వాషింగ్టన్: పారదర్శకతతో భారతీయ సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు లభించిన పరిస్థితుల్లో దేశంలో రిజర్వేషన్లను తొలగించడంపై కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ అక్కడి జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో మాట్లాడారు. ‘‘ ఆర్థిక ప్రయోజనాలు గిరిజనులు, ఓబీసీలు, దళితులకు సరిగా దక్కట్లేవు.
ప్రతి 100 రూపాయల్లో గిరిజనులు పొందేది కేవలం 10 పైసలు. దళితులు, ఓబీసీలకు చెరో ఐదు పైసలు దక్కుతున్నాయి. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు దక్కిన పరిస్థితుల్లో రిజర్వేషన్ల రద్దు అంశాన్ని కాంగ్రెస్ ఆలోచిస్తుంది. అయితే అలాంటి నిష్పక్షపాత పరిస్థితులు భారత్‌లో చాలా కష్టం. ఎందుకంటే భారత్‌లో 90 శాతం జనాభాకు ఎలాంటి ప్రాధాన్యత దక్కట్లేదు.
బడా పారిశ్రామికవేత్తల్లో గిరిజనులు, దళితులు, ఓబీసీలు దాదాపు లేరు. మీరు టాప్ 200 భారతీయ వాణిజ్యవేత్తల జాబితా చూడండి. అందులో ఒక్కరు కూడా గిరిజనులు, దళితులు ఉండరు. ఉంటే ఒకే ఒక్క ఓబీసీ వ్యాపారి ఉండొచ్చేమో’’ అని అన్నారు. ‘‘ ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) తెస్తామని బీజేపీ ప్రభుత్వం చెబుతోంది. అసలు బీజేపీ ఏ రకంగా యూసీసీని అమలుచేయాలనుకుంటోంది. వాళ్ల ప్రాధాన్యాలేమిటో చెప్పమనండి. తర్వాత మేం స్పందిస్తాం’’ అన్నారు.
మోదీ భయం మటుమాయం
‘‘జనాల్లో మోదీ సృష్టించిన భయం లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో పోయింది. మోదీని ఢీకొట్టలేరన్న భయాన్ని జనాల్లో కలి్పంచేందుకు ఎంతో ధనం ధారపోశారు. ప్రణాళికలు వేశారు. కానీ రాజ్యాంగంపైనే దాడి చేస్తున్న బీజేపీకి మెజారిటీ రాకుండా ఓటర్లు వాత పెట్టారు. దాంతో మోదీ భయం ఒక్క సెకన్‌లో మటుమాయమైంది. 56 అంగుళాల ఛాతీ, దైవంతో అనుసంధానం వంటివన్నీ ఇప్పుడు ఒట్టిమాటలు. మోదీని నేను శత్రువులా చూడను. ద్వేషించను. కానీ ఆయన దృక్పథంతో ఏకీభవించను’’ అని రాహుల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment