న్యాయం చేయాలని వేడుకుంటున్నసుబ్బారావు కుటుంబసభ్యులు
జ్యోతినగర్(రామగుండం): వంటలు తయారు చేసే ఓ కాంట్రాక్టు కంపెనీ నిర్వాహకులు పనులు చేసేందుకని తమ తండ్రి ఈర సుబ్బారావు(58)ను రామగుండం ఎన్టీపీసీకి తీసుకొచ్చారని, ఆ తర్వాత ఏమైందో గానీ, కొద్దిరోజులకే శవాన్ని అప్పగించారని మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణానికి చెందిన బాధితుల కథనం ప్రకారం.. సుబ్బారావు పలు కంపెనీల్లో వంటలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో గతేడాది మార్చిలో ప్రభాత్ ఇంజినీరింగ్ వర్క్స్ కంపెనీ ద్వారా ఎన్టీపీసీ రామగుండం ప్లాంట్ క్యాంటీన్‌లో పనులు చేసేందుకు రప్పించారు.
అయితే, ఆ కంపెనీకి చెందిన ఓ వ్యక్తి 2023జూలై 30న సుబ్బారావు చనిపోయాడని ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే రామగుండం బయలుదేరిన కుటుంబసభ్యులు.. వరంగల్ చేరుకునేలోగా ఆ వ్యక్తి మరోసారి ఫోన్‌చేసి మృతదేహాన్ని భద్రాచలం పంపిస్తున్నామని చెప్పాడు. వెనుదిరిగిన కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందామని నచ్చజెప్పి వెళ్లిపోయారు. తమ తండ్రి ఎలా చనిపోయాడని కంపెనీ నిర్వాహకులను ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వలేదు. పైగా సెటిల్ చేద్దామన్నారు. ఈవిషయంలో పోలీసులకు ఫిర్యాదు చేకుండా అడ్డుకున్నారు.
న్యాయం చేయండి – ఈర మురళీ కృష్ణ(కుమారుడు), కుల్పగిరి దేవకి(కూతురు), భద్రాచలం
వంట పనుల కోసం మా నాన్నను ఎన్టీపీసీ తీసుకొచ్చిన కంపెనీ నిర్వాహకులు చంపి మృతదేహాన్ని అంబులెన్స్‌లో మా ఇంటికి తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోయారు. ఆయన చనిపోయి ఏడు నెలలు కావస్తున్నా కంపెనీ వారు మమ్మల్ని సంప్రదించడం లేదు. ఫోన్‌చేస్తే సమాధానం ఇవ్వడం లేదు. మృతదేహంతో పంపిన కాగితాల్లో కూడా మృతికి గల వివరాలు పొంతన లేకుండా ఉన్నాయి. న్యాయం చేయాలని ఎన్టీపీసీ పోలీసులకు విన్నవించాం. మాది పేద కుంటుంబం. మా అమ్మ మంగ గతంలోనే చనిపోయింది. మా నాన్న సుబ్బారావు మా ఐదుగురు సంతానాన్ని కష్టపడుతూ పోషించాడు. ఇప్పుడు నాన్న లేడు. మాకు ఆధారం లేకుండా పోయింది. మా కుటుంబానికి న్యాయం చేయండి. తమ్ముడు విజయదుర్గాప్రసాద్ కూడా గతంలోనే చనిపోయాడు. ఇప్పుడు మాకు ఆసరా లేకుండాపోయింది. కార్మిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు జోక్యం చేసుకుని మా కుటుంబానికి న్యాయం చేయండి.
Comments
Please login to add a commentAdd a comment