అమెరికాకు ఆయన అత్యవసరం
ట్రంప్ గెలిస్తేనే దేశానికి భవిష్యత్తు
రిపబ్లికన్ల ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్
బైడెన్ స్వార్థ నాయకుడంటూ నిప్పులు
మిల్వాకీ: అమెరికా శ్రామిక వర్గం అభ్యున్నతి కోసం చివరి శ్వాస దాకా పాటుపడతానని రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి, ఒహాయో సెనేటర్ జె.డి.వాన్స్ (39) అన్నారు. వారిని అధికార డెమొక్రటిక్ పార్టీ పూర్తిగా విస్మరించిందంటూ మండిపడ్డారు. మిల్వాకీలో జరుగుతున్న రిపబ్లికన్ల నేషనల్ కన్వెన్షన్‌లో వాన్స్‌ను ఉపాధ్యక్ష అభ్యరి్థగా బుధవారం లాంఛనంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాదాసీదా, నిరుపేద మూలాలున్న తాను ఇంత దూరం వస్తానని కల్లో కూడా ఊహించలేదని చెప్పారు. ‘‘జీవితంలో ఒక్క మెట్టూ ఎదుగుతూ వచ్చా. ఒకరకంగా సగటు అమెరికన్ కలగనే జీవితాన్ని ప్రస్తుతం జీవిస్తున్నా. వారంతా భద్రమైన, సురక్షితమైన జీవితం గడిపేలా చేస్తా. ఏ పారీ్టవారన్న దానితో నిమిత్తం లేకుండా ప్రతి అమెరికన్‌కూ నా సర్వస్వం ధారపోస్తా. అమెరికా ఎన్నడూ మరిచిపోలేని ఉపాధ్యక్షుడిగా పేరు తెచ్చుకుంటా’’ అంటూ ప్రతిజ్ఞ చేశారు.
ట్రంప్‌పై ప్రశంసల వర్షం
రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై వాన్స్ ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా మధ్యతరగతికి, శ్రామిక వర్గానికి ప్రస్తుతం ఆయనే ఏకైక ఆశాకిరణమన్నారు. ‘‘ట్రంప్ రాజకీయాల్లోకి రాకముందే ప్రపంచంలోకెల్లా అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరు. ఎవరైనా జీవితంలో కలలుగనేవన్నీ ఆయనకు అందుబాటులో ఉన్నాయి. అయినా అమెరికన్లకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని తపించారు. అందుకోసం తిట్లను, వేధింపులను, మరెన్నింటినో సహిస్తున్నారు.
నిజానికి ట్రంప్‌కు ఆయనకు రాజకీయాలు అవసరం లేదు. అమెరికా ప్రజలకే ఇప్పుడు ట్రంప్ అత్యవసరం’’ అని చెప్పుకొచ్చారు. అధ్యక్షుడు జో బైడెన్ రాజకీయాలను కేవలం కెరీర్‌గా మలచుకున్న స్వార్థపరుడంటూ వాన్స్ దుయ్యబట్టారు. బైడెన్ మతిలేని వాణిజ్య ఒప్పందాలు, విదేశీ యుద్ధాలకు అర్థం లేని మద్దతు తన స్వస్థలం ఒహాయో వంటి నిరుపేద అమెరికా ప్రాంతాలను సర్వనాశనం చేశాయంటూ మండిపడ్డారు.
పాలక వర్గ ప్రతినిధిగా బైడెన్ ప్రతి చర్యా అమెరికన్ల ఉద్యోగాలను విదేశాలపరం చేసింది. మన యువతను యుద్ధక్షేత్రాలకు బలిచి్చంది. ఇరాక్ నుంచి అఫ్గానిస్తాన్ దాకా, ఆర్థిక సంక్షోభం నుంచి మాంద్యం, అక్రమ వలసల దాకా ప్రస్తుత పాలక వర్గం అన్ని రంగాల్లోనూ పదేపదే విఫలమవుతూ వస్తోంది. ఈ సమస్యలన్నింటి నుంచి అమెరికాను గట్టెక్కించే చిట్టచివరి, అత్యుత్తమ ఆశాకిరణం ట్రంప్ మాత్రమే. సగటు అమెరికన్‌కు అగ్రతాంబూలమే ఆయన విజన్. ఆయనను పోగొట్టుకుంటే మనకిక భవిష్యత్తుండదు’’ అన్నారు. ‘‘దేశానికి తొలి ప్రాధాన్యమిచ్చే ట్రంప్‌నే అమెరికన్లు గెలిపించుకోబోతున్నారు’’ అని వాన్స్ జోస్యం చెప్పారు.
దక్షిణాసియా వలసదారులపై వాన్స్ ప్రశంసలు
దక్షిణాసియా నుంచి వచ్చినవారు అమెరికాను సుసంపన్నం చేశా రని వాన్స్ అన్నారు. భార్య ఉషా చిలుకూరిపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘దక్షిణాసియా నుంచి వలస వచి్చనవారి కుమార్తెను నేను పెళ్లాడాను. ఆమెకు పెళ్లి ప్రస్తావన చేసినప్పుడు లా స్కూల్ చదువు కోసం, ప్లాట్ కొనుగోలుకు చేసిన 1.2 లక్షల డాలర్ల అప్పులు నా నెత్తిన ఉన్నాయని చెప్పా. అయినా పెళ్లికి అంగీకరించింది’’ అని చెప్పారు. తన వ్యక్తిగత, ఆధ్యాతి్మక జీవితంపై భార్య ప్రభావం ఉందన్నారు. తల్లి బెవర్లీని సభకు పరిచయం చేస్తూ ఉద్వేగానికి లోనయ్యారు.
భారతీయ వంటలు నేర్చుకున్నారు: ఉష
వాన్స్ గొప్ప ఉపాధ్యక్షునిగా తనను తాను నిరూపించుకుంటారని భార్య ఉషా చిలుకూరి (38) విశ్వాసం వెలిబుచ్చారు. వాన్స్ ప్రసంగానికి ముందు ఆయనను రిపబ్లికన్ కన్వెన్షన్‌కు ఆమె లాంఛనంగా పరిచయం చేశారు. ‘‘జేడీది నిరుపేద స్థానిక శ్వేతజాతి కుటుంబం. నాదేమో భారతీయ వలసదారుల కుటుంబం. అలాంటి మేం కలుసుకోగలిగామన్నా, ప్రేమలో పడి పెళ్లి చేసుకోగలిగామన్నా కేవలం అమెరికా గొప్పదనమే అందుకు కారణం’’ అన్నారు. ‘‘నా భారతీయ జీవన శైలి గురించి జేడీ ఆసక్తిగా అన్ని విషయాలూ తెలుసుకున్నాడు. పక్కా మాంసాహారి అయినా నా శాకాహార జీవనశైలికి అలవాటు పడ్డాడు. మా అమ్మనడిగి భారతీయ వంటకాలు చేయడం నేర్చుకున్నాడు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment