3-Year-Old Boy Yaseem Jenkins Dies After Surviving 2019 Philadelphia Shooting - Sakshi
Sakshi News home page

Yaseem Jenkins: వీడేం తండ్రి.. మూడేళ్ల తర్వాత విషాదంగా ముగిసిన చిన్నారి జీవితం!

Published Sat, Apr 23 2022 5:36 PM | Last Updated on Sat, Apr 23 2022 6:39 PM

Yaseem Jenkins: Philadelphia Bullet Injured Kid Passed Away - Sakshi

తన వ్యసనం కోసం కొడుకు ప్రాణాలనే అడ్డు పెట్టిన ఓ మూర్ఖుడి కథ ఇది. తనకేమైనా హాని జరుగుతుందన్న ఉద్దేశంతో.. దూసుకొచ్చిన ప్రమాదం ముందర చంటి బిడ్డను ఉంచాడు. ఫలితం.. ఆ పసికందు శరీరంలోకి తూటాలు దూసుకెళ్లాయి!. ఫిలడెల్ఫియాలో సుమారు రెండేళ్ల కిందట సంచలనం సృష్టించిన కేసు.. ఇప్పుడు విషాదంగా ముగిసింది.

ఫిలడెల్ఫియా హంటింగ్‌ పార్క్‌ సెక్షన్‌కు చెందిన నఫెస్‌ మోన్‌రోయ్‌.. తన దగ్గరున్న నకిలీ కరెన్సీతో డ్రగ్స్‌ కొనే ప్రయత్నం చేశాడు. అయితే ఈ వ్యవహారం బెడిసికొడితే తనకేమైనా హాని కలుగుతుందన్న ఉద్దేశంతో.. కూడా తన 11 నెలల బాబు యసీమ్‌ జెన్‌కిన్స్‌ను రక్షణ కవచంగా వెంటపెట్టుకెళ్లాడు. నఫెస్‌ ఊహించినట్లుగానే.. డ్రగ్‌ డీలర్‌ ఫ్రాన్సిస్కో ఒర్‌టిజ్‌, నఫెస్‌పై కాల్పులకు దిగాడు. ఆ టైంలో యసీమ్‌ను అడ్డు పెట్టడంతో ఆ పసికందు శరీరంలోకి బుల్లెట్‌లు దిగాయి.

తల, మెడ, వెనుక భాగంలోకి మూడు బుల్లెట్లు దిగగా.. వైద్యులు తీవ్రంగా శ్రమించి ప్రాణాపాయ స్థితి నుంచి ఆ చిన్నారిని బయటపడేశారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది అప్పట్లో. ఇక మూర్ఖంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు నఫెస్‌ను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఈ కేసు విచారణ సమయంలో..  యసీమ్‌ జెన్‌కిన్స్‌ను ‘మానవ కవచం’గా అభివర్ణించారు జడ్జిలు. అప్పటి నుంచి ఆ చిన్నారి తల్లి సంరక్షణలో ఉంటూ వస్తున్నాడు. అయితే.. రెండున్నరేళ్ల తర్వాత ఆ గాయాల తాలుకా ప్రభావంతో ఆ చిన్నారి మరణించినట్లు తెలుస్తోంది. 

శుక్రవారం మూడేళ్ల యసీమ్‌ జెన్‌కిన్స్‌ కన్నుమూసినట్లు ఫిలడెల్ఫియా అధికారులు ప్రకటించారు. ఇది అప్పటి గాయాల ప్రభావంతోనేనా? అన్నది అధికారికంగా తేలాల్సి ఉంది. ఇక కాల్పులు జరిపిన ఫ్రాన్సిస్కోను ఉద్దేశపూర్వకంగా గాయపర్చినందుకు అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఇప్పుడు హత్యానేరం కింద జైలులోనే శాశ్వతంగా ఉంచే ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు కొడుకు ప్రాణాలను పణంగా పెట్టిన ఆ మూర్ఖుడు.. కాలక్రమంలో పశ్చాత్తాపం చెందగా, ఇప్పుడు కొడుకు మృతి చెందాడనే వార్త విని గుండెలు పలిగేలా రోదిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement