ఏవైనా మొక్కలు, చెట్లు ఎన్ని రోజులు బతుకుతాయి. కొన్ని అయితే నెలలు, మరికొన్ని అయితే సంవత్సరాలు.. అత్యంత భారీ వృక్షాలు అయితే కొన్ని వందల ఏళ్లు బతుకుతాయి. కానీ కేవలం రెండే ఆకులతో, రెండు మూడు అడుగుల పొడవు మాత్రమే ఉండే ఓ చిన్న మొక్క కొన్ని వేల ఏళ్లు బతుకుతుంది తెలుసా? ఆ మొక్క పేరు.. ‘వెల్విస్చియా’. భూమ్మీద అత్యంత పురాతన ఎడారుల్లో ఒకటైన నమీబియా ఎడారిలో ఈ మొక్కలు కనిపిస్తాయి. ఆస్ట్రియా జీవశాస్త్రవేత్త ఫ్రెడ్రిక్ వెల్విస్చ్ 1859లో ఈ చిత్రమైన మొక్కలను గుర్తించారు. ఆయన పేరుమీదుగానే దీనికి ‘వెల్విస్చియా’ అని పేరుపెట్టారు.
ఎప్పటికీ చావదని..
వెల్విస్చియా మొక్కలను ఆఫ్రికాలో స్థానికంగా ‘ట్వీబ్లార్కన్నీడూడ్’ అని పిలుస్తారు. ఈ పదానికి ‘ఎప్పటికీ చావులేని రెండు ఆకులు’ అని అర్థం. దీనికి తగ్గట్టే రెండే ఆకులు ఉండే ఈ మొక్క.. అత్యంత క్లిష్టమైన పరిస్థితులను తట్టుకుని మరీ కొన్ని వేల ఏళ్లు బతుకుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి ఉన్న రెండు ఆకులే పొడవుపెరుగుతున్న కొద్దీ చీలిపోతూ చుట్టూ విస్తరిస్తాయని తేల్చారు. కొన్ని మొక్కల శాంపిల్స్‌ను తీసుకుని పరీక్షించారు. వాటిలో కొన్ని మూడు వేల ఏళ్ల కిందటే పుట్టి, ఇప్పటికీ బతుకుతున్నట్టు గుర్తించి ఆశ్చర్యపోయారు. చాలా మొక్కల వయసు వెయ్యేళ్లకుపైనే ఉన్నట్టు వెల్లడికావడం గమనార్హం.
ఆ మార్పులతో వ్యవసాయానికి తోడ్పాటు
అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత వంటి క్లిష్ట పరిస్థితులను తట్టుకుంటూ.. అతి తక్కువ శక్తిని వినియోగించుకునేలా ఈ మొక్కల్లో జరిగిన జన్యుమార్పులను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. వీటిని వ్యవసాయంలో అమలు చేయగలిగితే.. క్లిష్ట పరిస్థితులను తట్టుకునేలా, తక్కువ నీళ్లు, ఎరువులను వినియోగించుకునేలా పంటలను అభివృద్ధి చేయవచ్చని పరిశోధనకు నేతృత్వం వహించిన అమెరికన్ శాస్త్రవేత్త జేమ్స్ లీబెన్స్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment