అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను తిరిగి పునరుద్ధరిస్తామని ఆ సంస్థ కొత్త సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఓ పోల్ కూడా నిర్వహించగా.. నెటిజన్లు మస్క్‌కే జైకొట్టారు. దీంతో ట్రంప్ ఖాతాను ట్విట్టర్ ఆదివారం పునరుద్ధరించింది.
అయితే డొనాల్డ్ ట్రంప్ మాత్రం మస్క్‌కు షాక్ ఇచ్చారు. ఈ పోల్ ముగియడానికి కొన్ని గంటల ముందే తనకు ట్విట్టర్‌లోకి తిరిగి రావాలని లేదని శనివారం వెల్లడించారు. ట్విట్టర్ ఖాతాను మళ్లీ ఉపయోగించడానికి తనకు ఎలాంటి కారణం కన్పించడం లేదని పేర్కొన్నారు.
తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫాం 'ట్రుత్ సోషల్' చాలా అద్భుతంగా ఉందని, ట్విట్టర్ కంటే ఎక్కువ ఫీచర్స్ అందులో ఉన్నాయని ట్రంప్ చెప్పుకొచ్చారు. ట్విట్టర్లో బాట్, నకిలీ ఖాతాలు వంటి చాలా సమస్యలు ఉన్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రుత్ సోషల్‌లో అలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. ట్రుత్ సోషల్‌ను ట్రంప్‌కు చెందిన ఐటీ కంపెనీనే అభివృద్ధి చేసింది.
ట్రంప్ ఖాతా పునరుద్ధరించాలా? వద్దా? అని ఎలాన్ మస్క్ ట్విట్టర్‌లో పోల్ నిర్వహించగా.. 15 మిలియన్ల మంది పాల్గొన్నారు. ఇందులో 51.8 శాతం మంది ట్రంప్ ఖాతాను తిరిగి తీసుకురావాలన్నారు. దీంతో ఆదివారం నుంచి ట్రంప్ ఖాతా రీ యాక్టివేట్ అయింది.
హింసను ప్రేరేపించారనే కారణంతో 2021 జనవరి 8న ట్రంప్ ఖాతాను ట్విట్టర్ బ్యాన్ చేసింది. ఆ సమయంలో ఆయనకు 88 మిలియనట్ల ఫాలోవర్లు ఉన్నారు. ఆ తర్వాత ఖాతా నిషేధం కావడంతో ఫాలోవర్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం 29 మంది మిలియన్ల ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. అయితే మళ్లీ ఫాలోవర్ల సంఖ్య పెరుగుతోంది.
చదవండి: 140 ఏళ్ల తర్వాత కన్పించిన అరుదైన పక్షి.. ఫొటో వైరల్..
Comments
Please login to add a commentAdd a comment