ఐక్యరాజ్యసమితి: మహమ్మారి కోవిడ్ కారణంగా, 2021లో దక్షిణాసియాలో మహిళల పేదరికం మరింత పెరగనున్నట్టు ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రానున్న దశాబ్దంలో 25 –34 ఏళ్ల వయస్సుల వారిలో పురుషుల కంటే అధికంగా స్త్రీలే పేదరికం బారిన పడతారని ఆ సంస్థ వెల్లడించింది. గత దశాబ్దాలలో మహిళలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి చేసిన కృషి, ఇప్పటి వరకు జరిగిన మహిళల అభివృద్ధి కోవిడ్ మహమ్మారి కారణంగా, తిరోగమనంవైపు మళ్లుతోందని తెలిపింది. ఫలితంగా 2021 నాటికి 4 కోట్ల 70 లక్షల మంది అదనంగా పేదరికం బారిన పడనున్నారని యుఎన్ వుమెన్, యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం సంస్థలు వెల్లడించాయి. (చదవండి: కరోనా వల్ల మహిళలకే ఎక్కువ రిస్క్: యూఎన్)
కోవిడ్ కారణంగా దక్షిణాసియాలో స్త్రీ-పురుష అంతరాలు తీవ్రంగా పెరిగిపోయి, మహిళలు మరింత పేదరికంలోకి కూరుకుపోనున్నారని ‘‘ఫ్రం ఇన్‌సైట్స్ టు యాక్షన్.. జెండర్ ఈక్వాలిటీ ఇన్ ది వేక్ ఆఫ్ కోవిడ్–19’’ పేరుతో విడుదల చేసిన రిపోర్టులో పేర్కొన్నాయి. కోవిడ్‌కి ముందు దక్షిణాసియాలో మహిళల పేదరికం రేటు 2021లో 10 శాతంగా అంచనావేయగా, ప్రస్తుతం అది 13 శాతంగా మారనుంది. 2021లో యావత్ ప్రపంచంలో, ప్రతి వంద మంది పేద పురుషులకు 118 మంది స్త్రీలు దారిద్య్రంలో ఉంటారని రిపోర్టు తెలిపింది. (చదవండి: ఆ ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేం)
ఈ అంతరం 2030 నాటికి ప్రతి వంద మంది పురుషులకు 121 మంది స్త్రీల నిష్పత్తికి చేరనున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ మహమ్మారి 2021 నాటికి 9.6 కోట్ల మందిని దుర్బర దారిద్య్రంలోకి నెడుతుండగా, అందులో 4.7 కోట్ల మంది స్త్రీలు, బాలికలే ఉంటారని ఈ రిపోర్టులో స్పష్టం అయ్యింది. మన సమాజం, ఆర్థిక వ్యవస్థల నిర్మాణంలో ఉన్న తప్పుడు విధానాల వల్ల ఈ అంతరాలు పెరుగుతున్నట్టు యుఎన్ వుమెన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫుంజిలే లాంబో నెకూకా తెలిపారు. మధ్య, దక్షిణ ఆసియా, సహారా ఆఫ్రికా ప్రాంతాల్లో ప్రపంచంలోనే అత్యధికంగా 87 శాతం పేదరికం ఉండగా, ఇప్పుడు అదనంగా మధ్య ఆసియాలో 5.4 కోట్లు, దక్షిణాసియాలో 2.4 కోట్ల మంది ప్రజలు అంతర్జాతీయ దారిద్య్ర రేఖ దిగువకు పడిపోనున్నట్లు ఆ రిపోర్టు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment