
స్టాక్‌హోం: 24 గంటల పాటు కదలకుండా ఒకే ప్రదేశంలో ఉంటే ఎలా ఉంటుంది.. ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది కదా. కానీ ఓ వ్యక్తిని దాదాపు 28 ఏళ్ల పాటు ఓ గదిలో బంధించి ఉంచారు. ప్రస్తుతం నలభయ్యేళ్ల వయసులో ఉన్న ఆ వ్యక్తి సరైన పోషణ లేక.. శరీరం కుంగిపోయి.. నోట్లో పళ్లు అన్ని ఊడి పోయి.. నడవలేక.. అత్యంత దీన స్థితిలో జీవచ్ఛవంలా మారాడు. అతడి పరిస్థితి చూసి పోలీసులే కంట తడి పెట్టారు అంటే ఎంతటి దయనీయ స్థితిలో ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు. మరో షాకింగ్ న్యూస్ ఎంటంటే కన్న తల్లే అతడని ఇన్నేళ్లపాటు గదిలో బంధించి ఉంది. అవును మీరు చదివింది నిజమే. తల్లే అతడి పాలిట ఇంత కర్కషంగా ప్రవర్తించింది. మహిళ దూరపు బంధువు సమాచారంతో ఈ దారుణం వెలుగు చూసింది. ఈ హృదయవిదారక ఘటన స్వీడన్‌లో చోటు చేసుకుంది. బాధితుడు 12వ ఏట విద్యార్థిగా ఉన్న సమయంలో తల్లి అతడిని స్కూల్ నుంచి బలవంతంగా ఇంటికి తీసుకువచ్చి గదిలో బంధించింది. తిండి, నిద్ర, మలమూత్ర విసర్జన అంతా అక్కడే. ఈ 28 ఏళ్ల కాలంలో ఆ మహాతల్లి గదిని ఒక్కసారి కూడా శుభ్రం చేసిన దాఖలాలు కనిపించలేదని తెలిపారు పోలీసులు. ప్రస్తుతం బాధితుడి వయసు 41 ఏళ్లు కాగా.. అతడి తల్లి వయసు 70 సంవత్సరాలు.
ఈ ఆదివారం వృద్ధురాలు అనారోగ్యం పాలైంది. దీని గురించి దూరపు బంధువుకు సమాచారం అందించడంతో వృద్ధురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఆమె అపార్టుమెంట్‌కి వచ్చింది. ఆ సమయంలోనే బాధితుడిని గుర్తించింది. దీని గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని బాధితుడిని గది నుంచి తీసుకువచ్చి ఆస్పత్రిలో చేర్చారు. అతడిని పరీక్షించిన వైద్యులు ప్రాణానికి ప్రమాదం లేదని తెలిపారు. బాధితుడిని ఎంతో కాలం నుంచి గదిలో బంధించడమే కాక సరైన ఆహారం కూడా ఇవ్వలేదని వైద్యులు తెలిపారు. బాధితుడి నోట్లో పళ్లే లేవన్నారు. ఇక అతడి శరీరంపై ఉన్న గాయాల వల్ల ప్రాణాలకు పెద్దగా ప్రమాదం లేదని.. కాకపోతే మానసికంగా ఎంతో వేదన అనుభవించాడు కనుక కోలుకోవడానికి సమయం పడుతుందని తెలిపారు డాక్టర్లు. (చదవండి: చిత్తుగా కొట్టి.. మలం తినిపించి..)
ఇక బాధితుడి బంధువు మాట్లాడుతూ.. ‘నిందితురాలు అనారోగ్యానికి గురైందని తెలియడంతో వారి అపార్ట్‌మెంట్‌కు వెళ్లాను. అక్కడ పరిసరాలు చూసి నాకు కడుపులో దేవింది. ఏళ్లుగా ఇంటిని శుభ్రం చేయడం లేదనుకుంటాను చెత్త, చెదారం, మలమూత్రాలు అన్ని కలిసి పోయి భరించలేదని దుర్వాసన వస్తోంది. అంబులెన్ప్‌కి కాల్ చేసి వారి సాయంతో మహిళను ఆస్పత్రికి చేర్చాను. ఆ సమయంలోనే బాధితుడి గురించి తెలిసింది. అతడిని ఆ పరిస్థితుల్లో చూసి షాక్ అయ్యాను. నా గుండే పగిలిపోయింది. అతడి దీని స్థితి గురించి నాకు తెలియడానికి 28 ఏళ్లు పట్టింది. చివరకు ఆమె అనారోగ్యం కారణంగా బాధితుడికి సాయం చేసే అవకాశం దక్కింది’ అన్నారు. బాధితుడి గురించి ఎప్పుడు ప్రశ్నించినా.. బాగానే ఉన్నాడని చెప్పి టాపిక్ డైవర్డ్ చేసేదన్నారు. ఇంత దారుణం జరుగుతున్న ఇరుగుపొరుగు వారికి వ్యక్తి దీని స్థితి గురించి తెలియకపోవడం వింతగా ఉంది. దీని గురించి పోలీసులు వారిని ప్రశ్నించగా.. వృద్ధురాలు ఎవరిని ఇంటి చుట్టుపక్కలకి రానిచ్చేది కాదని.. కొడుకు గురించి అడిగితే బాగానే ఉన్నాడు.. మీకేందుకు అని గొడవపడేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment