
ఈ ఫొటోలో దీనంగా కనిపిస్తున్న కుక్కను చూశారుగా. దీని పేరు బేబీ గర్ల్. మంటలు ఆర్పేందుకు ఏర్పాటు చేసిన ఓ ఫైర్ హైడ్రంట్‌కు కట్టేసి ఉంది. పక్కన ఓ బ్యాగుంది. జంతువుల బాగోగులను చూసుకునే ఓ చారిటీ వాళ్లు వచ్చి ఆ కుక్కను, ఆ బ్యాగును చూశారు. కుక్కను ఎవరు వదిలేశారు, ఎందుకు వదిలేశారని అనుకుంటూ ఆ బ్యాగును తెరిచి చూశారు.
దాన్నిండా ఆ కుక్క ఆడుకునే వస్తువులు, దానికి ఇష్టమైన వస్తువులతో పాటు ఆ కుక్కును పెంచుకునే యజమాని ఓ లేఖను కూడా గుర్తించారు. దాన్ని చదివి చలించిపోయారు. యజమాని చెప్పింది నిజమా కాదా అని తెలుసుకునేందుకు వెంటనే కుక్కను మెడికల్ టెస్టుకు పంపారు. దానికి కెనైన్ డయాబెటిస్ (డయాబెటిస్ మిల్లిటస్) వ్యాధి ఉందని గుర్తించారు. ఆ వ్యాధి చికిత్స కోసం నెలనెలా కుక్కకు ఇన్సులిన్‌ను, మరిన్ని రకాల మందులూ కొనాల్సి ఉంటుంది.
ప్రత్యేకమైన తిండిని పెట్టాల్సి ఉంటుంది. వీటన్నింటికీ ప్రతి నెలా రూ. వేలల్లోనే ఖర్చవుతుంది. కుక్కను పెంచుకుంటున్న యజమానే కొన్ని వైద్యపరమైన సమస్యలతో సతమతమవుతున్నాడు. ఆయన వ్యాధి చికిత్సకే డబ్బులు సరిపోక ఇబ్బందిపడుతున్నాడు. ఇప్పుడు కుక్కు చికిత్సకు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని బాధపడ్డాడు. మరో అవకాశం లేక.. లోలోపల బాధపడుతున్నా ఎవరో ఒకరు ఆదుకోకుండా ఉంటారా జనాలు తిరిగే వీధిలో దాన్ని వదిలేశాడు.
కానీ ఉండలేకపోయాడు. కుక్కను చారిటీ వాళ్లు తీసుకెళ్లారని తెలుసుకొని పరుగును వాళ్లను కలుసుకున్నాడు. ఆయన తిరిగి రావడం చూసి చారిటీ వాళ్లు సంతోషించారు. ‘కుక్కకు ఇష్టమైన వస్తువులను ప్యాక్ చేసి, ప్రమాదవశాత్తు కార్ల కింద పడకుండా, అందరికంట పడేలా ఓ పక్కన కట్టేసి, ఎందుకు వదిలేశారో లేఖను రాసిన తీరును చూసి కుక్కంటే మీకెంతిష్టమో మాకు అర్థమైంది’ అన్నారు. ఇక మీరు చింతించాల్సిన అవసరం లేదని, బేబీ గర్ల్‌కు మంచి భవిష్యత్తు ఉందని భరోసానిచ్చారు. ఈ సంఘటన అమెరికాలోని విస్కాన్‌సిన్ రాష్ట్రంలో ఉన్న గ్రీన్ బే ప్రాంతంలో జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment