
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కర్ణాటకలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించి చరిత్ర సృష్టించింది. శనివారం విడుదలై ఫలితాలు కాంగ్రెస్‌కు పట్టం కట్టాయి. పొరుగు రాష్ట్రం కావడం, మన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలలే సమయం ఉండటంతో ఈ ఎన్నికల ప్రభావం మన రాష్ట్రంపైనా ప్రభావం చూపిస్తుంది. ఆ మేరకు సంబంధాలు ఉన్నాయి కాబట్టే.. అక్కడ మన రాష్ట్రం నుంచి అందులోనూ ఉమ్మడి జిల్లాల నుంచి బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి పలువురు నాయకులు వెళ్లి ప్రచారం నిర్వహించి వచ్చారు. ఎవరెవరు ఎక్కడ ప్రచారం చేశారో ఒకసారి పరిశీలిద్దాం.!
► కర్ణాటకలోని గుల్బర్గా, బీదర్, యాదగిరి నియోజకవర్గాల్లో జగిత్యాల జిల్లా నుంచి డీసీసీ అధ్యక్షుడు ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో పాల్గొన్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపొందింది.
► మంథని ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్ బాబు కళ్యాణ కర్ణాటకకు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఏఐసీసీ కార్యదర్శి మల్లికార్జున కార్గే ఏరియాలోని ఏడు జిల్లాలో 41 అసెంబ్లీ నియోజకవర్గాలకు శ్రీధర్ బాబు ఇన్‌చార్జిగా ఉన్నారు. రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్రకు ముందు నుంచి ఇక్కడి రాష్ట్రంలో శ్రీధర్ బాబు పార్టీ వ్యవహారాల్లో సమన్వయం చేస్తున్నారు.
► నిజాంబాద్ మాజీ ఎంపీ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకున్నారు.
► పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రచారం నిర్వహించిన కళ్యాణ్ గుల్బర్గాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
కమలనాథులకు ప్రతికూలమే..!
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కల్బూర్గి రూరల్ జిల్లా సేడం, చించోలి నియోజకవర్గాలలో ప్రచారం చేశారు. చించోలిలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించగా, సేడంలో కాంగ్రెస్ గెలిచింది. మధుగిరి జిల్లాలోని సిర, మధుగిరి, పవగడ నియోజకవర్గాల ప్రచారంలోనూ పాల్గొన్నారు. ఈ మూడింట్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది.
► కర్ణాటకలో బండి సంజయ్.. చింతామణి, ముల్బగల్, బాగేపల్లి, గౌరీబిదనూర్, చిక్కబల్లాపూర్ స్థానాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగు ప్రజలు అధికంగా ఉన్న కోలార్, చింతామణి, ముల్బగల్ నియోజకవర్గాల్లో బీజేపీ మూడో స్థానానికే పరిమితమైంది. ఇక గౌరీబిదనూర్‌లో అయితే ఏకంగా ఐదో స్థానానికి.. బాగేపల్లి, చిక్కబల్లాపూర్‌లో భారీ వ్యత్యాసంతో ఓటమి చవిచూసింది.
Comments
Please login to add a commentAdd a comment