రాయికల్: అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నడూ లేనివి ధంగా పలుకరింపులు, శుభాకాంక్షలు చెప్పడం కొత్త ఆనవాయితీకి దారితీసింది. మరో 21 రోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు ఎత్తుగడలు వేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నడూ కలవని సామాన్య కార్యకర్తలు, ఇతర పార్టీల నాయకులను సైతం తమ వైపు తిప్పుకొనేందుకు‘అన్నా.. బాగున్నావా.. ఈసారి జర నన్ను చూడే, ఒకసారి అవకాశం ఇవ్వవే.. మీకు రుణపడి ఉంటా..’ అంటూ పలుకరిస్తున్నారు.
జగిత్యాల జిల్లాకేంద్రంలోని ప్రతివార్డు, గ్రామంలోని ఎవరి బర్త్‌డే అయినా ముందుగా ఉదయం పూటనే అందరికంటే ముందుగా ఫోన్ చేసి బర్త్‌డే విషెష్ చెప్పడంతో ఎక్కడాలేని ప్రేమ సదరు నాయకుడికి కలగడం ఏంటని ఆశ్చర్యాని కి గురవుతున్నారు. కాసేపాగి ఓహో ఇది ఎన్నికల వేళ కదా అందుకే నాకు విషెష్ చెప్పారని తమలో తామే నవ్వుకుంటున్నారు.
ఎన్నడూ పలుకరించని నేత గుర్తుపెట్టుకుని శుభాకాంక్షలు చెప్పడం ఏంటని కొంతమంది బర్త్‌డే బాయ్‌లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంతేకాకుండా ఎన్నికల సందర్భంగా ఎక్కడాలేని చుట్టరికాన్ని కూడా కుదుర్చుకుంటూ సదరు చుట్టరికాలతో ఓట్లు పడేలా చేస్తున్నారు. ఏకంగా గ్రామాల్లో మాత్రం ఒకపార్టీకి చెందిన నాయకులు మరో పార్టీకి చెందిన నాయకులను జంప్ చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా తమ కులానికి సంబంధించిన వారంతా వ్యక్తికే ఓట్లు వేయాలని కుల రాజకీయాలు చేయడంలో పావులు కదుపుతున్నారు. ఏదేమైనా ఎన్నికల వేళలో కుల రాజకీయాలు బర్త్‌డే శుభాకాంక్షలు చెప్పడం, చుట్టరికాలు కలుపుకోవడం కొత్తరకం కలయికకు ఆనవాయితీగా ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment