జగిత్యాల క్రైం: జగిత్యాల పట్టణ సీఐ నటేశ్‌గౌడ్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ మల్టీ జోన్ ఐజీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే ఆయనను బదిలీ చేశారు. కానీ, ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్ చేస్తూ రిలీవ్ కాలేదు. ఈ నేపథ్యంలో కరీంనగర్ టౌన్–1 సీఐగా పని చేస్తున్న సమయంలో పలు భూ తగాదాల్లో తలదూర్చి, భూ ఆక్రమణదారులకు వత్తాసు పలికి, యజమానులపైనే కేసులు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.
దీనిపైన రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. జగిత్యాల సీఐగా చేస్తూ బైపాస్ రోడ్‌లోని ఓ భూ సెటిల్‌మెంట్ విషయమై ఇద్దరి వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారని, ఒక వ్యక్తికే వత్తాసు పలికినట్లు చర్చ జరిగింది. మరో వ్యక్తి ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకుల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. అలాగే, ఇటీవల బీట్‌బజార్‌లోని ఓ ఇంటి విషయంలో కుటుంబసభ్యుల మధ్య జరిగిన గొడవలో ఫిర్యాదు చేసిన మహిళపైనే కేసు సీఐ నమోదు చేశారు. జగిత్యాల తహసీల్దార్ కార్యాలయంలో సర్టిఫికెట్ జారీ చేసిన కేసులోనూ కొంతమంది పైనే కేసు పెట్టి, మిగతావారిని వదిలిపెట్టినట్లు ఆరోపణలున్నాయి.
బదిలీ నిలిపివేతకు ఒత్తిడి..
సీఐ నటేశ్‌గౌడ్‌ను 15 రోజుల క్రితం బదిలీ చేస్తూ మల్టీ జోన్ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు రాజకీయంగా ఒత్తిడి తీసుకువచ్చి, బదిలీ నిలిపివేయించారు. దీనిపై ఆగ్రహించిన రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు సీఐపై చర్యలు తీసుకున్నారు. ఇది జిల్లాలోని పోలీస్ వర్గాలో తీవ్ర చర్చకు దారితీసింది. భూ సెటిల్‌మెంట్లు, సివిల్ పంచాయితీల్లో తలదూర్చే పోలీసులపై నిఘా పటిష్టం చేశారు. ఇంటెలిజెన్స్‌తోపాటు ఎస్బీ పోలీసులు కూడా పోలీసు అధికారుల పనితీరుపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేస్తున్నారు.
అవినీతి ఆరోపణలు, నిర్లక్ష్యం
సీఐ నటేశ్‌గౌడ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతోపాటు ఆయన పనిచేసిన చోట విధుల్లో నిర్లక్ష్యం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి, సస్పెండ్ చేశారు.
– సన్ ప్రీతిసింగ్, ఎస్పీ, జగిత్యాల
Comments
Please login to add a commentAdd a comment