US Independence Day 2022: History Of 4th July And Interesting Unknown Facts In Telugu - Sakshi
Sakshi News home page

US Independence Day History And Facts: ఒకప్పుడు బ్రిటిష్‌ పాలనలో అమెరికా.. ఈ విషయాలు తెలుసా?

Published Mon, Jul 4 2022 2:09 PM | Last Updated on Mon, Jul 4 2022 3:50 PM

US Independence Day: You Need To Know About 4th July Interesting Facts - Sakshi

జూలై 4.. ‘బర్త్‌ ఆఫ్‌ అమెరికన్‌ ఇండిపెండెన్స్‌’డే

జూలై 4.. ‘బర్త్‌ ఆఫ్‌ అమెరికన్‌ ఇండిపెండెన్స్‌’డే.. ఈరోజు ‘అగ్రరాజ్యం’ 246వ స్వాతంత్య్ర దినోత్సవం... ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో ‘పెద్దన్న’ పాత్ర పోషిస్తున్న అమెరికా కూడా ఒకప్పుడు ‘బానిస’గానే బతికిందని మీకు తెలుసా? బ్రిటిష్‌ పాలన నుంచి స్వతంత్ర దేశంగా అవతరించే క్రమంలో జరిగిన పరిణామాలు.. అందుకు దారి తీసిన పరిస్థితుల గురించి కొన్ని ఆసక్తికర అంశాలు..

246 ఏళ్ల క్రితం..
రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరొందిన బ్రిటీష్‌ పోకడలను వ్యతిరేకిస్తూ 13 కాలనీల్లోని అమెరికన్లంతా ఒక్కటయ్యారు. శిస్తులు విపరీతంగా పెంచడం, పంచదార, కాఫీ, టీ తదితర ఉత్పత్తులపై దిగుమతి సుంకం పెంచడం.. కాలనిస్టుల అభిప్రాయం కోరకుండానే కాలనీల్లో సైన్యాన్ని మోహరించడం, ప్రజలపై కాల్పులకు తెగబడటం సహా కాలనిస్టులకు పార్లమెంటులో సముచిత స్థానం కల్పించకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో.. 1760-1770 మధ్య అమెరికన్ కాలనీలు, బ్రిటిష్ పాలకుల మధ్య తలెత్తిన సంఘర్షణ చివరకు అమెరికన్ విప్లవానికి తెరతీసింది.

ఈ క్రమంలో గ్రేట్‌ బ్రిటన్‌ నుంచి పూర్తిగా విముక్తి పొందితేనే బానిసత్వం తొలగిపోతుందటూ 1775 ఏప్రిల్‌లో కాలనిస్టులు ప్రజల్లో స్వతంత్ర కాంక్ష రగిల్చారు. ఇందులో భాగంగా 1776లో రాజకీయవేత్త థామస్‌ పేన్ ‌‘కామన్‌ సెన్స్‌’ పేరిట ప్రచురించిన కరపత్రాలతో ప్రజలను చైతన్యవంతులను చేశారు.

ఈ నేపథ్యంలో కాంటినెంటల్ కాంగ్రెస్ (బ్రిటిష్ అమెరికన్ కాలనీల ప్రతినిధులు) అదే ఏడాది జూన్‌ 7న ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా స్టేట్‌ హౌజ్‌(ఈ తర్వాత ఇండిపెండెన్స్‌ హాల్‌గా గుర్తింపు పొందింది)లో నిర్వహించిన సమావేశంలో.. వర్జీనియా ప్రతినిధి రిచర్డ్‌ హెన్రీ లీ కాలనీల స్వాతంత్ర్యం కోసం తీర్మానం ప్రవేశపెట్టారు. 

వాడి వేడి చర్చల అనంతరం లీ తీర్మానంపై ఓటింగ్‌ వాయిదా వేసిన కాంటినెంటల్‌ కాంగ్రెస్‌.. థామస్‌ జెఫర్‌సన్‌(వర్జీనియా), జాన్‌ ఆడమ్స్‌(మసాచుసెట్స్‌), రోజర్‌ షెర్మన్‌(కనెక్టికట్‌), బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌(పెన్సిల్వేనియా), రాబర్ట్‌ ఆర్‌ లివింగ్‌స్టన్‌(న్యూయార్క్‌) తదితర ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. గ్రేట్‌ బ్రిటన్‌ పెత్తనాన్ని కాలనీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో తెలుపుతూ, స్వరాజ్య కాంక్షను సమర్థిస్తూ అధికారిక ప్రకటన చేసేందుకు వీలుగా ముసాయిదా రూపొందించాలని పేర్కొంది.

