
బోస్టన్: ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా విశ్వవిద్యాలయం విశ్వ పౌరసత్వ రాయబారిగా విశేషమైన గుర్తింపు ఇచ్చింది. ప్రపంచ శాంతి యత్నాలు, మానవతావాద, ఆధ్యాత్మిక నాయకత్వ పటిమతో ప్రపంచ వ్యాప్తంగా వివిధ మతవిశ్వాసాల మధ్య సామరస్యం కోసం ఆయన చేస్తున్న కృషికి ఈ గౌరవం ఇస్తున్నట్లు ప్రకటించింది.
అమెరికాలోని బోస్టన్‌లో ఉన్న నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయం ఆధ్యాత్మిక సలహాదారు, ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ అలెగ్జాండర్ లివరింగ్ కెర్న్ దీనిపై ప్రకటన విడుదల చేశారు. విశ్వమానవ రాయబారిగా గుర్తింపునిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు, మొట్టమొదటగా రవిశంకర్ కంటే ఉత్తమమైన వ్యక్తిని తాము ఊహించలేకపోయామని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ఆనందంగా కనిపించే మానవతావాది అని కొనియాడారు. ఉత్తమ మానవతా విలువలకు ప్రతిరూపంగా నిలిచే రవిశంకర్‌తో చర్చా కార్యక్రమం ద్వారా వారి నుంచి జ్ఞానాన్ని పొందడంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, దీనికి తాము సంతోష పడుతున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు, సంస్థలు, జాతుల మధ్య పరస్పర శాంతిని పెంపొందించేందుకు, చర్చలకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు గురుదేవ్ అవిశ్రాంతంగా పాటుపడుతున్నట్లు వివరిస్తూ ఈ ప్రకటనను విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment