అమెరికాలోని భారతీయ టెకీల జీవిత భాగస్వాముల కలలు ఆవిరవుతున్నాయి. యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సరీ్వసెస్ (యూఎస్‌సీఐఎస్) వారికి చుక్కలు చూపుతోంది. హెచ్4(డిపెండెంట్) వీసాలు కలిగి ఉండే హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అక్కడ చట్టబద్ధంగా ఎలాంటి ఉద్యోగాలైనా చేసేందుకు అనుమతించే ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్–ఈఏడీ (అంటే వర్క్ పర్మిట్ అన్నమాట) జారీలో తీవ్ర జాప్యం చేస్తోంది. కరోనా పేరు చెప్పి నెలల తరబడి వారి ఈఏడీ రెన్యూవల్ దరఖాస్తులను పక్కన పెట్టేసింది.
ఫలితంగా మార్చి 31 నాటికి సుమారు 91 వేల మంది భారతీయ మహిళలు అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయారు. దేశంకాని దేశంలో అహోరాత్రులు కష్టపడి చేస్తున్న ఉద్యోగం హఠాత్తుగా ఊడిపోవడంతో వారంతా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఈఏడీ రెన్యూవల్‌కు 14 నుంచి 16 నెలలు పడుతోందని, ఈ పరిణామం తమ జీవితాలను అస్తవ్యస్తం చేస్తోందని వాపోతున్నారు. తమ గోడును పట్టించుకునే వారు లేక విలవిల్లాడుతున్నారు. హెచ్4 వీసాలు కలిగిన జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేసుకొనే హక్కు కల్పించిన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ అంశంపై స్పందించాలంటూ నిత్యం వందలాది మంది ఆయనకు మెయిల్స్ పంపుతున్నారు.
అమెరికా నుంచి కంచర్ల యాదగిరిరెడ్డి
హెచ్1బీపై పనిచేస్తూ గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అది లభించడానికి 10 నుంచి 15 ఏళ్లు పడుతుంది. ఈలోగా జీవిత భాగస్వామి ఏదైనా ఉద్యోగం చేసుకోవాలంటే విద్యార్హతలు ఉన్నా అమెరికాలో పని చేయడానికి గతంలో ఆ అవకాశం ఉండేది కాదు. ఇది ఆయా కుటుంబాలకు ఇబ్బందిగా ఉందని గ్రహించిన నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా 2015లో కొత్త ప్రతిపాదన తెచ్చారు. హెచ్1బీపై పనిచేస్తూ గ్రీన్‌కార్డు కోసం వేచి చూస్తున్న వారి జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా హెచ్4 ఈఏడీ బిల్లును ప్రతిపాదించారు. దీనికి కాంగ్రెస్ ఉభయ సభలు ఆమోదం తెలపడంతో 2016 నుంచి హెచ్1బీ జీవిత భాగస్వాములకు ఈఏడీ లభిస్తోంది. దీనివల్ల 1.34 లక్షల మంది భారతీయ మహిళలు యూఎస్‌సీఐఎస్ నుంచి ఈఏడీ పొంది ఉద్యోగాల్లో చేరారు.
జీవిత భాగస్వామి హెచ్1బీ గడువుకు అనుగుణంగా హెచ్4 వీసా రెన్యూవల్ చేస్తారు. కానీ ఏడాదిన్నరగా యూఎస్‌సీఐఎస్ ఈఏడీ రెన్యూవల్ చేయట్లేదు. చాలా మంది 15 నుంచి 20 నెలలుగా రెన్యూవల్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. కరోనా కేసులతోపాటు మరికొన్ని కారణాలను చూపుతూ యూఎస్‌సీఐఎస్ ఈఏడీల పునరుద్ధరణలో జాప్యం చేస్తోందని, 90 వేల మందికిపైగా భారతీయ గృహిణులు, వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆ సంస్థకు చీమకుట్టినట్లు కూడా లేదని భారతీయ, అమెరికన్ ఇమ్మిగ్రేషన్ నిపుణుడు ఇందర్‌జిత్ అహ్లూవాలియా మండిపడ్డారు. మునుపెన్నడూ తాను ఇలాంటి దురుసుతనాన్ని చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు.
హెచ్4 ఈఏడీకి మరికొన్ని సంగతులు...
► హెచ్1బీ వీసా మూడేళ్లు ఉంటే అంతే కాలానికి హెచ్4 ఈఏడీ జారీ చేస్తారు. మామూలుగా ఆరేళ్లుగా రెన్యూవల్‌కు ముందే హెచ్1బీతోపాటే హెచ్4 జారీ చేసేవారు. ఇప్పుడు హెచ్1బీ జారీ అయి ఏడాది దాటినా హెచ్4 ఈఏడీ ఇవ్వడం లేదు.
► హెచ్ 4 ఈఏడీ కలిగి ఉన్న జీవిత భాగస్వాములు అమెరికాలో ఏ ఉద్యోగమైన చేసుకునేందుకు అర్హులు. వీరికి హెచ్1బీ మాదిరి ఆంక్షలు ఉండవు. కేవలం సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలే చేయాలన్న నిబంధనేమీ లేదు. కానీ భారతీయుల్లో 95 శాతం మంది టెకీ ఉద్యోగాలే చేస్తున్నారు.
న్యాయస్థానాల్లో డజన్లకొద్దీ కేసులు...
తమ ఈఏడీలను రెన్యూవల్ చేయడంలో యూఎస్‌సీఐఎస్ కావాలని తాత్సరం చేస్తోందంటూ బాధితులు అమెరికాలోని వివిధ రాష్ట్రాల కోర్టుల్లో రోజూ డజన్లకొద్దీ పిటిషన్లు వేస్తున్నారు. ‘‘న్యాయస్థానాలను ఆశ్రయించడం తప్ప మాకు గత్యంతరం లేదు. మేము పడుతున్న ఇబ్బందులను కోర్టులైనా అర్థం చేసుకుంటాయని ఆశిస్తున్నాం’’ అని కంభాలపాటి అనూష అన్నారు. ఆమె టెక్సాస్‌లోని డాలస్ కోర్టులో తనకు న్యాయం చేయాలంటూ మరో 250 మందితో కలసి పిటిషన్ వేసింది. అమెరికన్ ఎకానమీలో భారతీయ వలసదారులు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారంటూ ప్రశంసించడమే తప్ప అవసరమైన సందర్భాలలో ఆదుకోవడానికి అమెరికా కాంగ్రెస్ సభ్యులు ముందుకు రావట్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈఏడీ కార్డు రెన్యూవల్ చేయలేదు
హెచ్4 వీసాపై సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న నాకు 10 నెలల నుంచి యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) ఉద్యోగ ఆధారిత కార్డు (ఈఏడీ) రెన్యూవల్ చేయకపోవడంతో మా కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. దానికి తోడు నా రెండేళ్ల కుమారుడు ఆటిజం వ్యాధి చికిత్సకు నెలకు అవసరమైన 2,500 డాలర్లు సమకూర్చలేక నరకయాతన అనుభవిస్తున్నా.
– ప్రియాంక జొన్నలగడ్డ
11 నెలలుగా ఉద్యోగం లేదు
కేన్సర్ బారిన పడిన నేను 11 నెలలుగా ఉద్యోగం లేక అల్లాడుతున్నా. నా భర్త జీతం కుటుంబ అవసరాలకూ సరిపోవట్లేదు. నా వ్యాధికి చికిత్స తీసుకునేందుకు వీలుగా తిరిగి ఉద్యోగంలో చేరేందుకు ఈఏడీ మంజూరు చేయాలని యూఎస్‌సీఐఎస్‌ను వేడుకున్నా. కానీ కేన్సర్ బారినపడిన మీరు ఇంకా పనిచేయగల పరిస్థితిలో ఉన్నారా అంటూ యూఎస్‌సీఐఎస్ ప్రతినిధి ప్రశ్నించినప్పుడు ఇంకెందుకు బతికున్నానా అనిపించింది’’
– గీతా సుశీల్కర్
అసలే కరోనా.. ఆపై
అసలే కరోనా హమమ్మారి, దీనికితోడు కుటుంబంలో ఒకరి ఉద్యోగం పోగొట్టుకున్న 90 వేల మందికిపైగా భారతీయ కుటుంబాలు అప్పటివరకు వస్తున్న ఆదాయానికి గండిపడటంతో సంసారం గడవడం గగనమై చితికి పోయాయి. కెరీర్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న భారతీయ యువతీయువకులు ఇప్పుడు నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు.
– జాన్ మేయర్ ,హాఫ్ మన్ లా గ్రూపు నిపుణుడు
Comments
Please login to add a commentAdd a comment