ఏపీ విద్యార్థులతో సహా కొంతమంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ సంస్థ అక్కడి నుంచి తిప్పి పంపిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత కొద్ది రోజులుగా ఏపీ విద్యార్థులతో సహా, భారతీయ విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ తిరిగి ఇండియాకు పంపించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ అంశంపై దృష్టి సారించారు. విద్యార్థులంతా వారి ఉన్నత చదువుల కోసం వ్యాలిడ్ వీసాను కలిగి ఉన్నారని, వారి కెరీర్‌ను దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని సీఎం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరనున్నారు.
పూర్తి అవగాహన అవసరం..
అమెరికా వీసా ఉన్నంత మాత్రాన ఆ దేశంలోకి ప్రవేశమనేది గ్యారెంటీ కాదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. అమెరికా వెళ్లే విద్యార్థులు యూఎస్ ఇమ్మిగ్రేషన్ (పోర్ట్ ఆఫ్ ఎంట్రీ) వద్ద కస్టమ్స్, బోర్డర్ ప్రొటక్షన్ (సీబీపీ) అధికారులు అడిగే అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలి. తమ ప్రవేశం ఎందుకనే అంశాన్ని చెప్పి వారిని ఒప్పించగలగాలి.
ఈ క్రమంలో అధికారులు అడిగే ఆర్థికపరమైన రుజువులు, ఇతర ధ్రువీకరణ పత్రాలు, అమెరికా ఇమ్మిగ్రేషన్, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలపై అవగాహన, తాము చదవబోతున్న యూనివర్సిటీ, కోర్సులు, తదితర అంశాలపై పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే అధికారులు అడిగే అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వండి.
పేరున్న ఏజెన్సీలైతే మంచిది..
అమెరికా నుంచి బహిష్కరణకు గురైన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ను సంప్రదించగలరని ఆ సంస్థ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి తెలిపారు.
ఇది ఎన్నారై సేవలతోపాటు ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు విదేశీ విద్యకు సంబంధించి అడ్మిషన్, కౌన్సెలింగ్ ప్రక్రియ, అమెరికా (ఇతర దేశాలు) వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అక్కడకు వెళ్లాక పాటించాల్సిన పద్ధతులు, లాంగ్‌టర్మ్ ట్రాకింగ్ తదితర అంశాలపై సేవలు అందిస్తోంది. కొన్ని విదేశీ విద్య కన్సల్టెంట్లు, సంస్థలు, ఏజెన్సీలు విద్యార్థులకు తప్పుడు హామీలిచ్చి మోసం చేసే అవకాశం ఉంది. ఇలాంటి వాటి పట్ల జాగ‍్రత్త వహించాలి. మంచి పేరున్న ఏజెన్సీల ద్వారానే విద్యార్థులు అమెరికా వెళ్లడం మంచిది.
అధికారులకు సంతృప్తికర సమాధానాలు ఇవ్వాలి..
అమెరికా చట్టాల ప్రకారం.. ఆ దేశానికి వచ్చేవారంతా యూఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) అధికారుల తనిఖీకి లోబడి ఉంటారు. ఈ క్రమంలో విద్యార్థి దశలో అమెరికాలో జీవించడానికి అవసరమైన ఆర్థిక స్థోమతకు రుజువులు, యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్, తదితరాల గురించి మన విద్యార్థులను అడిగినప్పుడు సంతృప్తికర సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. అధికారులు అడిగినవాటికి సంతృప్తికరంగా సమాధానాలు ఇవ్వకపోతే విద్యార్థులు యూఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించే అవకాశం ఉందని అధికారులు భావించొచ్చు.
సహాయం కోసం సంప్రదించండి..
విద్యార్థులు ఏదైనా సహాయం కోసం ఏపీఎన్‌ఆర్‌టీఎస్ 24/7 హెల్ప్‌లైన్ నంబర్లు +91 8632340678, 8500027678 కు 24/7 ఫోన్ చేయొచ్చు లేదా info@apnrts.com లేదా helpline@apnrts.com కు మెయిల్ చేయొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment