవి శృతిమించి ఆమె అకౌంట్‌ను తొలగించిన ట్విట్టర్.. రోస్ ఒక ప్రైవేట్ నెంబరును తన ట్వీట్‌లో ఇవ్వడంతో ఆమెను బ్యాన్ చేయవలసి వచ్చిందని ఆ తర్వాత వివరణ ఇచ్చింది.
బ్యాంక్స్ (32), అమెరికన్ గాయని
‘వన్ డైరెక్షన్’ పాప్ బ్యాండ్ సింగర్ జేన్ మాలిక్‌పై తన కామెంట్స్‌తో జాత్యహంకార విద్వేషాన్ని చిమ్మినందుకు, అతడు ‘గే’ అని అవమానిస్తూ పోస్ట్‌లు పెట్టినందుకు బ్యాంక్స్‌ని ట్విట్టర్ నిషేదించింది. బ్యాంక్స్‌కి చాలాముందు నుంచే సైబర్‌బుల్లీయింగ్ చేస్తుంటుందన్న పేరు ఉంది. జేన్ కంటే ముందు అనేకమంది ప్రముఖుల్ని తీసిపారేస్తూ బ్యాంక్స్ ట్వీట్‌లు పెట్టింది. వేరే పేరుతో మళ్లీ ట్విట్టర్‌లోకి అడుగుపెట్టబోయింది కానీ ట్విట్టర్ ఆమె అడుగును పడనివ్వలేదు.
కమాల్ ఆర్. ఖాన్ (46) బాలీవుడ్ నటుడు
వివాదాస్పద ట్వీట్‌లు చేయడం ఈయన అలవాటు. 2017లో అద్వైత్ చందన్ దర్శకత్వంలో వచ్చిన ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ చిత్రం క్లయిమాక్స్ ఏమిటో చిత్రం విడుదలకు ముందే కమాల్ ట్వీట్ చేశారు. అందుకు కోపగించిన ఆ చిత్ర నటుడు ఆమీర్‌ఖాన్‌పైన కూడా అభ్యంతరకరమైన వ్యక్తిగత విమర్శలు చేశారు. వాదోపవాదలు జరిగాయి. ఆ క్రమంలో.. తను ఆత్మహత్య చేసుకుంటే అందుకు ట్విట్టరే బాధ్యత వహించవలసి ఉంటుందని కమాల్ బెదరించడంతో ట్విట్టర్ అతడి అకౌంట్‌ను తొలగించింది.
అడేల్ (32), బ్రిటిష్ గాయని
అడేల్‌ను ట్విట్టర్ బ్యాన్ చెయ్యలేదు. అడేల్ ట్విట్టర్ టీమే ఆమె అకౌంట్‌ను క్లోజ్ చేసింది. అడేల్ తరచు మద్యం సేవించి ట్వీట్‌లు పెట్టడంతో ఆమెకు తలనొప్పులు మొదలయ్యేవి. వాటిని తప్పించడానికి సొంత టీమే ట్విట్టర్ నుంచి ఆమెను బయపడేసింది. ఇంకో విధంగా చెప్పాలంటే అడేల్ బారి నుంచి ట్విట్టర్‌నే బయటపడేసింది.
Comments
Please login to add a commentAdd a comment