అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకోవడం, డెమోక్రటిక్ అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరును ఆయన ప్రతిపాదించడం, మద్దతు కూడగట్టుకునేందుకు ఆమె ప్రయత్నాలు ముమ్మరం చేయడం.. అదే టైంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆమెను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం చకచకా జరిగిపోతున్నాయి. అయితే ఈలోపు సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ తెర మీదకు వచ్చింది.
బైడెన్ వైదొలగిన తర్వాత హారిస్ ప్రచారం బృందం 24 గంటల్లో 81 మిలియన్ డాలర్ల విరాళాలను సేకరించింది. దీంట్లో 60 శాతం తొలిసారి దాతల నుంచి వచ్చినవే కావడం గమనార్హం. మరి కమలా హారిస్‌కు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ‘కానుక’ సంగతి ఏంటి? అని కొందరు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేలుస్తున్నారు. అయితే ఇది ఇప్పట్లో జరిగింది కాదు.
2011 సెప్టెంబర్‌లో కమలా హారిస్ కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఉన్నారు. ఆమె మళ్లీ పోటీ చేయడం కోసం ఆమెకు మద్దతుగా విరాళాల సేకరణ జరిగింది. ఆ సమయంలో ట్రంప్ తరఫున 6,000 డాలర్ల డొనేషన్ కమలా హారిస్‌కు వెళ్లింది. ఇందులో 5,000 డాలర్లను ట్రంప్ సంతకంతో కూడిన చెక్ డొనేషన్ రూపంలో ఆమెకు వెళ్లింది. మరో వెయ్యి డాలర్లు 2013 ఫిబ్రవరిలో ట్రంప్ పేరిట హారిస్ ఖాతాలోకి వెళ్లింది.
ఇక.. 2014 జూన్‌లో కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రీ-ఎలక్షన్ కమిటీ సభ్యురాలైన ట్రంప్ కూతురు ఇవాంకా.. మరో 2,000 డాలర్లను విరాళంగా ఇచ్చారు. అంటే.. మొత్తంగా ట్రంప్ కుటుంబం 8,000 డాలర్లను డొనేషన్ రూపంలో కమలా హారిస్‌కు మద్దతుగా ఇచ్చిందన్నమాట. అయితే ఇది ఆ కుటుంబం కావాలని చేసిన పనేం కాదు. అప్పటి న్యూయార్క్ ప్రాసిక్యూటర్ ఎరిక్ ష్నీడెర్మాన్ కమలా హారిస్ తరఫున ఫండ్ రైజర్‌గా ఉండగా.. ఆయన విజ్ఞప్తి మేరకు ట్రంప్ కుటుంబం అలా డొనేషన్లు ఇచ్చింది.
ఇక ఇప్పుడు ఆ డొనేషన్ ప్రస్తావన తెర మీదకు వచ్చింది. ఫ్లోరిడా డెమోక్రటిక్ సభ్యుడు జరెడ్ మోస్కోవిట్జ్ ఎక్స్ వేదికగా ‘‘తెలివైన పెట్టుబడి’’ అని చేసిన ట్వీట్ ఒకటి చర్చనీయాంశమైంది. ఆమె ఇప్పుడు డెమోక్రటిక్ అభ్యర్థి కాబట్టి ఆ డబ్బును ఉపయోగించుకోలేరని మరో నెటిజన్ సెటైర్ వేశారు. ట్రంప్ దీనికి ఏం సమాధానం చెప్తారో అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశారు.
కొసమెరుపు ఏంటంటే..
శాక్రమెంటో బీ పత్రికా కథనం ప్రకారం.. 2020లో యూఎస్ సెనేట్‌కు కమలా హారిస్ పోటీ చేశారు. ఆ టైంలో ఆ 6 వేల డాలర్ల మొత్తాన్ని ఆమె సెంట్రల్ అమెరికాలోని ఓ పౌర హక్కుల సంస్థకు విరాళంగా ఇచ్చారట.
Comments
Please login to add a commentAdd a comment