డిక్లరేషన్‌ ఆఫ్‌ ఇండిపెండెన్స్‌..
అనేక పరిణామాల అనంతరం జూలై 2న లీ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన కాంటినెంటల్‌ కాంగ్రెస్‌.. బ్రిటీష్‌ సింహాసనాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఆ తర్వాత రెండు రోజుల అనంతరం అంటే జూలై 4న డిక్లరేషన్‌ ఆఫ్‌ ఇండిపెండెన్స్‌ పేరిట స్వాతంత్య్రం ప్రకటించుకుంది. ‘ఆల్‌ మెన్‌ ఆర్‌ ఈక్వల్‌ క్రియేటెడ్(మనుషులంతా సమానంగా సృష్టించబడ్డారు- అందరికీ సమాన హక్కులు అనే ఉద్దేశంతో)’ అంటూ థామస్‌ జెఫర్‌సన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. 

అదే విధంగా.. ‘‘ఇప్పటి నుంచి మన ముందు తరాలు ఓ గొప్ప పండుగను ప్రతి ఏటా జరుపుకొంటాయి. సంబరాలు చేసుకుంటాయి. పరేడ్‌లు, ఆటలు, గంటల మోత, టపాసుల కాంతులు ఖండమంతటా విస్తరిస్తాయి’’అంటూ మసాచుసెట్స్‌ ప్రతినిధి జాన్‌ ఆడమ్స్‌ తన భార్యకు రాసిన లేఖలో స్వాతంత్ర్యం ఖరారైందనే శుభవార్త పంచుకున్నారు. 

ఇలా ఓ వైపు బ్రిటీష్‌ బలగాలతో కాంటినెంటల్‌ ఆర్మీ యుద్ధం కొనసాగుతుండగానే మరోవైపు స్వాతంత్ర్య ప్రకటన వెలువడింది. ఈ క్రమంలో 1778లో ఫ్రాన్స్‌ అమెరికా కాలనీల తరఫున రంగంలోకి దిగడంతో.. ఎట్టకేలకు 1781లో వర్జీనియాలోని యార్క్‌టౌన్‌లో కొన్ని బ్రిటీష్‌ సేనలు లొంగిపోయాయి. అయితే 1783 ముగిసేనాటికి కూడా ఈ యుద్ధం ముగిసిపోలేదు. మరలా అనేక యుద్ధాలు, పరిణామాల అనంతరం 1941లో జూలై 4ను అమెరికా కాంగ్రెస్‌ ఫెడరల్‌ హాలిడేగా ప్రకటించింది. 

కాగా జార్జ్‌ వాషింగ్టన్‌, జాన్‌ ఆడమ్స్‌, థామప్‌ జెఫర్‌సన్‌, జేమ్స్‌ మాడిసన్‌, జేమ్స్‌ మన్నో, జాన్‌ క్విన్సీ ఆడమ్స్‌, ఆండ్రూ జాక్‌సన్‌, మార్టిన్‌ వాన్‌ బ్యూరెన్‌, విలియం హెన్రీ హారిసన్‌, జాన్‌ టైలర్‌ తదితరులు అమెరికా స్వాతంత్ర్య పోరాట యోధుల్లో ముఖ్యులుగా చరిత్రకెక్కారు. జార్జ్‌ వాషింగ్టన్‌ 1789-97 వరకు అమెరికా ప్రథమ అధ్యక్షుడిగా సేవలు అందించారు. ఇక 246 ఏళ్ల చరిత్రలో అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తొలి మహిళగా భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ చరిత్ర సృష్టించిన విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

13 కాలనీలు
1. ప్రావిన్స్‌ ఆఫ్‌ మసాచుసెట్స్‌ బే
2. ప్రావిన్స్‌ ఆఫ్‌ హాంప్‌షైర్‌
3. కనెక్టికట్‌ కాలనీ
4.కాలనీ ఆఫ్‌ రోడే ఐలాండ్‌
5.డెలావేర్‌ కాలనీ
6.ప్రావిన్స్‌ ఆఫ్‌ న్యూయార్క్‌
7.ప్రావిన్స్‌ ఆఫ్‌ న్యూజెర్సీ
8. ప్రావిన్స్‌ ఆఫ్‌ పెన్సిల్వేనియా
9. కాలనీ అండ్‌ డొమీనియన్‌ ఆఫ్‌ వర్జీనియా
10. ప్రావిన్స్‌ ఆఫ్‌ మేరీలాండ్‌
11. ప్రావిన్స్‌ ఆఫ్‌ నార్త్‌ కరోలినా
12. ప్రావిన్స్‌ ఆఫ్‌ సౌత్‌ కరోలినా
13. ప్రావిన్స్‌ ఆఫ్‌ జార్జియా

చదవండి: కోటీశ్వరుల వలస.. మళ్లీ మొదలైంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement