
వాషింగ్టన్: ఇటీవల నౌక ఢీకొని కుప్పకూలిన అమెరికాలోని బాల్టిమోర్ వంతెన నిర్మాణం కోసం ఫెడరల్ ప్రభుత్వం ప్రాథమికంగా 60 మిలియన్ డాలర్ల(రూ.480 కోట్లు) అత్యవసర నిధులను కేటాయించింది. ఈ మేరకు మేరీ లాండ్ గవర్నర్ వెస్‌మూర్ కోరిన వెంటనే ఈ నిధులను దేశ రవాణా, హైవే మంత్రిత్వ శాఖ రాష్ట్రానికి మంజూరు చేసింది. ఈ నిధులతో వంతెన శిథిలాలను నదిలో నుంచి తొలగించడంతో పాటు కూలిన భాగాన్ని మళ్లీ నిర్మించనున్నారు.
కీలకమైన బాల్టిమోర్ వంతెనను వీలైనంత త్వరగా మళ్లీ నిర్మించేందుకు అవసరమైతే భూమిని ఆకాశాన్ని ఒకటి చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలిచ్చినట్లు అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే మీడియాకు తెలిపారు. కాగా, మంగళవారం(మార్చ్ 29)న అర్ధరాత్రి ఒంటిగంటకు పటాప్కో నదిపై ఉన్న ఫ్రాన్సిన్ స్కాట్‌కీ బ్రిడ్జి భారీ కంటెయినర్ నౌక ఢీకొని కుప్పుకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బ్రిడ్జిపై పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు నదిలో పడిపోగా వారిలో ఇద్దరి మృతదేహాలు దొరికాయి. మరో నలుగురు ఆజూకీ ఇంకా తెలియలేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment