వాషింగ్టన్: భారత సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయోవా రిపబ్లికన్ కాకస్ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించగా.. ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శన కారణంగా బరి నుంచి తప్పుకోవాలని రామస్వామి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్‌కు వివేక్ మద్దతు ఇవ్వనున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి విజయాన్ని అందుకున్నారు. ప్రైమరీలో కీలకమైన అయోవా కాకసస్ ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియలో ఇది మొదటిది. ఇందులో ట్రంప్ అత్యధిక మెజార్టీ సాధించారు. రెండో స్థానంలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్, ఐరాస మాజీ రాయబారి నిక్కీ హేలీ మధ్య పోటీ నెలకొంది. ఇక, కేవలం 7.7 శాతం ఓటింగ్‌తో నాలుగో స్థానంలో నిలిచిన వివేక్ రామస్వామి ప్రైమరీ తొలి పోరులో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు.
వివేక్ రామస్వామి ఒహాయోలో ఆగస్టు 9, 1985లో జన్మించారు. కేరళకు చెందిన ఆయన తల్లిదండ్రులు ఆమెరికా(America)కు వలస వచ్చారు. ఆయన సోషల్ మీడియాలో తనను తాను క్యాపిటలిస్ట్, సిటిజెన్‌గా అభివర్ణించుకుంటారు. హార్వర్డ్, యేల్ యూనివర్సిటీల్లో విద్యనభ్యసించారు. లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం.. గత ఏడాది ఆయన స్ట్రైవ్ అసెట్ మేనేజ్‌మెంట్‌ను స్థాపించారు. దీనికి ముందు ఆయనకు ఔషధరంగంలో గొప్ప పేరు ఉంది. రొవాంట్ సైన్సెస్‌ను ఏర్పాటు చేశారు. 2016లో ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం.. ఆయన ఆస్తుల విలువ 600 మిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న సంపన్నుల్లో ఒకరిగా నిలిచారు.
కిందటి ఏడాది ఫిబ్రవరిలో ఆయన పోటీ ప్రకటన తర్వాత వార్తల్లో నిలుస్తూ వచ్చారు. అమెరికా ఆదర్శాలను తిరిగి పునరుద్ధరించేందుకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆ సమయంలో ప్రకటించారాయన. ఇది రాజకీయ ప్రచారం మాత్రమే కాదని.. తర్వాతి తరం అమెరికన్లకు కొత్త కలలను సృష్టించేందుకు చేస్తున్న సాంస్కృతిక ఉద్యమం అని చెప్పుకున్నారాయన. అమెరికాకు మొదటి స్థానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ ట్రంప్ తరహాలో ప్రచారం చేస్తూ వచ్చారాయన. అలాగే.. చైనా నుంచి ఎదురవుతోన్న ముప్పును ఎదుర్కోవడంతో పాటు ఆ దేశంపై ఆధారపడటాన్ని తగ్గిస్తాను అంటూ ప్రకటన చేశారాయన. ఆ తర్వాత ప్రచారంలో వైవిధ్యతను కనబరుస్తూ వచ్చినప్పటికీ.. ప్రచార చివరిరోజుల్లో ట్రంప్, రామస్వామిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చివరకు..అయోవా కాకసస్ ఎన్నికల్లో చేదు ఫలితం అందుకుని అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వివేక్ రామస్వామి తప్పుకున్నారు.
ఇదీ చదవండి: అధ్యక్ష రేసులో డొనాల్డ్ ట్రంప్.. భారీ ఊరట
Comments
Please login to add a commentAdd a comment