అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడి ఉదంతంపై ఆ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌ఐబీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ట్రంప్‌పై హత్యాయత్నానికి ముందు నిందితుడైన 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ కదలికలపై ఎఫ్‌బీఐ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ట్రంప్‌పై కాల్పులు జరిపే కొన్ని గంటల ముందు నిందితుడికి సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగుచూశాయి.
ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ట్రంప్‌పై దాడి చేసేందుకు క్రూక్స్ దాదాపు 48 గంటలు పనిచేసినట్లు తేలింది. దాడికి ముందు రోజు శుక్రవారం క్రూక్స్ తన స్వస్థలమైన పెన్సిల్వేనియాలోని బెతెల్ పార్క్‌లో షూటింగ్ రేంజ్‌ను సందర్శించాడు. అక్కడ కాల్చడం ప్రాక్టీస్ చేశాడు. తరువాతి రోజు శనివారం ఓ దుకాణానికి వెళ్లి అయిదు అడుగుల నిచ్చెన కొనుగోలు చేశాడు. అనంతరం స్థానిక గన్ స్టోర్‌కు వెళ్లి 50 రౌండ్ల బుల్లెట్లు కొన్నాడు.
సాయంత్రం క్రూక్స్ తన కారులో బట్లర్ ప్రాంతానికి చేరుకున్నాడు. కారును బయట పార్క్ చేసి, అందులోనే అధునాతన పేలుడు పరికరాన్ని వదిలేశాడు. నిచ్చెనతో సమీపంలోని భవనంపైకి ఎక్కి తుపాకీతో ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. అయితే దాడికి ఉపయోగించిన గన్‌ను క్రూక్స్ తండ్రి 2013లో అధికారికంగా కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ విషయాలన్నీ అధికారులు వెల్లడించినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి.
కాగా శనివారం(జూల్13న) పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా ట్రంప్‌పై ఆగంతకుడు కాల్పులకు తెగబడటం తెలిసిందే. ర్యాలీ ప్రాంతం నుంచి 130 మీటర్ల దూరం నుంచి ట్రంప్‌పై హత్యాయత్నం చేసింది. 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌గా తేలింది. నిందితుడిని ఘటనా స్థలంలోనే భద్రతా సిబ్బంది సెక్యూరిటీ స్నైపర్స్ అంతమొందించారు. అయితే ఈఘటనలో ట్రంప్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన కుడి చెవికి గాయమవ్వగా.. ఆసుపత్రిలో చేరి చికిత్స పొదుతున్నారు.
మరోవైపు నిందితుడు ట్రంప్‌పై ఈ ఈ దుశ్చర్యకు పాల్పడటం వెనక గల ఉద్దేశాన్ని తెలుసుకునేందుకు ఎఫ్‌బీఐ అధికారులు యత్నిస్తున్నారు. క్రూక్స్ సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను పరిశీలిస్తున్నారు. అతడి చర్య వెనక రాజకీయపరమైన, సైద్ధాంతికపరమైన భావజాలం ప్రభావం ఏదైనా ఉందా..? అని ఆరా తీసుకున్నారు. అదే విధంగా క్రూక్స్ కారులో లభించిన పేలుడుపదార్థం గురించి కూడా దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment