పద్దెనిమిది నెలల పాలన తర్వాత అనూహ్య పరిణామాలతో.. సంకీర్ణ ప్రభుత్వం చీలిపోయి నెదర్లాండ్స్ ప్రభుత్వం కుప్పకూలింది. డచ్ ప్రధాన మంత్రి మార్క్ రుట్టే(56) తన రాజీనామాను స్వయంగా ప్రకటించారు. కీలకమైన విషయంలో కూటమి ప్రభుత్వంలోని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సి వస్తోందని ప్రకటించారాయన. ఇంతకీ ఆ కీలకమైన అంశం ఏంటంటే..
నెదర్లాండ్స్ ప్రభుత్వం పడిపోవడానికి కారణం.. వలసల సమస్య. ఇమ్మిగ్రేషన్ పాలసీపై ప్రభుత్వ ప్రతిపాదనకు అనుగుణంగా ఒక ఒప్పందానికి కూటమి పార్టీలు ముందుకు రాకపోవడంతో గందరగోళనం నెలకొని.. రాజకీయ సంక్షోభానికి తెర తీసింది. నెదర్లాండ్స్‌లో దాదాపు రెండేళ్ల తర్వాత ప్రధాని రుట్టే కొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. వార్ జోన్‌ల నుంచి వచ్చే శరణార్థుల సంఖ్యను 200 మందికి మాత్రమే పరిమితం చేసేందుకు మొగ్గు చూపించారాయన.
ఈ ప్రతిపాదనను కూటమి ప్రభుత్వం(రుట్టేIV)లోని D66, క్రిస్టియన్ యూనియన్ పార్టీలు అంగీకరించలేదు. ఇవి చిన్న పార్టీలే అయినా.. ప్రజల్లో మాత్రం విపరీతమైన ఆదరణ ఉంది. అయితే రుట్టే సొంత పార్టీ పీపుల్స్ పార్టీ ఫర్ ఫ్రీడమ్ అండ్ డెమొక్రసీ మాత్రం శరణార్థుల సంఖ్యను పరిమితం చేసేందుకే మొగ్గుచూపించింది. అధిక వలసలతో దేశంపై ఆర్థిక భారం పడుతోందని.. కట్టడి కోసం యత్నించాలని సూచిస్తూ వచ్చింది. మిత్ర పక్షాలు మాత్రం శరణార్థులను కట్టడి చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలపబోమని స్పష్టం చేశాయి. ఈ భేదాభిప్రాయాలు కాస్త తీవ్ర రాజకీయ సంక్షోభానికి దారితీయడంతో ప్రభుత్వం కుప్పకూలింది.
తక్షణ ఎన్నికలు జరపాల్సిందే!
ప్రధాని రుట్టే.. శుక్రవారం తన రాజీనామా ప్రకటించారు. తన రాజీనామాను కింగ్ విల్లెమ్ అలెగ్జాండర్‌కు సమర్పించారు. డచ్ ఎన్నికల సంఘం.. నవంబర్ మధ్యలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రకటన చేసింది. దీంతో అప్పటిదాకా రుట్టే ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ, ప్రతిపక్షాలు మాత్రం తక్షణ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే కూటమి ప్రభుత్వం ద్వారా తాము అధికారంలో కూర్చుంటామని చెబుతున్నాయి.
మార్క్ రుట్టే.. 2002లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. నెదర్లాండ్స్‌కు సుదీర్ఘంగా ప్రధాన మంత్రిగా కొనసాగిన వ్యక్తాయన. 2010 నుంచి ఆయన ప్రధాని పదవిలో ఉన్నారు. 2012, 2017, 2021.. ఎన్నికల్లోనూ ఆయన ప్రధానిగా ప్రమాణం చేశారు. 2021లో 150 సీట్లకుగానూ 34 సీట్లు గెల్చుకుని.. డీ66, సీయూ, సీడీఏ పార్టీల సహకారంతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment