హత్య కేసు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ అఖిల్ మహాజన్, పక్కన డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి
పెళ్లి చెడగొట్టినందుకే మహిళ హత్య
అత్యాచారం..ఆపై కిరాతకంగా హతమార్చిన నిందితులు
నాలుగు రోజుల్లో కేసును ఛేదించిన పోలీసులు
వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వరుసకు సోదరుడి పెళ్లి చెడగొట్టిందని కక్ష పెంచుకున్న ఓ నిందితుడు తన స్నేహితుడి సహకారంతో మహిళను కిరాతకంగా హతమార్చిన కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు మాదిగాని రవీందర్, భూక్య మహేశ్‌ను అరెస్ట్ చేశారు. బుధవారం ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. వీర్నపల్లి మండలం వన్‌పల్లికి చెందిన శివరాత్రి మల్లవ్వను 2000 సంవత్సరంలో కోనరావుపేట మండలం ధర్మారంకు చెందిన రాములుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం.
తర్వాత కొన్ని కారణాలతో ఇద్దరూ విడిపోయారు. ఈనేపథ్యంలో మల్లవ్వ వన్‌పల్లిలో చిన్న గుడిసె వేసుకొని ఒంటరిగా ఉంటోంది. ఈక్రమంలో మల్లవ్వ బంధువుల అమ్మాయికి ప్రస్తుత నిందితుడు మాదిగాని రవీందర్ (వరుసకు సోదరుడు) సోదరుడైన దేవరాజుతో పెళ్లి చేసేందుకు నిర్ణయించారు. ఈ విషయంలో మల్లవ్వ జోక్యం చేసుకొని దేవరాజుకు ఫిట్స్ వ్యాధి ఉందని చెప్పడంతో పెళ్లి క్యాన్సిల్ అయింది. కొద్ది రోజులకు దేవరాజు ఫిట్స్‌తో మృతిచెందాడు. దీంతో దేవరాజుకు పెళ్లి కాకుండా చెడగొట్టిందనే కోపంతో కక్ష పెంచుకున్న వేములవాడ మండలం అగ్రహారంకు చెందిన మాదిగాని రవీందర్, తన స్నేహితుడు టెక్స్‌టైల్స్ ఇందిరమ్మకాలనీకి చెందిన భూక్య మహేశ్‌తో కలిసి మల్లవ్వ హత్యకు పథకం రచించారు.
సిరిసిల్ల లేబర్ అడ్డా వద్ద స్నేహితులైన వీరిద్దరు గతంలో ఈజీగా డబ్బు సంపాదించేందుకు అనేక నేరాలు చేశారు. దొంగతనం ఘటనల్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. ఈ స్నేహంతోనే వీరిద్దరూ కలిసి ఈనెల 8న రాత్రి మల్లవ్వ ఇంటికి వెళ్లారు. బాగా రాత్రి అయిందని, ఇక్కడే పడుకొని ఉదయం వెళ్తామని నమ్మబలికారు. రాత్రి మల్లవ్వపై అత్యాచారం చేసి అనంతరం కొడవలితో గొంతుకోసి కిరాతకంగా హత్య చేశారు. ఘటన స్థలంతో పాటు మల్లవ్వ మృతదేహంపై కారంపొడి చల్లి పరారయ్యారు. సీసీ కెమెరాల పుటేజీలు, క్లూస్‌టీం, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌గౌడ్, ఎస్సైలు రమేశ్, రమాకాంత్, రామ్మోహన్, జువైద్, క్రైం టీం సిబ్బంది నాలుగు రోజుల్లో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించిన అధికారులను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment