
జెనివా: కరోనా మహమ్మారి ఇప్పట్లో వదిలిపెట్టేలా లేదు. పలు మార్పులకు లోనవుతూ.. మరింత ప్రమాదకరంగా తయారవుతూ.. ప్రపంచాన్ని వణికిస్తుంది. సెకండ్ వేవ్ భారతదేశాన్ని ఎంతలా వణికించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోజు వేల కొద్ది మరణాలు.. లక్షల్లో కేసులు నమోదయ్యాయి. సెకండ్ వేవ్ ఇంకా ముగియకముందే.. థర్డ్ వేవ్ ముప్పు గురించి హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) థర్డ్ వేవ్‌కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా థర్డ్ వేవ్ ప్రారంభమైనట్లు డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథానమ్ హెచ్చరించారు.
ఈ సందర్భంగా టెడ్రోస్ మాట్లాడుతూ.. ‘‘దురదృష్టం కొద్ది ప్రపంచం ఇప్పుడు థర్డ్‌వేవ్ ప్రారంభ దశలో ఉంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 111 దేశాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి కొనసాగుతుంది. ఇది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన కోవిడ్ వేరియంట్‌గా ఉండటమేకాక త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుందని మేం భావిస్తున్నాం. డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి, జన సంచారమే థర్డ వేవ్‌కు కారణం’’ అన్నారు. డెల్టా వేరియంట్ వ్యాప్తిని సామాజిక చైతన్యం, సమర్ధవంతమైన ప్రజారోగ్య చర్యల ద్వారా అడ్డుకోవాలని సూచించారు. తాజాగా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాలు రెండింటిలోనూ పెరుగుదల కనిపిస్తుందన్నారు.
ఐరోపా, ఉత్తర అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత కోవిడ్ కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయి.. కానీ, ప్రస్తుతం పరిస్థితి తారుమారవుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వైరస్ అభివృద్ధి చెందుతూనే ఉందని, దీని ఫలితంగా మరింత వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్‌లు పుట్టుకొస్తున్నాయని టెడ్రోస్ ఆందోళన వ్యక్త చేశారు. డబ్ల్యూహెచ్ఓ పరిధిలోని ఆరు రీజియన్లలో వరుసగా నాలుగు వారాల నుంచి కోవిడ్ కేసులు పెరుగుతునే ఉన్నాయన్నారు. అలాగే పది వారాల పాటు తగ్గిన మరణాలు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు టెడ్రోస్. ప్రాణాలను రక్షించే వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రపంచంలో కొనసాగుతున్న దిగ్భ్రాంతికరమైన అసమానతను కోవిడ్ అత్యవసర కమిటీ గుర్తించిందని టెడ్రోస్ తెలిపారు.
అయితే, వ్యాక్సిన్లు ఒక్కటే మహమ్మారిని ఆపలేవని, అనుకూలమైన, స్థిరమైన విధానంతో దేశాలు ముందుకు వెళ్లాలని సూచించారు. భౌతికదూరం, మాస్క్ ధరించడం వంటి నిబంధనలను తప్పనిసరిగా పాటించి.. ఆరోగ్య మౌలిక సదుపాయాలను కల్పించాలని తెలిపారు. పలు దేశాలు ఇటువంటి చర్యలతోనే కోవిడ్-19ను అడ్డుకుంటున్నాయని టెడ్రోస్ గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment